Breaking News

పెంపుడు పల్లెలు


నిండా వందిళ్లు లేని ఆ మారుమూల పల్లె పేరు.. పుట్టంరాజువారి కండ్రిగ. సరిగ్గా నలభై రోజుల క్రితం వరకు ఆ వూరి పేరు బయటి ప్రపంచానికి తెలీనే తెలీదు. తెలియాల్సినంత వైభవమూ ఆ పల్లెకు లేదు. దేశంలో ఉన్న 2 లక్షల 65 వేల పంచాయతీల పరిధిలో ఉన్న 8 లక్షల పల్లెల్లో ఇదొకటి. దానిగురించి ఎవరికి తెలుస్తుంది కనుక. 
* * * అయితే- ఇంతలోనే ఇప్పుడు దేశమంతా ఆ పల్లెవైపు చూస్తోంది. అంతకంటే ముందే క్రికెట్ దేవుడు, ఎంపీ సచిన్ టెండూల్కర్ చూపు ఆ పల్లెపై పడింది. ఆ పల్లెలో అతడి అడుగుపడింది. అంతే.. ఆ గ్రామానికి కొత్త కళ వచ్చేసింది. ఆరువందలమంది జనం ఉన్న ఆ పల్లెకు ఇప్పటికి వచ్చిపోతున్న కొత్తవారి సంఖ్య వేలకు చేరుకుంటోంది. ఆ పల్లె అభివృద్ధి కోసం కోట్లకొద్దీ నిధులు కురుస్తున్నాయి... అభివృద్ధి పనులు శరవేగంతో మొదలైపోయాయి కూడా.. ఇప్పటికిప్పుడు అంత మార్పు ఎలా సాధ్యమైంది...? పుట్టంరాజువారి కండ్రిగ కథలోకి మళ్లీవద్దాం.... 
* * * దివిసీమ ఉప్పెన, తుపానులు, సునామీ వచ్చినప్పుడు, భారీ వర్షాలు కురిసినప్పుడు విలవిల్లాడిపోయే తీరప్రాంత పల్లెలు.. తూర్పుతాళ్ల, పెదమైనవానిలంక. వాటిని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్నారు. తమిళనాడు ఆడపడుచైన ఆమె మెట్టినిల్లయిన ఏపీలో రెండు ఊళ్లను స్వర్ణ గ్రామాలు చేస్తామంటున్నారు. మొన్నటికి మొన్న మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తన నియోజకవర్గం పరిధిలోకి రాని చిన్నఊరు బేటీని దత్తత తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి నియోజకవర్గంలోని జయపుర అనే ఓ చిన్న ఊరిని దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మధుర నియోజకవర్గంలోని రావల్ అనే ఓ కుగ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామంటున్నారు- డ్రీమ్‌గర్ల్ హేమమాలిని. ఒకప్పుడు శ్రీకృష్ణపరమాత్ముడు, రాధ చెట్టపట్టాలు వేసుకు తిరిగిన ప్రాంతంగా చెప్పుకునే ఈ పల్లెవైపు ఇంతవరకు కనె్నత్తి చూసేవాళ్ళెవరూ లేరు. ‘రాధే...రాధే..’ అని ఒకప్పుడు కృష్ణుడు నడయాడిన ఈ నేలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానంటున్నారు హేమమాలిని. ఇలా ఒక్కో ఎంపీ ముందుకు అడుగులేస్తున్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 11న మోదీ ప్రకటించిన ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ ప్రభావం ఇది. ప్రతి ఎంపీ సొంత గ్రామాన్ని కాకుండా ఐదు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ఏడాదికి ఒక గ్రామం చొప్పున అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతే- చాలామంది ఎంపీలు ఇప్పుడు ‘పల్లెకుపోదాం’ అన్న పల్లవి అందుకున్నారు. పనిమొదలెట్టారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు కరెంటే సరిగా లేని ఆ పల్లెలు వచ్చే ఏడాది ఇదే సమయానికి ‘నెట్టి’ళ్లవుతాయి. వైఫై సౌకర్యమూ ఉంటుంది. చేతిలో వౌస్ పట్టుకుని విశాల ప్రపంచంలో విహరించవచ్చు. ఇంటికి