Breaking News

మరువలేని త్యాగమయ జీవి - నేతాజీ (Netaji Subash Chandra Bose)


భారతదేశ స్వాతంత్య్ర సమర యజ్ఞంలో పాల్గొన్న మహామహులెందరో ఉన్నారు. ఇప్పటికి ఎప్పటికి ప్రజాహృదయాలలో చెరిగిపోని ముద్ర మిగిల్చినవారు కొందరే. ఆ కొందరిలో నేతాజి సుభాస్ చంద్రబోస్ స్థానం అద్వితీయం.

ఆయన జీవన గమనాన్ని పరిశీలించి చూస్తే అంతటి మహాద్భుతాలు చేసి చూపడం ఒక వ్యక్తికి ఎవరికైనా సాధ్యమా అనిపించక మానదు. గృహ నిర్బంధం నుండి తప్పించుకుపోయిన వ్యక్తి శత్రువుల కంట పడకుండా, అనుమతించబడిన వీసాలు గాని, పాస్‌పోర్టులు గాని లేకుండా, అనేక దేశాలు దాటి జర్మనీకి చేరడం ఊహకందని వింత. అదీ సాధ్యమేమోలే అనుకొంటే తన దేశం కాని దేశంలో ముక్కుముఖం తెలియని వ్యక్తుల పరిచయం సంపాదించి జర్మన్ ప్రభుత్వాన్ని ఒప్పించి అజాద్ హింద్ పేరిట ఒక రేడియోను నెలకొల్పుకోవడం మరో వింత. జర్మన్ల చేతుల్లో ఖైదీలుగా చిక్కి నిరుత్సాహంతో దరితోచక కొట్టుమిట్టాడుతున్న భారత సంతతి వారిలో జీవితంపై ఆశలు చిగురింపచేసి నూతనోత్సాహం నింపి ఒక జీవిత ధ్యేయాన్ని వారిలో ఏర్పరచి వేలాది మందితో ఒక సైనిక పటాలాన్ని తయారుచేసుకోవడం వింతలలోకెల్లా పెద్ద వింత. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం నేతాజీది.

1921లో ఐ.సి.యస్. ప్యాసై బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో రాజభోగాలు అనుభవించే అధికారయోగం చేతికందినా దాన్ని తృణప్రాయంగా ఎంచి పరప్రభువులకు సేవలందిస్తూ బానిస బ్రతుకు బ్రతకడం హీనమని భావించి భారత ప్రజానీకానికి సేవలందించడానికి స్వాతంత్య్ర సమరంలో దూకడమనేది అప్రతిహతమైన త్యాగానికి నిదర్శనం.

