Breaking News

మహాజ్ఞానిని కూడా అనుసరించరాదు


శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్యః. ఆచరించి చూపువాడు. ఆచరణలేని విద్య ఎవరికి పనికొస్తుంది? ఆయన ఫలానా పనిచేయడు, కానీ చేయాల్సిందిగా అందరికీ చెబుతుంటాడు. ఆయనే చెయ్యనప్పుడు ఇంకెవరు చేస్తారు. మరొకాయన పరమనిష్ఠాపరుడు. ప్రాణం పోయినా అది చేయకుండా ఉండడు. ఆ మంచిపని ఒక్కటి చాలు పదిమందికి మార్గదర్శకత్వం వహించడానికి. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. జాగ్రత్తగా గమనించాలి.

ఆచరణ చేసే గురువుంటాడు, చెయ్యని గురువుకూడా ఉంటాడు. ఇద్దరూ గురువులే. ఒక గురువుకు ఆచరణ ఉండదు. ఆచరణ లేదు కాబట్టి గురువుకాడని అనలేం. ‘నేను ఆత్మ’ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయే స్థాయికి వెళ్ళిన వాళ్ళుంటారు. భగవాన్‌ రమణులలాంటివారు. ఆయనకు ఒంటిమీద బట్టకూడా అక్కర్లేదు. ‘అయ్యా, మీకయితే సర్వం బ్రహ్మం. కానీ మాకు మాత్రం తేడాలున్నాయి. ఓ గోచీ అయినా పెట్టుకోండి’ అని శిష్యులంటే పెట్టుకున్నారాయన. ఆయనకు – శరీరంవేరు, ‘నేను’ వేరు. ఇది తెలుసుకున్న ఆయన మహాజ్ఞాని. ఆయన ఫలానా పనులేవీ చేయడు కదండీ, నేను కూడా మానేస్తానంటే కుదరదు.

ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. మహాజ్ఞానిని, అజ్ఞానిని. ఇది బాగా గుర్తుంచుకోండి. మహాజ్ఞానిని అనుకరించకూడదు. రామకృష్ణ పరమహంసకు కంఠంలో రాచపుండు పుట్టింది. అన్నం మింగలేకపోతున్నారు. ఒకసారి  వివేకానందుడు ఆయనతో ‘మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, ‘‘అమ్మా ! అన్నం తినలేకపోతున్నా’’ అని చెప్పుకో కూడదా? తినే అవకాశం కల్పిస్తుంది కదా !’ అని సూచించాడు. ‘సరే, అయితే అడుగుతా నుండు. అని లోపలికి వెళ్ళివచ్చారు. ‘‘ఏమంది అమ్మ?’’ అని అడిగారు వివేకానందుడు. ‘ఇన్ని కంఠాలతో తింటున్నది నీవు కాదా!’ అన్నదని చెప్పారు. అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. అలా మనం ఉండగలమా? ఆయనలా నీవు ఉండగలిగితే నీవు కూడా ఆయనను అనుకరించవచ్చు. గోచీపెట్టుకోంగానే రమణ మహర్షికాలేం కదా !
మహాజ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. శస్త్రచికిత్స చేసారు. ఆ పుండు కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదట. వేడి తగిలితే శరీరం బద్దలై రక్తం చుక్కలు చుక్కలుగా కింద పడిపోతుందట. అది తెలియక ఆయన అనుచరగణం అది చలికాలం కావడంతో మంచం కింద హీటరు పెట్టారు. శరీరమంతా బద్దలైపోయి ఆయన నెత్తురు చుక్కలుగా కారి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి ‘ఎవరు పెట్టారు హీటరిక్కడ’ అని అడిగితే ‘చలిగా ఉందని పెట్టామండీ, ఇంత అనర్థం అవుతుందని తెలియదే’ అన్నారు
‘ఇంత నెత్తురు కారిపోతుంటే మమ్మల్ని పిలవొచ్చుగా లేదా మీరే దాన్ని తీసేయచ్చుగా అన్నారు డాక్టర్లు. రమణులన్నారు తాపీగా..’’దీనికి (శరీరానికి) బాగుంటుందని వారు (హీటర్‌) పెట్టారు, బాగుండదని మీరంటున్నారు. ఇది బాగాలేదని అదేమో బద్దలయిపోయింది. ఈ మూడూ చూస్తున్నా.’’ అన్నారు..! అందుకే మహాజ్ఞానిని అనుకరించరాదు.

ఇక అజ్ఞాని–వాడికేం తెలియదు. ఏదయినా పద్ధతి చెబితే చెయ్యనంటాడు. ఆయన చెయ్యడం లేదు కాబట్టి నేను కూడా చెయ్యను అనకూడదు. అలా అజ్ఞానిని అనుకరించరాదు. మరెవరిని అనుకరించాలి? శాస్త్రమెరిగి పాటించే వారిని అనుసరించాలి. అలా శాస్త్రం తెలుసుకుని పాటించేవాడు ఆచార్యుడు. ఆయనను అనుసరించాలి. ఎప్పటివరకు? నీవు పండేవరకు.
మూలం: సాక్షి దినపత్రిక.

1 comment:

  1. ఆచరణ చేసే గురువుంటాడు, చెయ్యని గురువుకూడా ఉంటాడు. ఇద్దరూ గురువులే. ఒక గురువుకు ఆచరణ ఉండదు. ఆచరణ లేదు కాబట్టి గురువుకాడని అనలేం.

    ReplyDelete