Breaking News

ఘంటసాల - లోకాన్ని లాలించాడు ( 13న మధుర గాయకుడు ఘంటసాల వర్థంతి సందర్భంగా..)


తెలుగు చలనచిత్ర రంగంలో సినిమా పాటలకు గాత్రదానం చేసిన ఆద్యుల్లో ఒకడు... ఆరాధ్యనీయుల్లో ప్రథముడు... ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన గొంతులో రాగం జీవం పోసుకుంటుంది. ఆ రాగతరంగాలు శ్రోతల హృదయవీణను సుతారంగా మీటుతాయి. ఘంటసాలగా ఆయన సుప్రసిద్ధుడు. సంగీత ప్రపంచంలో ఆయన కంఠం నిత్యవసంతం. ఆయన ఏ రాగాన్ని ఆలపించినా ప్రపంచం పరవసిస్తుంది. ఏ గీతాన్ని పాడినా లోకాన్ని లాలించినట్టుంటుంది. ఆయన గానామృతానికి మనసు తనను తానే మైమరచి దూదిపింజలై గాలిలో తేలిపోతుంది. విసిరేసిన గాలిపటంలా శూన్యగగనంలోకి ఎగిరిపోతుంది. ఆ మధుర గాయకుడు ఘంటసాల మనమధ్య లేకున్నా, ఆలాపన మాత్రం సంగీత హృదయాల్లో ధ్వనిస్తూ, ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఘంటసాల తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజంపైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ, పాటలు పాడుతూ నాట్యం చేసేవారు. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఆయన సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇది భరించలేని ఘంటసాల తన దగ్గరున్న నలభై రూపాయలు విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాలగా ఉన్న విజయనగరం చేరుకున్నారు.

విజయనగరం చేరేటప్పటికి వేసవి సెలవులు కారణంగా కళాశాల మూసి ఉండటంతో ఆయన ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి అభ్యర్థించగా, ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. ఇలాఉండగా తోటి విద్యార్థులు చేసిన తప్పునకు ఘంటసాలను ఆ కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసిన వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. అప్పుడు ఆ గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్ర్తీ ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు. శాస్ర్తీ చాలా పేదవాడు కావడంతో ఘంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు. ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మధూకరం చేయడం నేర్పించారు. భుజాన జోలెకట్టుకుని వీధివీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకునేవారు. గినె్న కొనుక్కోవడానికి డబ్బులు లేక తన మేనమామకు ఉత్తరం రాస్తే ఆయన పంపిన డబ్బుతో ఒక డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరుచుకునేవారు ఘంటసాల.

కొన్నాళ్ళ తర్వాత ఘంటసాల విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచిపేరు తెచ్చుకుని తన సొంత ఊరు అయిన చౌటపల్లికి చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాల్లో పాటలు పాడుతూ సంగీత పాఠాలు నేర్పేవారు. 1942లో స్వాతంత్య్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు ఆలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకు తన దగ్గరి ఊరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను ఘంటసాల కలిశారు. ఆయన సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి తనను కలుసుకోమని చెప్పారు.

రెండు నెలలు ఘంటసాల కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పుచేసి మద్రాసు చేరుకుని సముద్రాలను కలుసుకున్నారు. ఆయన ఘంటసాలను రేణుక ఫిలింస్ ఆఫీసుకు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బియన్ రెడ్డిల ముందు పాటలు పాడించారు. వారిరువురూ ఘంటసాల పాటలు విని అవకాశాలు ఉన్నప్పుడు చెప్తామన్నారు. సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్క్ వాచ్‌మెన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చారు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రయ్యేసరికి పానగల్ పార్క్‌లో నిద్రించేవారు. ఆయన తీరిక సమయాల్లో ఆ పార్కులో ఉండే ఒక బండరాయిపై కూర్చుని పాటలు పాడేవారు. ఆ దినాల్లో అది ఘంటసాల బండగా పేరుగాంచింది. చాలాకాలంగా ఉన్న బండ ప్రస్తుతం లేదు. చివరికి సముద్రాల ఆయనకు మద్రాసు రేడియో కేంద్రంలో లలిత గీతాలు పాడే అవకాశం ఇప్పించారు. అలా పాటలు పాడుతూనే మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవారు. మరొకప్రక్క బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.

ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బియన్ రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారిగా నేపథ్యగాయకుడిగా అవకాశం ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ఆయనకు ధైర్యం చెప్పేవారట. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తరువాత భానుమతి రామకృష్ణలు నిర్మించిన ‘రత్నమాల’ చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేసే అవకాశం కలిగింది.

ఆ తర్వాత మన దేశం, బాలరాజువంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. 1951లో ‘పాతళభైరవి’ చిత్రం విజయంతో ఘంటసాల పేరు ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకొచ్చారు ఘంటసాల. తర్వాత విడుదలైన ‘మల్లీశ్వరి’ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి కారణం సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే.

ఘంటసాలకు కులమత పట్టింపులు ఉండేవి కావు. 1950 కాలంనాటి పరిస్థితులు ఏవిధంగా ఉండేవో అందరికీ తెలిసిన విషయమే అయినా, ఆయన చాలా సందర్భాల్లో హరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలను చేసేవారు. ఒకరోజు గుర్రం జాషువా కవి ఘంటసాల ఇంటికి వస్తే ఆయనకు ఎదురెళ్లి స్వాగతం చెబుతూ, ఇంట్లోకి వెళ్ళారట ఘంటసాల జాషువా కవి తన వెనుకేవస్తున్నారు అనుకుని. కానీ ఆ మహాకవి ఇంటి బయటే నిలుచుండి పోవడంతో అది గమనించిన ఘంటసాల -ఇంట్లోకి రండి కవిగారూ. అలా బయటే నిలుచుండి పోయారేం? అని అంటే, దానికి జాషువా -మీరు బ్రాహ్మణులు కదా! నేను మీ ఇంట్లోకి రావచ్చో లేదో అని బయటే ఉండిపోయాను అన్నారట. వెంటనే ఘంటసాల ఆ మహాకవిని తన ఇంట్లోకి ఆప్యాయంగా తీసుకెళ్ళి వారితో కలిసి భోజనం చేశారట. అలాంటిది ఘంటసాల సంస్కార సున్నిత హృదయం. హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఆలీఖాన్ ఎప్పుడు మద్రాసు వచ్చినా ఘంటసాల ఇంట్లోనే బసచేసేవారు. భగవద్గీత తెలుగులో పాడాలని నిర్ణయించుకొని ఆ మహత్కార్యాన్ని 1973లో పూర్తి చేశారు. దురదృష్టం ఏంటంటే ఆయన గానం చేసిన భగవద్గీత రికార్డులు విడుదల కాకుముందే ఘంటసాల మరణించడం.

1953లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రంలోని పాటలన్నీ ఘంటసాల జీవితంలో కలికితురాయిగా నిలిచిపోతాయి. ఘంటసాల ఎంత గొప్ప స్థితికి చేరుకున్నా తనను ఆదరించిన వారిని మాత్రం ఎన్నడూ మరువలేదు. ఆయన ఎప్పుడు ఎవరినీ నొప్పించే వారు కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గానగంధర్వుడు, ప్రతిభాశాలి అయిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు. 1944 మార్చి 4న తన మేనకోడలైన సావిత్రిని వివాహం చేసుకుని ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన ఘంటసాల, 1974 ఫిబ్రవరి 11న శాశ్వతంగా కన్నుమూసి జనరస హృదయాల్లో కలకాలం నిలిచిపోయారు.
Source: Andhra Bhoomi

1 comment:

  1. ఘంటసాల - లోకాన్ని లాలించాడు ( 13న మధుర గాయకుడు ఘంటసాల వర్థంతి సందర్భంగా..)

    ReplyDelete