అశోక చక్ర - కె.ఎల్.వీ.ఎస్.ఎస్.హెచ్.ఎన్.వీ ప్రసాద్ బాబు
జననం : 1981-మార్టూరు, విశాఖపట్నం జిల్లా.
మరణం : 17 ఏప్రిల్ 2013 - ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్ గర్ సరిహద్దు.
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ బలగానికి చెందిన కెఎల్ వీఎస్ఎస్‌హెచ్ఎన్‌వీ ప్రసాద్ బాబుకు కేంద్ర ప్రభుత్వం 2013లో దేశంలోనే అత్యంత ఉత్తమమైన శౌర్య పతాకం అశోక చక్ర పురస్కారంను మరణానంతరం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ - చత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా గ్రేహౌండ్స్‌కు నాయకత్వం వహించిన ఎస్ఐ కె.ప్రసాద్ బాబు ఈ గౌరవం పొందారు. "విధుల్లో నిబద్ధతను పాటిస్తూ మావోయిస్టులపై పోరాడడంలో అనిర్వచనీయమైన నాయకత్వంతో త్యాగనిరతిని చాటుకున్న శ్రీ ప్రసాద్ బాబు ప్రస్ఫుటమైన శౌర్యాన్ని ప్రదర్శించారు" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
వ్యక్తిగత జీవితం
ప్రసాదబాబు పూర్తి పేరు కరణం లీలా వెంకట్ శ్రీనివాస్ శ్రీహరి నాగ వరప్రసాద్ . ఈయన అనకాపల్లి మండలం మర్టూరుకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ పోలిసులలో మొదటిసారి అశోక చక్ర పురస్కారం అందుకున్న వ్యక్తి. తండ్రి పేరు కరణం వెంకట రమణ. తల్లి సత్యవతి. రెండవ సంతానమైన వర ప్రసాద్‌కు ఇద్దరు సోదరులు. వరప్రసాద్ బావ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వర ప్రసాద్ తండ్రి రిటైర్డు ఏఎస్‌ఐ. వరప్రసాద్ పెదనాన్న కొడుకు డీఎస్పీగా పనిచేస్తున్నారు. ఇలా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ‘కరణం’ కుటుంబం అంటే మార్టూరులో ఎంతో గౌరవం. దివంగత ప్రసాద్‌కు ప్రఖ్యాత అశోకచక్ర అవార్డు ప్రదానంతో ఇప్పుడు దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అయ్యాడు.
నక్సల్ పోరాటం మరియు మరణం
తొమ్మిది మంది మావోయిస్టులను హతమార్చడంతో పాటుగా, ఇతరులను గాయపరచడంలో బాబు కీలకమైన పాత్ర పోషించారు. 2013 సంవత్సరం ఏప్రిల్ 16న ఆంధ్రా - చత్తీస్‌గఢ్ సరిహద్దు సమీపంలో దాదాపు 70 మంది మావోయిస్టులు పేలుళ్ళు చేపట్టారు. అనంతరం బాబు నేతృత్వంలో గ్రేహౌండ్స్ బృందంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బాబు, ఆయన బృందం మావోయిస్టులపై ఎదురు దాడికి దిగారు. వారిలో తొమ్మిది మందిని హతమార్చారు. మరుసటి రోజు కమాండోలను హెలికాప్టర్ల ద్వారా తరలించసాగారు. చివరి తరలింపులో భాగంగా 19 మంది కమాండోలు హెలికాప్టర్‌ను చేరుకోనున్న తరుణంలో దాదాపు 60 నుంచి 70 మంది మావోయిస్టులు హెలికాప్టర్‌పై దాడి చేశారు. ఆ క్రమంలో 14 మంది కమాండోలు హెలికాప్టర్ ఎక్కారు. బాబుతో పాటుగా నలుగురు కమాండోలు ఎదురు కాల్పులు ప్రారంభించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది. హెలికాప్టర్ వెళ్ళిపోగానే, మావోయిస్టులు కమాండోలను ముట్టడించారు. మిగిలిన నలుగురు కమాండోలను వెనక్కి తిరిగిపోవాల్సిందిగా బాబు విజ్ఞప్తి చేశారు. ఆ నలుగురు సురక్షిత ప్రాంతానికి చేరుకునేంతవరకు ఆయన ఒంటి చేత్తో దాదాపు 200 మంది మావోయిస్టులను ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో బాబు మరణించారని ప్రకటన తెలిపింది.
అశోక చక్ర - కె.ఎల్.వీ.ఎస్.ఎస్.హెచ్.ఎన్.వీ ప్రసాద్ బాబు.
ReplyDeleteBrave Hero of Andhra Pradesh.
ReplyDeleteYes. An unsung hero. Thanks for Visiting.
Delete