కుళాయి, వంటగ్యాస్ పైప్‌లైన్ సైతం వచ్చేస్తాయి. ఇన్నాళ్లూ రహదారే ఎరుగని ఆ పల్లెలకు మీరెళితే రాచబాట పరుస్తాయి. ప్రతి ఇంటికి టాయిలెట్ తప్పనిసరి. బ్యాంకు, పోస్ట్ఫాసు, ఆస్పత్రులు, కమ్యూనిటీ హాల్స్, చెరువులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇక డ్రెయినేజీ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తారు. శ్మశానవాటిక నుంచి పశువుల ఆస్పత్రివరకు అన్నీ సమకూరుస్తారు. మొత్తమీద ఆ ఆధునిక పల్లెలో ‘స్మార్ట్’గా బతికేయొచ్చన్నమాట! మోడల్ విలేజ్ గ్రామాల అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు ఎనె్నన్నో పథకాలు అమలు చేశాయి. యుపిఎ హయాంలోనూ ఓ పథకం అమలు చేశారు. అయితే దాన్ని షెడ్యూల్డు తరగతులు, కులాలవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే పరిమితం చేశారు. ఇప్పటివరకు ఉన్న అలాంటి పథకాలకు భిన్నంగా ఈ కొత్త పథకం రూపుదిద్దుకుంది. సంపూర్ణ బలంతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు తరపున ప్రధాని ప్రకటించిన ఈ ఆదర్శ గ్రామాల పథకంపై ఇప్పుడు పల్లెజనం కొత్త ఆశలు పెట్టుకున్నారు. సచిన్ వంటి సెలబ్రిటీ ఏపీలో ఓ కుగ్రామాన్ని ఎంపిక చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకానికి తగినంత ప్రచారం వచ్చిందనే చెప్పాలి. ఇదీ లక్ష్యం.. ఈ పథకం కింద ప్రతి ఎంపీ ఐదు గ్రామాలను అభివృద్ధి చేయాలి. 2019లోగా ఇది పూర్తికావాలి. దేశంలో లోక్‌సభలో 543, రాజ్యసభలో 250 (నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఒక్కొక్కరు ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. ఎంపీ లాడ్స్ నుంచి వచ్చే నిధులు, సొంత నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందే నిధులు ఆయా పల్లెల అభివృద్ధికి వెచ్చించాలి. ఇలా 2019లోగా 2,379 గ్రామాలను తీర్చిదిద్దాలన్నది ఆ పథకం లక్ష్యం. ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల వివరాలు, వాటి ప్రగతి కోసం చేసిన ప్రణాళికలను కేంద్రం ఏర్పాటు చేసిన విభాగానికి తెలియచేయాలి. ఆ పనులను రెండు జాతీయ స్థాయ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మోదీ... జయపుర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా వారణాసినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని జయపుర గ్రామాన్ని ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ కింద దత్తత తీసుకున్నారు. దాదాపు 3 వేలమంది జనాభా ఉన్న ఈ గ్రామాన్ని కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ క్రమం తప్పకుండా ‘శాఖ’ నిర్వహిస్తారు. ఈ గ్రామంలో మహిళల సంఖ్యకన్నా పురుషుల సంఖ్య ఎక్కువ. అందుకే జయపురను దత్తత తీసుకుంటున్నట్లు మోదీ ప్రకటించినప్పుడు ఓ మాట అన్నారు. ‘ఆడపిల్లలను కడుపులోనే చంపొద్దు.. భ్రూణహత్యల వల్ల జనాభా సమతుల్యత దెబ్బతింటోంది.. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఐదుమొక్కలు నాటండి.. వారితోపాటు అవి పెరిగి ఆదుకుంటాయి...’ అని పిలుపు ఇచ్చారు. ఇక్కడ పురుషుల సంఖ్య 1,541 అయితే మహిళలు 1433 మందే ఉన్నారు. గ్రామంలో 70శాతం ఇళ్లు మట్టితో కట్టినవే. ఎక్కువమంది కార్మికులే. ఎస్సీ,ఎస్టీలున్నా మైనారిటీలు అసలు లేరు. 24శాతం ఇళ్లలో మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి. 73 శాతం మంది ఆరుబయటే అవసరాలు తీర్చుకుంటారు. కానీ, చాలామందికి ఫోన్ సౌకర్యం ఉంది. 4.5 శాతం మందికి లాప్‌టాప్ సౌకర్యమూ ఉంది. దీనిని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తానని ప్రధాని ప్రతిన బూనారు. తన ఎన్నికల వేళ ఈ గ్రామానికి చెందిన ఐదుగురు ప్రమాదానికి లోనయ్యారని, అందుకే తాను జయపురను దత్తత తీసుకున్నానని చెప్పారు. నిజానికి ఆ గ్రామాల ప్రజలే తమను దత్తత తీసుకున్నట్లని ఆయన ఛలోక్తి విసిరారు. నిర్మలా సీతారామన్.. .రెండు ఊళ్లు అలనాడు సీతమ్మకు, లంకకు సరైన సంబంధాలు లేవుగానీ ఈనాటి నిర్మలా సీతారామన్‌కు- పశ్చిమగోదావరి జిల్లాలోని పెదమైనవానిలంకకు మంచి లంకె కుదిరినట్టే ఉంది. అలాగే తూర్పుతాళ్లుకూ ఆమెవల్ల మంచిరోజులే వచ్చాయి. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతనిధ్యం వహిస్తున్న ఆమె స్వరాష్ట్రం తమిళనాడు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి. ప్రభాకర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కావడంతో నిర్మలా సీతారామన్ మెట్టినిల్లయ్యింది. అందరూ ‘నరసాపురం కోడలు’గా నిర్మలా సీతారామన్ పిలుస్తుంటారు. మెట్టినింటికి ఏదో చేయాలన్న తపన ఆమెకు ఆనాటి నుండి ఉంది. ప్రధాని మోదీ ఆదర్శ గ్రామాల పథకం ప్రకటించిన వెంటనే పశ్చిమగోదావరి జిల్లా తీర ప్రాంతంలో గంగపుత్రులు నివసించే పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకున్నారు. 1986లోని ఉప్పెనకు, 1996లోని భారీవర్షాలకు, 2004 సునామీకి, ఏటా కురిసే భారీవర్షాలు, తుపాన్లకు ఎదురునిలుస్తూ జీవన సమరం సాగిస్తున్న గంగపుత్రుల గ్రామాలను దత్తత తీసుకోవడంతో అందరిలోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక మహిళా మంత్రి దత్తత తీసుకున్న ఈ రెండు గ్రామాలకూ ప్రస్తుతం మహిళలే సర్పంచ్‌లుగా ఉండటం విశేషం. కత్తిమీద సామే...! దత్తత తీసుకున్న ఈ రెండు గ్రామాలను అభివృద్ధి చేయడం కత్తిమీద సామేనని చెప్పవచ్చు. నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక (పిఎం లంక) సముద్రానికి కూత వేటు దూరంలోనే ఉంది. గతంలో తూర్పుతాళ్లు శివారు గ్రామంగా ఉండగా, 1994లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామం కొద్ది సంవత్సరాలుగా సముద్రం కోతకు గురవుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన సుమారు 450 ఎకరాల జిరాయితీ భూమి సముద్రంలో కలిసిపోయింది. ఇలా కొద్ది కొద్దిగా కొంత కాలానికి తమ గ్రామం మొత్తం సముద్రంలో కలిసిపోతుందనేది ఆ గ్రామస్థుల భయం. గ్రామం సముద్రపు కోతకు గురికాకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది వారి ప్రధాన కోరిక. ఇందుకోసం గతంలో సుమారు రూ.900 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోలేదు. ఇక గోదావరి జలాలతో ఈ ప్రాంతవాసుల దాహర్తి తీర్చాల్సి ఉంది. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు ఎక్కువగా చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సముద్రం కోతకు గురికావడం, వేటకు ఈ ప్రాంతం అనువుగా లేకపోవడం వంటి కారణాల రీత్యా గ్రామాల్లోని ప్రజలు దాదాపు సగం మంది ఒడిశా, తెలంగాణ, కోల్‌కతా తదితర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్, విద్య తదితర సమస్యలు ఈ గ్రామాల్లో ఉన్నాయి. పెదమైనవాని లంక గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల మాత్రమే అందుబాటులో ఉంది. ఉన్నత పాఠశాల కావాలనేది గ్రామస్థుల కోరిక. తూర్పుతాళ్లు గ్రామంలో ఉన్నత పాఠశాల అందుబాటులో ఉంది. అయితే, తీరప్రాంత గ్రామాల పిల్లలకు ఉపయోగపడేలా ఒక కళాశాల స్థాపించాలనేది ఈ రెండు గ్రామాల ప్రజల కోరిక. పెదదమైనవానిలంక జనాభా 3 వేలు. ఇక్కడివారు చేపలవేటతోపాటు దాదాపు 3,600 ఎకరాల్లో ఉప్పు పండిస్తారు. వైద్య సదుపాయం లేదు. విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో ఉండదు. తుపాను షెల్టరు సౌకర్యం లేదు. నల్లిక్రీకు డ్రెయిన్‌కు పూడిక తీస్తే చేపల వేటకు అనువుగా ఉంటుంది. అత్యధికులకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. తూర్పుతాళ్లు.. ఏడువేలమంది ప్రజలు ఉన్న తూర్పుతాళ్లులో అత్యధికులు బిసీలు, ఎస్సీలు. సరుగుడు తోటలు, కూరగాయలు, ఉప్పు పంట పండించడం ప్రధాన వృత్తి. ఇక్కడున్న పీహెచ్‌సీ స్థాయి పెంచాలన్నది డిమాండ్. విద్యుత్ సరఫరా అంతంత మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో దత్తత గ్రామాలు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఈ ఏడాది దత్తత గ్రామాలను ఎంపిక చేసుకోవడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తలమునకలైనారు. ఇప్పటికే కొందరు గ్రామాల ఎంపికను పూర్తి చేస్తే మరికొందరు ఇకా సమాచార సేకరణలో ఉన్నారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కరీంనగర్ ఎంపీ ఇంకా గ్రామాల ఎంపికక కసరత్తు చేస్తున్నారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ గెడెం నగేష్ ఇంకా ఏ పల్లెనూ దత్తత తీసుకోలేదు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావు, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నారు. శ్రీహరి వర్ధన్నపేట మండలం ఐనవోలును, నెల్లికుదురు మండలం నారాయణపురాన్ని సీతారాం నాయక్, కొడకండ్ల మండలం ఎడునూతలను ఆనంద్‌భాస్కర్, ఆత్మకూరు మండలం నీరుకుళ్లను సుధారాణి, గోవిందరావుపేట మండలం గోవిందరావుపేటను గరికపాటి దత్తత తీసుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ జుక్కల్ మండలం కౌలాస్ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఇంకా దత్తత గ్రామాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి గుండ్లపోచంపల్లి, దుండిగల, కండ్లకోయ గ్రామాలను, చేవెళ్ల ఎంపీ కె.