Breaking News

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ - About Constituent Assembly in Telugu

 


నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాలలో ఒకటైన భారత రాజ్యాంగం ఎన్నో విశేషాల సమాహారం; 26నవంబర్ 1949తేదీన, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా, 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది, ఆ రోజును మనం గణతంత్ర దినోత్సవoగా జరుపుకుంటాము. 1952 సం.లో ప్రథమ ఎన్నికలు జరిగేదాకా, ఇదే రాజ్యాంగ పరిషత్, దేశ కేంద్ర శాసనసభ లేక పార్లమెంట్ గా కొనసాగింది. నవంబర్26 `రాజ్యాంగం రోజు’గా దేశం జరుపుకుంటున్న తరుణంలో, భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, నిర్వహణ, రాజ్యాంగ రచనలో కొన్ని వివరాలు.

1946లో వివిధ రాష్ట్రాలలో జరిగిన విధానసభ ఎన్నికలలో గెలిచిన నాయకులు ఎన్నుకున్న ప్రతినిధులతో 1946లోనే పరిషత్ ఏర్పాటు జరిగింది. మొదటగా రాజ్యాంగ పరిషత్ లో 389మంది సభ్యులు, వారిలో 292మంది కాంగ్రెస్ నాయకులు కాగా, 73మంది ముస్లిం లీగ్ సభ్యులు. వివిధ రాజ్యాల రాజస్థానాల నుంచి మరో 93మందిని కలుపుకున్నారు. అయితే ముస్లిం లీగ్ పరిషత్ లో పాల్గొనమంటూ సభను బహిష్కరించింది. దేశమంతా అల్లర్లు, మారణహోమం చెలరేగి, చివరికి విషాదకర దేశవిభజనకి దారితీసింది.
భారతదేశ విభజన, స్వాతంత్ర్యానంతరం తిరిగి విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణ జరిగి, దేశం నలుమూలల నుంచి, అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం 299మంది స్త్రీ పురుష నాయకులతో ఆగస్ట్1947లో తిరిగి పరిషత్ సమావేశాలు ప్రారంభమైనాయి. వివిధ రాజ్యాల రాజస్థానాలనుంచి ఉన్న 93మంది యధాతధంగా కొనసాగారు. ముస్లింలీగ్ నుంచి పాకిస్తాన్ వెళ్లిపోయినవారు కాక, భారతదేశంలో ఉన్న 28మంది కొనసాగారు. రాజ్యాంగ పరిషత్ లో 15మంది స్త్రీలు ప్రతినిధులుగా ఎన్నికవడం గమనార్హం. పూర్తిగా మూడు సంవత్సరాల కాలం రాజ్యాoగ పరిషత్ ఉన్నా, సభ్యులు114 రోజులు మాత్రమే సమావేశమయ్యారు. 60లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. డా. బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ (రచనా నిర్వహణ) అధ్యక్షునిగా ఉన్నారు. అప్పుడు ఆయన ప్రధాని నెహ్రు మంత్రివర్గంలో న్యాయశాఖా మంత్రి కూడా.
న్యాయకోవిదుడు డా. బెనగల్ నర్సింగరావు గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకోవాలి. ఆయన రాజ్యాంగ పరిషత్ సలహాదారుగా పనిచేసారు. వివిధ దేశాల రాజ్యాంగాలు కూలంకషంగా అధ్యయనంచేసి, అన్ని రాజ్యాంగ కమిటీల నివేదికలను పరిశీలించి, రాజ్యాంగ ప్రథమ ముసాయిదా తయారు చేసి, డా. అంబేద్కర్ కి చేదోడువాదోడుగా పనిచేసి ఆయన మన్ననలు, ప్రశంసలు అందుకున్నారు డా. నర్సింగరావుగారు. తరువాతి కాలంలో ఆయన యూరోప్ లోని `హేగ్’ పట్టణంలోని `అంతర్జాతీయ న్యాయస్థానం’లో న్యాయమూర్తిగా పనిచేసారు.
డా. అంబేద్కర్ అధ్యక్షతన, డ్రాఫ్టింగ్ కమిటీ, పూర్తి రాజ్యాంగం ముసాయిదాను సభకు సమర్పించి, బహిరంగచర్చ కొరకు ప్రచురించి, ప్రజలనుంచి అభిప్రాయ సేకరణ జరిపించారు. ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ పరిషత్ సుదీర్ఘంగా చర్చించి, ఎన్నో సవరణలు, అదనపు విషయాలు జోడించి, తీర్మానాలు చేసి ఖాయపరిచింది. 1949 నవంబర్ 26 న, రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 24న చివరి రాజ్యాంగ సమావేశంలో సభ్యులందరూ సంతకాలు చేసి, 1950 జనవరి 26 నుంచి `భారత రాజ్యాంగం’ అమలులోకి తెచ్చారు. ఈ పెద్ద రాజ్యాంగ గ్రంథంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 విభాగాలు ఉన్నాయి.

