Breaking News

స్వామి వివేకానంద జయంతి - Swami Vivekananda Jayanthi in Telugu


 

ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు.

కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు

నీ వెనక ఏముంది.. ముందు ఏముంది.. అనేది నీకనవసరం .. నీలో ఏముంది అనేది ముఖ్యం

నేడు స్వామి వివేకానంద జయంతి

ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు.

స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు మన దేశం గురించి అనేక అపోహలను వ్యాపింపజేశారు. భారత్‌లో వందల ఏళ్ల నుంచి ఉన్న సామాజిక, మతపరమైన సమస్యల పరిష్కారానికి బ్రిటిష్ వారి ఆలోచనలే అభ్యుదయమైనవన్న ఆలోచనలతో పనిచేసే సంస్కరణ వాదులు దేశంలో తయారయ్యారు. 1857 సంవత్సరం తర్వాత మన దేశానికి సంబంధించిన మూలాలకే ప్రమాద ఘంటికలు మోగటం ఆరంభమైంది. భారత్ వేలాది సంవత్సరాలుగా సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఒకటిగా ఉన్నది. దేశం ఎప్పుడైనా ధర్మం ఆధారంగానే వికసించింది. ధర్మం ఆధారంగానే నిలబడింది. బ్రిటిష్ వారి పాలన మొదలయ్యాక ‘రాజ్యశక్తే సర్వస్వం’ అన్న వాతావరణం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ధర్మశక్తే సర్వస్వం, ధర్మమే ఆధారం, మన జాతీయత స్థిరంగా నిలబడాలని కొందరు మహాపురుషులు పనిచేసుకుంటూ వచ్చారు. వారిలో బంకిమ్‌చంద్ర చటర్జీ, దయానంద సరస్వతి, అరవింద మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటివారు అగ్రగణ్యులు. సమకాలీన సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్న వివేకానందుడు ఈ దేశంలోని యువతకు ప్రేరణగా నిలిచాడు. మన గురించి బయటివారు చెప్పేదే నిజమని భావించే వాతావరణం అప్పట్లో ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పంతో వివేకానందుడు దేశంలో ‘సాంస్కృతిక జాతీయవాదాని’కి బలమైన పునాదులు వేశాడు. ‘నేను హిందువును’ అని అనుకోవడమే మహా పాపంగా భావిస్తున్న రోజుల్లో- ‘నేను హిందువునని గర్వంగా చెప్పుకోవాల’ని ఆయన పిలుపునిచ్చాడు.

కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడికి- ‘భగవంతుడ్ని దర్శించాల’నే ఆకాంక్ష చిన్నతనం నుంచి ఉండేది. ఆ ఆకాంక్షను తీర్చుకునే అనే్వషణలో ఆయన రామకృష్ణ పరమహంసకు దగ్గరయ్యాడు. రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లాక ఆయన వేసిన మొదటి ప్రశ్న- ‘మీరు భగవంతుడ్ని చూశారా?’ అని. దానికి పరమహంస- ‘నేను నిన్ను ఎట్లా చూస్తున్నానో భగవంతుడ్ని అలాగే చూశాను’ అని బదులిచ్చారు. ఆ క్షణంలోనే ‘భగవంతుడు సర్వాంతర్యామి’ అని తెలుసుకున్న వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రేరణతో సన్యాసిగా మారాడు. పరమహంస పరమపదించాక వివేకానందుడు ‘భారత పరిక్రమ’కు బయలుదేరాడు. దేశమంతా అపరిచితుడిగా తిరిగాడు. దేశంలోని సామాజిక సమస్యలు, ఆధ్యాత్మిక రంగంలో సంఘర్షణలు, సంస్కరణ వాదంతో తలెత్తిన సరికొత్త సమస్యలను ఆయన అవగాహన చేసుకొన్నారు. అప్పటి పరిస్థితులను, అస్పృశ్యత వంటి సామాజిక సమస్యలను చూసి దుఃఖించడమే కాదు, వాటిని చక్కదిద్దాలని సంకల్పించాడు.

