ఈ యుగానికి శ్రీ కృష్ణ సందేశం
ఈ యుగానికి
శ్రీ కృష్ణ సందేశం
ఏండ్ల తరబడి అడవిలో తిరుగాడి
ఎండ తీవ్రత, నదుల తాకిడికి ఎదురాడి
బాధలు విఘ్నాలెన్నింటినో ముద్దాడి,
ముళ్లు కుచ్చి,రాళ్లు ఒత్తి పాదాలు పగిలినా సహించారు
మరింత రాటు దేలి, పాండవులు తిరిగొచ్చారు
అదృష్టం ప్రతి దినం నిద్రించదు
లేచి తలుపు తట్టి పిలిచే సుదినం ముందున్నది
అయినా చూద్దాం ఏం జరుగనున్నదో !
స్నేహంలోని తియ్యదనం రుచి చూపడానికి
హితం కోరి రాచబాటలో నడపడానికి
దుర్యోధనునికి నచ్చ చెప్పడానికి
భీకర యుద్దం ఆపడానికి
భగవంతుడే స్వయంగా హస్తినకు వచ్చాడు
పాండవుల సందేశం మోసుకుని తెచ్చాడు
సంపూర్ణ న్యాయం చెయ్ లేదా సగమైనా చెయ్
అదికూడా అయిష్టమైతే కనీసం ఐదు గ్రామాలియ్
మిగిలిన భూమంతా నీవే ఉంచుకో
మాకిచ్చిన చోటే మేమానందంగా ఉంటాం
కత్తులు ఎత్తక సోదరులతో కలిమితో కలిసుంటాం
దుర్యోధనుడు ఇసుమంత భూమి కూడా ఇవ్వలేక
ప్రజల అభిమాన ఆశీస్సులు పొందలేక
కృష్ణున్నే బంధించేందుకు సాహసించాడు
ఏదసాధ్యమో అదే కుతంత్రంతో కుప్పి గంతులేసాడు
వినాశనం మనిషిని చుట్టుముట్టినప్పుడు
ముందుగా వివేకం చచ్చుబడి పోతుంది
భీషణ స్వరంతో శ్రీ హరి హుంకరించె
విశ్వ రూపం నలుదెసల విస్తరించె
గజ గజ వణికిరి అతిరథులంతా
ఘన గర్జనతో గొంతెత్తెను గోవిందుడు
సంకెళ్లతో చుట్ట చుట్టి - నీ కోరిక నెరవేర్చుకో
దుర్యోధనా! కసి తీరా నాపై పగ తీర్చుకో
కాని ముందుగా నేనెవరో పూర్తిగా తెలుసుకో
ఆకాశం నాలో లయమై
వాయువు నాలో విలయమై
ఝంకారం నాలో లీనమై
సకల ప్రపంచం నాలో విలీనమై
అమరత్వం పరిమళించె నాలో
విధ్వంసం లుప్తమయ్యే నాలో..
ఉదయాచలమే నా మెరుపు బల్లెమై
భూమండలమే నా విశాల వక్షస్థలమై
నా భుజాలు నలుప్రక్కల ఒడిసి పట్టగా
మైనాక మేరుపర్వతాలు నా పాదాలై
మెరిసే నక్షత్ర గ్రహాలే నా దీపాలై
వెలుగులు విరజిమ్ముతూ ప్రసరించలేదా
నా నోటిలో కదలాడుతూ కనిపించలేదా
చరాచర జీవకోటి ఆవిర్భావాలు - అంతర్ధానాలు
నా లీలలే అని తెలుసుకో..
మనుజులు నశ్వరమని - సురులే అమరులన్న నిజాలు తెలుసుకో..
శత కోటి సూర్యులు శత కోటి చంద్రులు
మనోహర సింధు జలాలు - శత కోటి నదీ నదాలు
శత కోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
శతకోటి విష్ణు జలపతి కుబేరులు
శత కోటి రుద్రులు శత కోటి కాల యములు
శతకోటి దండధరులు లోకాలనేలే పాలకులు
అండ పిండ బ్రహ్మాండం...నాలో నిక్షిప్తమై ఉంది
నీ చూపుకి ఆ శక్తి ఉంటే వీక్షించు
జరిగే ఆకస్మిక ఘటనలు తదేకంగా దర్శించు
అతల వితల సుతల రసాతల పాతాళ
భూలోకాలు నాలోన చూడు
గతం చూడు..
