Breaking News

దత్తాత్రేయ హోసబాలే - Dattatreya Hosabale Biography in Telugu

 


బెంగళూరులో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల్ భారతీయ ప్రతినిధిసభ (ఎబిపిఎస్) 2021 లో, శ్రీ దత్తాత్రేయ హోసబాలే ఆర్ఎస్ఎస్ కొత్త సర్కార్యవాహ గా ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటివరకు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సహా స‌ర్ కార్య‌వాహ‌ బాధ్యతలు నిర్వర్తించారు.

దత్తాత్రేయ హోసబాలే (ఆర్‌.ఎస్.‌ఎస్‌లో దత్తాజీ గా చిరపరిచితులు) స్వగ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సోరబా తాలూకాకు చెందిన హోసాబలే. ఆర్‌.ఎస్.‌ఎస్ కార్యకర్తల కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1968 లో ఆర్‌ఎస్‌ఎస్‌లో, తరువాత 1972 లో ఎ.బి.వి.పి అనే విద్యార్థి సంస్థలో చేరారు. 1978 నుంచి ఎబివిపి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారు. ముంబై కేంద్రంగా 15 సంవత్సరాలు ఎబివిపి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

దత్తాత్రేయ హోసబాలే (1954 డిసెంబర్ 1న జన్మించారు) పాఠశాల విద్య జన్మస్థలమైన హోసబాలేలో, సాగర్ (తాలూకా కేంద్రం)లో జరిగింది. కాలేజీ విద్యను అభ్యసించడానికి బెంగళూరుకు వెళ్లి ప్రసిద్ధ నేషనల్ కాలేజీలో చేరారు. తరువాత, హోసబాలే బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

విద్యార్థిగా ఉన్న రోజుల్లో చదువుతోపాటు సాహిత్య కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. వారు కర్ణాటకలోని దాదాపు అందరు రచయితలు, పాత్రికేయులతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండేవారు.  వారిలో వై.ఎన్. కృష్ణమూర్తి, గోపాల్ కృష్ణ అడిగా ఉన్నారు. ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే పోరాటంలో హోసబాలే అంతర్గత భద్రతా చట్టం (మిసా) కింద ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించారు.

అస్సాంలోని గువహతి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్ అండ్ యూత్ (WOSY) లో యువజన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. దానికి సంస్థాపక కార్యదర్శిగా వ్యవహరించారు.

ఆయన కన్నడ మాసపత్రిక అసీమా వ్యవస్థాపక సంపాదకులు. వారు 2004 లో సహ-బౌద్ధిక్ ప్రముఖ్  అయ్యారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృత భాషలలో నిష్ణాతులు.

హిందూ వ్యతిరేకతే భారత్ లో లౌకికవాదంగా చెలామణి అవుతున్నదన్న ఆయన  “భారతదేశం ఆలోచన విషయానికి వస్తే అలాంటి వివాదం లేదు; రకరకాల ఆలోచనలు ఉండవచ్చు.  ప్రతి దానిని అనుమతించాలి. అవన్నీ పరస్పర విరుద్ధమైనవని, ఘర్షణకే దారితీస్తాయని అనుకోవలసిన  అవసరం లేదు ” అని అన్నారు.

వైశ్విక ఏకత్వానికి ఫుట్ బాల్ క్రీడ ఒక గుర్తని ఆయన చెప్పారు.  ఈ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ఖండాల్లోనూ, దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఇది చాలా ప్రాచీనమైన ఆట కూడా. ప్రాచీన భారత్ నుంచి, గ్రీస్ మొదలైన దేశాల్లో ఈ క్రీడను ఎంతగానో ఆదరించారు. రాజుల నుంచి సామాన్యులవరకు అందరూ ఫుట్ బాల్ ఆడేవారు.

విస్తృతంగా ప్రయాణించిన హోసబలే USA మరియు UK లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత కార్యకలాపాలను తీర్చిదిద్దారు.

 

Source - VSK Telangana

1 comment:

  1. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దత్తాత్రేయ హొసబలే

    ReplyDelete