ఆనాటి స్వాతంత్య్ర సమర కాలంలో కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించడం కంటె ఉన్నతమైన పదవీ బాధ్యత మరోటి లేదు. అనతికాలంలోనే అలాంటి పదవిని అధిరోహించిన ఘనత నేతాజీది. తన స్వాభిమానానికి విఘాతం కల్గుతోందని భావించిన మరుక్షణంలో ఆ పదవిని కాలదన్నడం ఉద్వేగమే కాని ఉత్సిక్తం కాదు. అదీ ఆయన వ్యక్తిత్వం. దేశ స్వాతంత్య్ర సాధనకై ఎవరికి అనువైన మార్గాన్ని వారు అవలంబించడంలో తప్పులేదన్నది నేతాజి నిశ్చితాభిప్రాయం. స్వాతంత్య్రం ప్రసాదించమని తెల్లదొరలకు పిటిషన్లు పెట్టుకొంటూ కాలం వృధాచేయడం సరికాదని భావించిన తక్షణం గృహనిర్బంధంనుండి తప్పించుకు బయటపడ్డాడు. భారతీయులలో ఉత్సాహాన్ని నింపి స్వాతంత్య్ర సమరోన్ముఖులుగా చేయాలంటే భారతదేశ సమీపానికి చేరి పోరాటం సాగించాలని భావించాడు. అందుకే ప్రాణాలను అరచేత పెట్టుకొని ఆ భీకర ప్రపంచ యుద్ధకాలంలో అతి ప్రమాదకరమైన జలాంతర్గామిలో ప్రయాణంచేసి జర్మనీనుండి సింగపూర్‌కు చేరాడు. సింగపూర్‌కు చేరాక అక్కడి ప్రవాస భారతీయులను చేరదీశాడు. వృత్తి, వ్యాపారాలతో సంపాదన ఒక్కటే జీవిత ధ్యేయంగా ఎంచి అక్కడ మనుగడసాగిస్తున్న భారతీయులలో స్వాతంత్య్ర పిపాస రగుల్కొల్పాడు. వారి జీవన గమనాన్ని సంపూర్ణంగా మార్చివేయగల మార్పు తెచ్చాడు. అంతవరకు సంపాదనొక్కటే లక్ష్యంగా భావించిన ప్రవాస భారతీయులు ప్రాణాలొడ్డి యుద్ధరంగంలో కదంత్రొక్కడమేగాక తాము సంపాదించిన సంపద సర్వస్వం నేతాజీ పాదాల చెంత సమర్పించడానికి సిద్ధపడ్డారు. నేతాజీ ఉన్నత వ్యక్తిత్వంపై అంతటి పరిపూర్ణమైన విశ్వాసం ప్రదర్శించారు. త్యాగమయమైన జీవితానికి సంసిద్ధమైన ఆ ప్రవాస భారతీయులతో అజాద్ హింద్ ఫౌజ్ పేరిట ఒక మహా సైన్యాన్ని నిర్మాణం చేశాడు నేతాజీ. బ్రిటిష్ సైన్యాన్ని చిత్తుచేస్తూ భారత సరిహద్దులవరకు చేరాడు. సత్యాగ్రహ మార్గం విడిచి మరో మార్గం ఎంచుకొన్నందువల్ల కక్షకట్టిన కొందరు కాంగ్రెసు నాయకులు, ఆనాటి రష్యా అడుగులకు మడుగులొత్తుతున్న భారత కమ్యూనిస్టులు చేసిన దుశే్చష్టలు నేతాజీ ప్రయత్నాలకు విఘాతం కల్గించాయి. దానికితోడు కాలం కలిసిరాలేదు. లేకుంటే 1943లోనే భారతదేశం స్వతంత్రమై ఉండేది. జపాన్‌వారి యుద్ధ విజయపరంపర సాగుతుండగా నేతాజీ సారధ్యంలోని అజాద్ హింద్ ఫౌజ్ భారత గడ్డపై అడుగు పెట్టింది. అండమాన్, నికోబార్ దీవులను జయించి ఆ దీవులకు ‘షహీద్’, ‘స్వరాజ్’అని నామకరణం చేయడం జరిగింది. ఆ విధంగా భారత గడ్డపై ప్రప్రథమంగా స్వతంత్ర భారత పతాకను ఎగురవేసిన ఘనత నేతాజీదే. 21 అక్టోబర్ 1943నాడు స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేసాడు.

దేశం వెలుపల ఉన్నా దేశంలోపల ఉన్నా ఎల్లవేళలా నేతాజి ధ్యాస భారతదేశ భాగ్యోన్నతికి సంబంధించింది తప్ప మరోటి ఉండేదికాదు. ఆ దిశలోనే స్వదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసేవాడు. భారతదేశ విభజనకు సంబంధించి సాగుతున్న చర్చా ఆయనను విచారగ్రస్తునిగా చేసేది. దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను ఏర్పాటుచేయడమంటే ద్విజాతి సిద్ధాంతాన్ని అంగీకరించినట్లే అవుతుంది. వేలాది సంవత్సరాలుగా తన ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్న ఈ జాతి పాకిస్తాన్ ఏర్పాటు ద్వారా తన భౌగోళిక, ఆర్థిక, జాతీయ సమగ్రతను కోల్పోతుంది. ఇండియా గనుక విభజింపబడితే నీరసంగా ఉండి ఒక బిడ్డను కూడా పోషించలేని తల్లికి కవల పిల్లలు పుట్టిన చందం అవుతుంది అన్నారు. ఎంత వాస్తవమైన భవిషద్వాణి అది!

