భారత దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్
జననం: 3 డిసెంబర్ 1884
మరణం: 28 ఫిబ్రవరి 1963
డా. రాజేంద్ర ప్రసాద్ (డిసెంబర్ 3, 1884 – ఫిబ్రవరి 28, 1963) భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి (Constituent Assembly) అధ్యక్షత వహించారు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు.
రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో జన్మించారు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డారు. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసారు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నారు. మరల ఇంకోసారి ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు.
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. మొదట్లో సైన్సు విద్యార్ధి. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చారు.ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక,బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందారు.రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివసించేవారు, అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపారు.
1911 లో, కాంగ్రేసు లో చేరారు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగారు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో చేరారు.ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.
న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు.1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత'దేశ్'అనే హిందీ పత్రికనూనడిపారు.1921 లో మహాత్మా గాంధీ తో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశారు.పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్లో చేర్చారు. ఈ విద్యాపీఠాన్ని1921 లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపారు. 1924 లో బీహారు బెంగాల్లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించారు. జనవరి 15, 1934 న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నారు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టారు. అలా భూకంప బాధితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.
రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947 లో ఇంకోసారి మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్ర్యంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచారు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసారు.హిందీ,సంస్కృతం,ఉర్దూ,పర్షియన్,ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేన్ద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ,ఇండియా డివైడెడ్,ఆత్మకథ,ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.
పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు అనగా సెప్టెంబర్ 1962 లో, అతని భార్య రాజ్వంశీ దేవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు,అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". ఫిబ్రవరి 28, 1963 న రాం రాం అంటూ కన్ను మూశారు.
దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు.
No comments