Breaking News

తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

జననం : 1899, మార్చి 6 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి 
మరణం : 1949 , ఆగష్టు 30 
భర్త : నరసింహశర్మ 
తండ్రి : మల్లవరపు శ్రీరాములు 
తల్లి:  సీతమ్మ



తల్లాప్రగడ విశ్వసుందరమ్మ (1899 - 1949) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి.

ఈమె 1899 మార్చి 6 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మల్లవరపు శ్రీరాములు మరియు సీతమ్మ. ఈమెకు 9వ ఏట తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహం జరిగింది. పండితులైన తండ్రిగారి వద్దనే ఉండి ఉభయ భాషా ప్రవీణ, సాహిత్య శిరోమణి పరీక్షలు చదివారు. 16 సంవత్సరాల వయసులో భర్త దగ్గరకు కాకినాడ వచ్చారు. ఆకాలంలో నరసింహశర్మ పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సూపరింటెండెంటుగా ఉన్నారు. 1921లో దంపతులిద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై విజయవాడలో జరిగిన కాంగ్రెసు సమావేశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత, శాసనోల్లంఘన, విదేశీ వస్త్ర దహనాలు, వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాదు కాంగ్రెసుకు వెళ్లి అక్కడ సబర్మతీ ఆశ్రమంకు వెల్లి, గాంధీజీని దర్శించుకున్నారు. తిరిగివచ్చిన పిమ్మట వారిరువురూ స్థిరపడి ఒకచోట కార్యక్రమాలు నిర్వహించాలనుకొని రాజమండ్రి గోదావరి తీరాన "ఆనంద నికేతనాశ్రమం" 1923లో స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ జనాభ్యుదయం, నూలు వడకడం, ఖాదీ నేయడం, అనాధలను ఆదరించడం వంటి కార్యకలాపాలు ఈ ఆశ్రమం ద్వారా సాథించారు.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని చురుకుగా పాల్గొని, శాసనధిక్కారం చేసి, బహిరంగంగా విదేశ వస్తు దుకాణాల వద్ద పికెటింగులు చేశి 1930లో జైలుకి వెళ్ళి 6 నెలలు శిక్షను అనుభవించారు. 1932లో శాసనోల్లంఘనం రెండవ ఘట్టం సమయంలో ప్రభుత్వం దమననీతిని అవలంబించింది. సభలు, సమావేశాలను నిషేధించింది. ఆజ్నల్ని ఉల్లంఘించి తెనాలిలో మండల కాంగ్రెసు సభను జరిపారు. మరో 6 నెలలు జైలుశిక్షను రాయవెల్లురులో అనుభవించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ప్రభుత్వం ఆనంద నికేతనాశ్రమాన్ని స్వాధీనపరుచుకున్నది.

1920 - 1949 మధ్యకాలంలో ఈమె రాసిన 125 పద్యాలను ఆమె మరణానంతరం 1973లో ఆమె సోదరులు "కవితా కదంబం" అనే పేరిట ఒక సంపుటిగా ప్రచురించారు. ఈమె అభ్యుదయ దృక్పథం ఉన్న కవయిత్రి. ఆమె మంచి వక్తగా పేరుపొందారు. "వైతాళికులు" సంకలనంలో ఈమె కవితలు చోటుచేసుకున్నాయి.

ఈమె 1949 ఆగష్టు 30 తేదీన స్వర్గస్తులయ్యారు.

1 comment:

  1. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ

    ReplyDelete