ఏ మతానికి చెందిన వారైనా భారతీయులంతా ఒక్కటే అన్నది ఆయన దృఢాభిప్రాయం. భారతీయులలో అనేక మతాల వారున్నారు. సిక్కులు, జైనులు, బౌద్ధులు, వైష్ణవులు, శైవులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఉన్నారు. ఎవరికీ ప్రత్యేక హక్కులుండవు. కులాన్నిబట్టి గాని, మతాన్నిబట్టిగాని ఎవరికీ ప్రత్యేక హక్కులు, సదుపాయాలు కల్పించబడవు. అలాంటి భారతదేశ నిర్మాణాన్ని గూర్చి కలలుకన్నాడు నేతాజీ. అదే భావంతోనే పనిచేశారు. ఒకసారి సింగపూర్‌లోని చెట్టియార్ దేవాలయ ప్రధాన పురోహితుడు దసరా ఉత్సవాలకు విచ్చేయవలసిందిగా నేతాజీని ఆహ్వానించాడు. ఆ మందిరంలో హిందువులకు, అందులోను ఒక ప్రత్యేక తెగవారికి మాత్రమే ప్రవేశం లభిస్తుంది. మత భేదం లేకుండా అజాద్ హింద్ సైనికులందరికి ప్రవేశం కల్పిస్తేనే వస్తానన్నాడు నేతాజీ. మందిర నిర్వాహకులు వారిలోవారు తర్జనభర్జనలు పడి నేతాజీ కోరికను అంగీకరించారు. మందిరంలో అందరికీ సమానంగా తీర్థప్రసాదాలు అందాయి. ఎవరికీ ఎటువంటి అభ్యంతరం రాలేదు. నేతాజీయే గనుక స్వతంత్ర భారత రథ చోదకుడుగా ఉండి ఉంటే అజాద్ హింద్ ఫౌజ్‌లో సాధించిన ఆ ఐక్యత భారతీయులందరిలో సాధించి ఉండేవాడు. ఆదర్శవంతమైన ఉదాహరణ ముందుంటే కాదనగలవారెవరుంటారు?