విశే్వశ్వర్‌రెడ్డి నాగసముద్రం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మలా సీతారామన్ రెండు గ్రామాలను ఎంపిక చోసుకోగా, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాకు చెందిన ఎంపీ మేకపాటి మర్రిపాడు మండలంలోని కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకోగా ఒంగోలు ఎంపీ వైవిసుబ్బారెడ్డి కొమరోలును ఎంపిక చేసుకున్నారు. విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు విజయనగరం మండలం ద్వారపూడి, బాడంగి మండలం మొగడ, నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. * * * * * * * * * మళ్లీ వస్తా.. ప్రధాని మోదీ పిలుపుతో పి.ఆర్.కండ్రిగను దత్తత తీసుకున్నా. తొలి ఇన్నింగ్స్ ఆడా. ఇక అభివృద్ధి అనే రెండో ఇన్నింగ్స్ మీ చేతుల్లోనే ఉంది. ఈ పల్లెను దేశంలో నెంబర్ వన్ చేస్తా. నేను మళ్లీ వచ్చేసరికి అంతా మారిపోవాలి. జెసి రేఖారాణి చొరవవల్లే అంతా జరుగుతోంది. -గ్రామస్తులతో సచిన్ సంతోషం మాటల్లో చెప్పలేను.. విమానంలో సచిన్‌ను చూసి ఆశ్చర్యపోయా. క్రికెటర్ చాముండేశ్వరినాథ్ నా మిత్రుడని చెబుతూ పరిచయం చేసుకున్నా. న్యూయార్క్‌లో మా అబ్బాయిని చూసి వస్తున్నానన్నా. సచిన్ విన్నారు, మాట కలిపారు. మా మధ్య సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రస్తావన వచ్చింది. నేను జేసీగా పనిచేస్తున్న నెల్లూరు జిల్లాలో పేదపల్లెలున్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని కోరా. సచిన్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ శ్రీకాంత్‌తో చెప్పా. అప్పటికే ఆయన కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిని మెరుగుపరిచి సచిన్‌తో ఫోన్లో మాట్లాడాం. అన్నీ అనుకూలంగా మారాయి. ఇదిగో ఇప్పుడిలా స్వయంగా సచినే వచ్చారు. చాముండి చాలా సహకరించారు. ఇక గ్రామస్తులంటారా..? వారిదీ, నాదీ ఒకటే మాట.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. -జాయంట్ కలెక్టర్, రేఖారాణి మొదట అర్థం కాలేదు.. ‘సీతమ్మగారు విజయవాడ రమ్మని కబురుచేశారు. నేను, నా భర్త అర్జున్‌రావు, కుమారుడు ముత్యాలరావుతో పాటు గ్రామంలోని పెద్దలు అక్కడకు వెళ్ళాము. ఇంతలో వేదిక పైకి రమ్మని పిలిచారు. వేదిక మీద కూర్చున్న వెంటనే ఇంగ్లీషులో మాట్లాడారు. నాకేమీ అర్థం కాలేదు. వెంటనే పక్కన ఉన్న వారు మంత్రి నిర్మలా సీతారామన్ మా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారని చెప్పారు. ఆనందాన్ని తట్టుకోలేకపోయాను. ప్రపంచానికి విసిరేసినట్టుగా ఉన్న మా ఊరిని సీతమ్మగారు గుర్తించారు. మా జన్మ ధన్యమైంది’. -తిరుమాని నాగలక్ష్మి, సర్పంచ్, పెదమైనవానిలంక తూర్పుతాళ్లు అదృష్టం.. స్వాతంత్య్రా నికి ముందూ తూర్పుతాళ్లు ఎంతో కీలకపాత్ర పోషించిన గ్రామం. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని భావించడం తూర్పుతాళ్లు చేసుకున్న అదృష్టం. గ్రామ అవసరాలను పూర్తిగా తెలుసుకుని అన్ని సదుపాయాలు కల్పిస్తారని భావిస్తున్నాం. ముఖ్యంగా సరుగుడు, కూరగాయలు, కొబ్బరి, ఉప్పుసాగు, అంతర పంటలు పండించేందుకు మరింత అవకాశం కల్పించాలి. గోదావరి జలాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చాలి.’ -చామకూరి సుబ్బలక్ష్మి, సర్పంచ్, తూర్పుతాళ్లు నమ్మలేదు ఇన్నాళ్లూ ఎవరూ మా ఊరిని పట్టించుకోలేదు. సచిన్ దత్తత తీసుకున్నారంటే నమ్మలేదు. ఆ తరువాత మా ఊరంటే అందరికీ తెలిసిపోయింది. రోగమొస్తే వైద్యం అం దక ఇబ్బందిపడ్డాం. ఎన్నో సమస్యలున్నాయి. ఇక అవన్నీ తీరుతాయనే భావిస్తున్నాం. -బుజ్జా నాగేశ్వర రావు, సర్పంచ్, నెర్పూరు సమస్య తీరబోతోంది సచిన్‌ను ఇన్నాళ్లూ టీవీలోనే చూశాం. వైద్యం కోసం ఇన్నాళ్లూ చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరబోతోంది. సంతోషంగా ఉంది. -సుశీల, గృహిణి, పిఆర్ కండ్రిగ మా అదృష్టమే సచిన్‌ను ప్రత్యక్షంగా చూడటం, ఆయన మా గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఇదంతా మా పల్లె చేసుకున్న అదృష్టమే. ఇది కలలోకూడా ఊహించలేదు. ఆయన మా అందరితో ముచ్చట్లు చెప్పారు. -పాపయ్య, పిఆర్ కండ్రిగ పి.ఆర్.కండ్రిగ... రేఖారాణి... సచిన్ దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలని కోరితే ఎలా ఉంటుంది..? కొంచెం సేపు స్వార్థం వీడి ఆలోచిస్తే ఏం తోస్తుంది... అదిగో అదే జరిగింది. న్యూయార్క్‌లో కొడుకుని చూసి తిరిగివస్తూండగా విమానంలో తన సీటుపక్కన క్రికెట్ లెజండ్, భారతరత్న సచిన్‌ను చూసేసరికి ఆమె విస్మయం చెందారు. ఆమె పేరు రేఖారాణి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్. సచిన్‌తో మాటామాటా కలిపారు. మధ్యలో ఆదర్ళ గ్రామాల ప్రస్తావన వచ్చింది. తమ జిల్లాలోని పి.ఆర్.కండ్రిగ పరిస్థితులు వివరించారు. సచిన్ వరమిచ్చాడు. ఆ గ్రామాభివృద్ధికి సరేనన్నాడు. ఇక ఫ్లైట్ దిగినవెంటనే రేఖారాణి కలెక్టర్ శ్రీకాంత్‌కు వివరం చెప్పారు. ఆ ఇద్దరూ సచిన్‌తో చర్చలు జరిపారు. క్రికెటర్ చాముండేశ్వరినాథ్ సచిన్‌తో మధ్యవర్తిత్వం నెరపారు. పుట్టంరాజువారి కండ్రిగ దశ తిరిగింది. సచిన్ తన సొంత నిధులకు తోడుగా ఎంపీలాడ్స్ నిధులనుండి రూ. 4 కోట్లు కేటాయించారు. జిల్లా కలెక్టర్ వివిధ పథకాలకింద రూ.3 కోట్లు కేటాయించారు. ఇక చూడండి- అధికారుల ఉరుకులు పరుగులు, సచిన్ సమీక్షలు, పనులు చకచకా మొదలయ్యాయి. ఇటు రేఖారాణి చురుకుగా వ్యవహరిస్తే... పనిలోపనిగా సచిన్ ప్రధాని మోదీతో పిఆర్ కండ్రిగను దత్తత తీసుకున్న విషయాన్ని స్వయంగా కలిసి విన్నవించారు. ఇక గ్రామానికి అధికారుల రాకపోకలు మొదలయ్యాయి. పనులూ ప్రారంభమయ్యాయి. సచిన్ ఈ గ్రామానే్న ఎందుకు ఎంపిక చేసుకున్నారోనని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ అదృష్టం మాత్రం జేసీ వల్లే దక్కింది. ఆమెకు కలెక్టర్ శ్రీకాంత్ అండగా నిలిచారు. పనులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా టెండూల్కర్ తరపున ప్రతినిధి బృందం స్వయంగా వచ్చి పరిశీలించింది. ఆ తరువాత తానుగా