Breaking News

శ్రీ కేశవానంద భారతి శివైక్యం - Sri Kesavananda Bharati Who Ensured Basic Structure of Constitution Cannot be Altered, Dies

 రాజ్యాంగ మౌలిక  స్వరూపం  ఏర్పాటు కేసులో కీలక పాత్ర పోషించిన స్వామి కేశవానంద భారతి శివైక్యం


రాజ్యాంగ మౌలిక స్వరూపం  ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చారిత్రాత్మక కేసులో ప్రధాన పిటిషనర్, ఆధ్యాత్మిక గురువు స్వామి శ్రీ కేశవానంద భారతి శివైక్యం చెందారు.  ఆయన వయస్సు 79 సంవత్సరాలు. 
శ్రీ కేశవానంద భారతి కేరళలోని ఎడనీర్ మఠంలో తన పార్థివ దేహాన్ని విడిచిపెట్టారు. మంజాతాయా శ్రీధర్ భట్, పద్మావతి దంపతులకు జన్మించిన శ్రీ కేశవానంద భారతి తన 19వ ఏట సన్యసించి, అనంతరం 1960లో ఎడనీర్ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల శిష్యపరంపరలో ముఖ్యులైన శ్రీ తోటకాచార్యుల వారు ఏర్పాటు చేసిన ఈ మఠానికి 1200 ఏళ్ల చరిత్ర ఉంది. 
 
కేరళ భూసంస్కరణల చట్టాన్ని సవాల్ చేస్తూ 4 దశాబ్దాల క్రితం కేశవానంద భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు . 13 మంది న్యాయమూర్తులు విచారించిన ఈ సుప్రసిద్ధ కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మ తీర్పునిస్తూ “రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టే రక్షణదారు” అని స్పష్టం చేసింది. 
 
ఒక కేసును 13 మంది న్యాయమూర్తులు విచారించడం సుప్రీం చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ గా న్యాయ విద్యార్థులు దీన్ని తమ పాఠ్యాంశంగా ప్రముఖంగా తెలుసుకుంటారు. 
 
కేరళ ప్రభుత్వం అప్పట్లో హైందవ సంస్థలు, ఆశ్రమాల ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ ప్రవేశపెట్టిన చట్టాన్ని రద్దు చేయాలంటూ శ్రీ కేశవానంద భారతి వేసిన ఈ కేసు, అనేక ఇతర కేసులకు ప్రాతిపదికగా మారింది. 
 
ఈ కేసు ద్వారా భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల సవరణ చేయడాన్ని ప్రశ్నించిన తొలి వ్యక్తిగా శ్రీ కేశవానంద భారతి చరిత్రకెక్కారు. కేసు విచారణ సమయంలో న్యాయమూర్తులపై ప్రభుత్వ వర్గాల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురైంది. 13 మంది న్యాయమూర్తులు 66 రోజుల పాటు చేపట్టిన ఈ విచారణ కాలంలో దాదాపు ప్రతిరోజూ కేశవానంద భారతి ప్రముఖ దినపత్రికల్లో అగ్రపజిలో కనిపించేవారు. చివరికి 24 ఏప్రిల్, 1973లో, రాంజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని 6-7 మెజారిటీ న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. 

విశ్వ సంవాద కేంద్రం సౌజన్యంతో..

1 comment:

  1. పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించడంలో ముందు నిలబడిన మహానుభావుడు కేశవనంద భారతి స్వామి, 1973 లో కేశవనంద భారతి కేసు భారత రాజ్యాంగాన్ని మాలుపుతిప్పిన కేసు.
    స్వామిజీ ఈ రోజు పరమపదించటం సామాజిక, ఆధ్యాత్మిక కార్యకర్తలకు తీవ్ర ద్రిగ్బంతిని మిగిల్చింది ఓం శాంతి.

    ReplyDelete