బాల్యంలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న రోజుల్లో తన గురువుగారైన వేణీమాధవ్‌దాస్ ద్వారా మానవత్వ విలువలను బాగా ఆకళింపు చేసుకొన్నాడు సుభాష్. ఆ తర్వాతికాలంలో వివేకానంద సాహిత్యం ఔపోసనపట్టి సేవాతత్పరతను జీర్ణంచేసుకొన్నాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకొంటున్నప్పుడు ఒక ఆంగ్ల ఉపన్యాసకుడు తరగతి గదిలో భారతీయులను అవమానపరుస్తూ మాట్లాడగా లేచి నిలబడి నిర్భయంగా ఖండించాడు సుభాస్. ఆ రోజుల్లో ఇంగ్లీషు వాడిని ఎదిరించడం గొప్ప నేరం. సుభాస్‌ను కళాశాలనుండి బహిష్కరించారు. కటక్‌లోని తన తండ్రిగారు జానకీనాథ్‌బోస్ దగ్గరకు చేరాడు సుభాష్. అప్పుడు ఒరిస్సా అంతటా ప్రాణాంతకమైన అంటువ్యాధి వ్యాపించి ఉంది. తనతోపాటు కొందరు యువకులను కూర్చుకొని ఒక సేవా దళాన్ని ఏర్పరచుకొన్నాడు సుభాష్. ఆ దళం రోగగ్రస్తులకు అహోరాత్రులు శ్రమించి సేవలందించింది. నేతాజీ లోగల సేవాతత్పరతను తండ్రితోపాటు ప్రజలంతా కొనియాడారు. ఈ రకమైన త్యాగభావన, సేవాతత్పరత, నేతృత్వ లక్షణాలు నేతాజీ జీవితంలో అడుగడుగునా ప్రదర్శితమయ్యాయి. అమెరికా నేతృత్వంలోని మిత్ర సైన్యాలు జపాన్‌పై అణుబాంబు ప్రయోగించడంతో ఆ వినాశనం చూచి భీతిల్లిన జపాన్ తన ఓటమిని అంగీకరించింది. వాస్తవ పరిస్థితులు గ్రహించి తన యుద్ధవ్యూహాన్ని మార్చుకొని ఆఖరిసారి టోక్యోను దర్శించి కొన్ని స్వతంత్ర దేశాల సాయం సంపాదించాలన్న ఉద్దేశంతో విమానంలో ప్రయాణమయ్యాడు నేతాజీ. 1945లో తైపీలో ఆ విమానం ప్రమాదానికి గురికాగా ఆయన మరణించాడన్నారు కొందరు. అప్పటికీ రష్యా ఆక్రమణలో ఉన్న మంచూరియాలో నేతాజీ మారువేషంలో తిరుగుతుండగా రష్యా సైనికులు బంధించి తమ ఏకాంత శిబిరాలకు తరలించగా అక్కడ మృత్యువు పాలైనాడన్నారు మరికొందరు. దేశ స్వాతంత్య్రానంతరం ఆయన ఉనికిని నిర్ధారించేందుకు ఎన్నో కమిషన్లు వేశారు. కాని ఎవరూ నిజాన్ని నిగ్గుతేల్చలేకపోయారు. సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897నాడు జన్మించాడు. కాబట్టి జనవరి 23నాడు భారత ప్రజలు ఆయన జయంతిని జరుపుకొంటారు.

ఆయన జయంతిని జరుపుకొంటూ ఉండగా సహజంగానే నేటి నాయకులను గూర్చి ఆలోచన మస్తిష్కంలో మెదులుతుంది. ఈ నాయకులలో ఎవరి చిట్టా విప్పినా ఏమున్నది గర్వకారణం... ఒక్క అవినీతి తప్ప. ఒక కుంభకోణాన్ని తలదన్నినది మరోటి. త్యాగ భావానికి చిరునామా అయిన నేతాజీ పుట్టిన పుణ్యభూమికా ఈ దుర్గతి అని తీవ్రమైన దుఃఖంతో మనసు క్షోభిల్లుతోంది. మరో నేతాజీ పుట్టకపోతాడా అన్న ఆలోచన ఆశకు జీవం పోస్తుంది. మనం ఆశాజీవులం కదా!
- పులుసు గోపిరెడ్డి.
మూలం: ఆంధ్రభూమి-23/01/2013.

13 comments:

  1. మరువలేని త్యాగమయ జీవి - నేతాజీ.

    ReplyDelete
  2. Replies
    1. ధన్యవాద్ కొండలరావు గారు.ఈ బ్లాగులో ఇంకా ఏమైనా మార్పులు చేయాలని మీరు భావిస్తున్నారా. మీరు నాకు సలహాలు ఇవ్వండి సార్. ఎక్కువమందికి ఈ వ్యాసాలు చేరాలి సార్.

      Delete
    2. నేను మీ బ్లాగుని ఈ మధ్యనుండే చూస్తున్నాను. అవసరం అనుకుంటే తప్పక చెప్తానండి. మన దేశానికి సంబంధించిన ఇలాంటి విషయాలు నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మంచి ప్రయత్నం చేస్తున్న మీకు అభినందనలు.

      Delete
  3. Netaji is inspiring personality. Thanks for your interest to share this type of information

    ReplyDelete
  4. Thanks for sharing

    ReplyDelete
  5. వెంకటేశ్వర్లుJanuary 11, 2015 at 8:31 PM

    నేతాజీ పై గోపి రెడ్డి గారు ఒక పుస్తకం రాసారు. మీరందరూ కూడా వీలైతే ఆ పుస్తకం తెప్పించుకుని చదవండి.

    ReplyDelete