సచిన్ వచ్చి అభివృద్ధి పనుల తీరును చూసి, తానూ ఓ పునాదిరాయి వేసి ఆనందంగా వెళ్ళారు. ఇక ఆ పల్లెజనం ఆనందానికి అవధులు లేవు. అంతా కూలీలే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టంరాజువారి కండ్రిగ నెర్పూరు పంచాయతీకి శివారు గ్రామం. ఒక్క ప్రభుత్వ ఉద్యోగీలేని ఈ గ్రామంలో అందరూ కూలీలే. దాదాపు 110 ఇళ్లున్న ఈ గ్రామ జనాభా 600మంది. చదువుకున్నవారి సంఖ్య పదుల్లోనే. ఉన్న పాఠశాలలో 51 మంది విద్యార్థులకు ఒకే గది. ఆస్పత్రి, పోస్ట్ఫాసు, బ్యాంకు ఇలాంటివేవీ అక్కడ లేవు. ఆ అవసరాలకు మైళ్లదూరంలోని ఊళ్లకు వెళ్లాల్సిందే. చక్కటి రోడ్డు ఎరుగరు. మంచినీటి వసతి లేదు. కరెంట్ సంగతి సరేసరి. పశువుల పెంపకమే ఇక్కడివారి ప్రధానవృత్తి. ఊరు మొత్తం మీద కేవలం 9 ఎకరాల మాగాణి ఉంది. 200 ఎకరాల మెట్ట ఉంది. వచ్చే ఏడాదిలోగా అక్కడ ఆధునిక వసతులు కల్పిస్తారు. పోస్ట్ఫాసు, బ్యాంకు, పాఠశాల, ఆస్పత్రి, భారీ చెరువులు, క్రీడామైదా నాలు, పక్కారోడ్లు నిర్మిస్తారు. ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్, 24 గంటల విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం ఇలా ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. రోడ్లు, చెరువుల తవ్వకం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశంలో ఇంకే ఎంపీ నియోజకవర్గంలో ఇలా పనులు వేగం పుంజుకోలేదనే చెప్పాలి. 
* -కృష్ణరవళి, టి.తిరుపతిరెడ్డి (నెల్లూరు), శివప్రసాద్ (గూడూరు), టి.స్వామిఅయ్యప్ప (భమవరం).

మూలం:ఆంధ్రభూమి-23/11/2014




Saansad Adarsh Gram Yojana
















9 comments:

  1. పెంపుడు పల్లెలు.

    ReplyDelete
  2. Good scheme by Government of India

    ReplyDelete
  3. Yes. Sachin is adopted a village in my district.

    ReplyDelete
  4. సచిన్ పుట్టం రాజు వారి కండ్రిగ ఊరు వచ్చిన రోజు టీ.వీ లో ఈ ప్రోగ్రాం చూసి మోడీ పిలుపుని అభినందించాను మనసులేనే. నిజంగా పాలకులు ఓ మంచి పిలుపునిస్తే అది జనాలను ఆవహిస్తే పల్లెప్రపంచం వృద్ధి చేందడం అసాధ్యమేమీ కాదు. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న గాంధీ కలలను నెరవేర్చేందుకు ఆయన వారసులమని చెప్పుకున్న వారు పెద్దగా చేసిందేమీ లేదు. కులాల పేరుతో ఓటు బేంకు రాజకీయాలతో - ఓటి రాజకీయాలతో నిధులను వృధా చేయకుండా ఇలా గ్రామాలకు గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపితే అదే మేనియా దేశమంతా వ్యాపిస్తే అది ప్రపంచానికి భారత ప్రభంజనాన్ని చూపుతుంది. పల్లె ప్రపంచం వర్ధిల్లాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం గురించిన ఆర్టికల్ షేర్ చేసి మంచి పని చేశారు. ఇలాంటి ఆర్టికల్స్ ముందు ముందు మరిన్ని మాతో పంచుకోవాలని విజ్ఞప్తి. ఈ తప్నన - శ్రమ అభినందనీయం సాయినాధ రెడ్డి గారు.

    ReplyDelete
  5. Thanks for your essay

    ReplyDelete
  6. Super article. Nice presentation

    ReplyDelete