లెక్కల కందని కాలాలెన్నో గతించెను చూడు
జగతిని నేను సృష్టించిన విధము చూడు
మహా భారత సమరం ఆఖిరి క్షణాలు చూడు
కుప్పలు తెప్పలుగా పడి ఉన్న
శవాల గుట్టలు చూడు
ఆ శవాల కుప్పల్లో నువ్వెక్కడ పడి ఉన్నావో గుర్తుపట్టి మరీ చూడు
అంబరాన నా పొడవైన జులపాల జాలం చూడు
నా పిడికిట్లో మూడు కాలాల జాడ చూడు
నా పాదాల క్రింద పాతాళముంది చూడు
విలక్షణమైన విరాట స్వరూపం చూడు
అందరి జన్మలకారంభం నేనే
మృత్యువుతో ముగింపు పలికేది నేనే
నా నాలుకపై నర్తించే జ్వాలాముఖి
నా శ్వాసతోపాటే జనించే పవనాగ్ని
నా దృష్టి పడిన చోటల్లా
సృష్టి నవ్వుతూ కదలుతోంది
కనురెప్పలు మూసిన క్షణాన
మరణమృదంగం మ్రోగుతోంది
నన్ను నిర్భంధించవచ్చావా
సంకెళ్లు దృఢమైనవి తెచ్చావా
నన్ను బంధించాలని నీ మనసుకు అనిపిస్తే
ఈ అనంత గగనాన్ని ముందు బంధించు
నీ ఆలోచనల కెరటాలకే అడ్డుకట్ట వేయలేవు
మరి నన్నెలా కట్టడి చేయగలవు?
నా హితోక్తులు నీకు రుచించలేదు
మిత్ర బంధం విలువ నీవు గుర్తించలేదు
అయ్యేదేదో కానుంది ...
ఇక నేను నిష్క్రమిస్తా
నా ఆఖిరి సంకల్పం వినిపిస్తా..
బిక్షమడిగేది లేదిక..
అంతా భీషణ రణ రంగమే
విజయం లేదా మరణం
అనుక్షణం రణభూమిలో సంభవించేవే
నక్షత్ర రాశి ఒకదానికొకటి ఢీ కొడుతుంటే
భూమిపై నిప్పుల కణికలు కురుస్తుంటే
శేష నాగ ఫణి పడగ విప్పుతుంటే
వికృత కాలం విజ్రుంభించి నోరు తెరుస్తుంటే
దుర్యోధనా..
యుద్ధం ఇక ఇలాగే
కొనసాగుతుంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా
మలుపులు తిరుగుతుంది
అన్నలు తమ్ముళ్లపై,తండ్రులు కొడుకులపై
మనుమలు తాతలపై,అల్లుళ్ళు మామలపై
విద్వేషంతో విరుచుకు పడే విధ్వంసం ఇది
విషపు బాణాలు సంధించే మారణ హోమం ఇది
అందరి సుఖాలను కాకులు గ్రద్దలు హరించే దారుణ దృశ్యం..ఇది
మనుజుల సౌభాగ్యమే బ్రద్దలయ్యె కాళ రాత్రి ఇది
చివరన నీవు ఈ భూమిపై ఒరిగిపోతున్నప్పుడు
ఈ హింసోన్మాదానికి కారణ భూతుడివి నీవే నీవే
అని లోకం నిన్ను నిందించక మానదు...
ఈ రీతిని కృష్ణుడు కౌరవ సభలో
నిలిచి, పలికిన వేళ
మౌనంలో కొందరుంటే ,మూర్చలో మరికొందరు
భయ కంపితులై సభికులెల్లరు నిశ్చేష్టులై, నిరుత్తరులైన వేళ
గాయ పడని ఇరువురు మాత్రం
ప్రసన్న భరితులై చేతులు జోడించారు
విదుర, భీష్ములిద్దరు నిర్భయులై,
ప్రఫుల్ల చిత్తులై జయ జయధ్వానాలు పలికారు
ధర్మం గెలుస్తుంది....అధర్మం నశిస్తుంది
ధర్మం గెలుస్తుంది - అధర్మం నశిస్తుంది
ReplyDelete