రాజ్యాంగ పరిషత్ లో వివిధ కమిటీలు

రాజ్యాంగ నిర్మాణానికి మొత్తం 22 కమిటీలు పనిచేశాయి, అందులో ముఖ్యమైనవి 8.
అ. డ్రాఫ్టింగ్ కమిటీ – డా. అంబేద్కర్ (కె.ఎం.మున్షి, మొ. సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి,
గోపాలస్వామి అయ్యంగార్, ఎన్.మాధవరావు, టిటి కృష్ణమాచారి ఇతర సభ్యులు)
ఆ. కేంద్ర అధికారాల కమిటీ – జవహర్లాల్ నెహ్రు
ఇ. కేంద్ర రాజ్యాంగం కమిటీ- జవహర్లాల్ నెహ్రు
ఈ. రాష్ట్రాల రాజ్యాంగం కమిటీ – సర్దార్ వల్లభాయి పటేల్
ఉ. ప్రాథమిక హక్కులు, మైనారిటీలు, గిరిజనులు, మినహాయింపు ప్రాంతాలు మొ. అంశాల సలహా
కమిటీ – సర్దార్ వల్లభాయి పటేల్. ఈ ప్రాధాన కమిటీ కింద నాలుగు బృందాలు పనిచేశాయి.
ప్రాథమిక హక్కులు ఉపకమిటీ- జె.బి. కృపలానీ
మైనారిటీ హక్కులు ఉపకమిటీ – హరేంద్ర కుమార్ ముఖర్జీ (ఈయన క్రిస్టియన్, రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు)
ఈశాన్యప్రాంత, గిరిజన, అస్సాం, పూర్తి, పాక్షిక మినహాయింపు ప్రాంతాల ఉపకమిటీ – గోపీనాథ్ బోర్దోలోయ్
అస్సాం కాక ఇతర పూర్తి మరియు పాక్షిక మినహాయింపు ప్రాంతాల ఉపకమిటీ- ఏ వి థక్కర్
ఊ. విధాన నిబంధనల కమిటీ- డా. రాజేంద్రప్రసాద్
ఎ. రాష్ట్రాల కమిటీ (రాష్ట్రాలతో చర్చలు)- సర్దార్ వల్లభాయి పటేల్
ఏ. రాష్ట్రాల కమిటీ – జవహర్లాల్ నెహ్రు
ఐ. నిర్వాహక కమిటీ- డా. రాజేంద్రప్రసాద్
ఒ. జాతీయ పతాకం, హెచ్ఒసి కమిటీ – డా. రాజేంద్రప్రసాద్
ఓ. హౌజ్ కమిటీ- డా. బి. పట్టాభి సీతారామయ్య
ఔ. భాషా కమిటీ- మోటూరి సత్యనారాయణ

మహిళల రాజకీయ భాగస్వామ్యo
అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో స్త్రీలు ఓటు హక్కు కూడా దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నారు. అమెరికా తెల్లజాతి స్త్రీలకు మాత్రమే వోటు హక్కు1920లో సమకూరితే, `సమాన వోటు హక్కు చట్టం (Equal Voting Rights Act)’ చాలా ఆలస్యంగా 1965లో మాత్రమే మైనారిటీలతో సహా ప్రజలందరికీ వోటు హక్కు కల్పించింది. దీనికి విరుద్ధంగా, బ్రిటిష్ పాలనలో కూడా, ఎన్నికలు పరిమిత పరిధిలో నిర్వహించినప్పటికీ, భారతీయ మహిళలు ఎన్నికయారు. భారత రాజ్యాంగం ఎటువంటి జాతి, మత, కుల, లింగ వివక్ష లేకుండా, అందరికీ వోటు హక్కు కల్పించింది. 15మంది మహిళా నేతలు రాజ్యాంగ పరిషద్లో సభ్యులుగా ఉన్నారు. శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్, రాజకుమారి అమ్రిత్ కౌర్, శ్రీమతి హంసా మెహతా, శ్రీమతి సుచేతా కృపలానీ మొదలైనవారు కీలక పాత్ర పోషించారు. ఆన్నీ మాస్కారేనే, అమ్ము స్వామినాథన్, దాక్షాయణి వేలాయుధన్, కమలా చౌదరి, పూర్ణిమా బానర్జీ, బేగం ఏజాజ్ రసూల్ ఇంకొందరు సభ్యులు.

ప్రదక్షిణ

1 comment:

  1. నవభారత రాజ్యాంగాన్ని పొందుపరచడం కోసం 1946లో `రాజ్యాంగ పరిషత్’ ఏర్పాటు చేయబడింది.

    ReplyDelete