1893లో చికాగోలో ఉపన్యాసం ఇవ్వడానికి ముందే దేశంలోని సమస్యలను, సంక్షోభాలను చూసి వాటిపై ఎంతోమంత్రి ప్రముఖులతో వివేకానందుడు చర్చించాడు. అప్పట్లో ఆయన ఆవేదనను కొంతమంది గుర్తించలేదు. చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడి గొప్పతనాన్ని తిలక్ వంటి నేతలు అర్థం చేసుకున్నారు. చికాగోలో ఉపన్యాసం ఇచ్చిన తొలిరోజే ప్రపంచమంతా ఒక్కసారి వివేకానందుడి ఆలోచనల వైపుమళ్లింది. చికాగోలో జరిగిన ‘మత మహాసమ్మేళనం’లో ఆయన చేసిన సింహగర్జనకు యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. అప్పటి ఉపన్యాసంలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లోనూ మననం చేసుకోవాల్సి ఉంది. ‘నేను చెప్పిందే సత్యం అనే మూర్ఖవాదనే ప్రపంచ మానవ నాగరికత వికాసానికి అడ్డంకి ఉంది’ అంటూ ఆయన అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యాలు. నేటి ఆధునిక యుగంలో మతాల ఆధిపత్య పోరాటంలో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వీటి నుంచి బయటపడాలంటే హిందూ తాత్విక చింతనే ఆధారం. ఈ విషయానే్న అప్పట్లో చికాగో ఉపన్యాసం తర్వాత వివేకానందుడు దేశదేశాలు తిరిగి చెప్పాడు. చికాగో నుంచి తిరిగి వచ్చాక ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను జాగృతం చేశాడు.

భారత్‌లో సంస్కరణవాదులు జాతికి మేలు కంటే కీడు చేస్తున్నారని వివేకానందుడు విస్పష్టంగా ప్రకటించారు. ఆదిశంకరాచార్యులు వంటి మహాపురుషుల ప్రయత్నాల కారణంగా దేశంలో పెద్ద మార్పు వచ్చిందని, వారికంటే సంస్కరణవాదులు గొప్పవారా? అని ఆయన ప్రశ్నించేవారు. మహాపురుషులు చూపిన మార్గంలో ప్రయాణించడమే దేశానికి శ్రేయస్కరమన్నారు. భగవంతుడ్ని చేరేందుకు అనేక మార్గాలున్నాయని, ఆ మార్గాలేవీ సంఘర్షణలకు కారణం కావన్నారు. అన్ని మతాలూ ప్రపంచశాంతినే బోధిస్తాయని, ఆ దిశగానే అందరూ ఆలోచించాలన్నారు. దేశాన్ని సంఘటితం చేసేందుకు మనం పూజించే దేవతలను కూడా పక్కకుపెట్టి ఆ స్థానంలో భరతమాతను పూజించాలని వివేకానందుడు పిలుపునిచ్చారు. మనమంతా భరతమాత సంతామనమని, అందరం బంధువులమేనని, ఈ ఆలోచనలతో దేశాన్ని శక్తివంతం చేసుకోవాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి హృదయం కలిగిన వందమంది యువకులు తనకు దొరినట్టయితే ఈ దేశ పరిస్థితులను మార్చేస్తానని ఆయన అనేవారు. వేదాంత తత్త్వాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడమే కాదు, సామాజిక సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ప్రయత్నించారు. ఈ దేశం జాగృతం కావాలంటే అట్టడుగు వర్గాల నుంచి యువకులు ముందుకు రావాలన్నారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు అనుసరణీయం. ప్రస్తుత పరిస్థితుల్లో జాతికి సరైన దిశానిర్దేశం చేయగలిగేది ఆయన ఆలోచనలే. ఆయన బోధించిన వ్యక్తి నిర్మాణం, సాంస్కృతిక జాతీయ వాదం, సామాజిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు మన మనుగడను నిర్దేశిస్తాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆయన ఆలోచనలు మనకు శిరోధార్యం. జాతీయవాదిగా, దార్శనికుడిగా, సంస్కరణవాదిగా, ఆధ్యాత్మిక చింతకునిగా వివేకానందుడు మనకు చిరస్మరణీయుడు. ఆయన ఆలోచనలే ఈ దేశానికి శ్రీరామరక్ష.

(ఆంధ్ర భూమి సౌజన్యం తో)

1 comment:

  1. ప్రపంచంలో ఏ మహాపుఠుషుడి జీవితాన్నయినా, ఆయన సాధించిన విజయాలనైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జన్నించే నాటికి ఆ దేశంలో ఉన్న పరిస్థితులను మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ మహాపురుషుడు అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు చేసిన ప్రయత్నాలను మనం అవగతం చేసుకోగలం. మన దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఒక మహాపురుషుల పరంపర జన్మించింది. వారంతా ఒక్కో విషయంలో ఒక్కో పరివర్తన తీసుకొనివచ్చేందుకు తమ జీవితాలను సమర్పించారు.

    ReplyDelete