Breaking News

మోక్షగుండం విశ్వేశ్వరయ్య - Mokshagundam Visvesvarayya Life Story in Telugu

 


భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ప్రతి సంవత్సరం ఇంజనీర్ ల దినోత్సవంగా జరుపుతుంటారు. ఆధునిక ఋషి అనదగిన శ్రీ విశ్వేశ్వరయ్య 15 సెప్టెంబర్, 1860 అప్పటి మైసూర్ సంస్థానంలోని కోలార్ జిల్లా ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాస శాస్త్రి సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు. తల్లి వెంకచ్చమ్మ దైవభక్తి కలది. విశ్వేశ్వరయ్య తన 15వ ఏట తండ్రిని కోల్పోయారు.

భారతీయ అఖండ ఋషిపరంపరలో ఉన్నట్లుగానే విశ్వేశ్వరయ్యలో కూడా తత్వజ్ఞానం, శాస్త్రీయ దృక్పధం, ఉన్నతమైన విలువలు కనిపిస్తాయి.

బి.ఏ పరీక్ష పూర్తిచేసిన తరువాత మైసూర్ మహారాజ ఆర్ధిక సహాయంతో విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ చదవడానికి పూనా సైన్స్ కాలేజీలో చేరారు. 1883లో ఆయన ఎల్ సి ఈ , ఎఫ్ సి ఈ (ఇప్పటి బి ఈ తో సమానం) పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

హైదరాబాద్ లో ఉద్యోగం : హైదరాబాద్ నిజాం దగ్గర కొద్దికాలం పనిచేసినప్పుడు మూసి నది వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచించారు.

మైసూర్ దివాన్ గా: మైసూర్ మహారాజా విశ్వేశ్వరయ్యను తమ ఆస్థానంలో దివాన్ గా నియమించారు. ఆ పదవిని చేపట్టడానికి ముందు బంధుమిత్రులందరిని విందుకు ఆహ్వానించిన ఆయన సిఫార్సుల కోసం తన దగ్గరకు ఎవ్వరూ రాకుండా ఉంటామంటేనే తాను దివాన్ బాధ్యతలు స్వీకరిస్తానని వారితో చెప్పారు. ఆ తరువాత ఆ బాధ్యతలు చేపట్టిన విశ్వేశ్వరయ్య సంస్థానంలో విద్యా, పారిశ్రామిక అభివృద్ధికి అహోరాత్రాలు పని చేశారు. ఆయన కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయి. గంధపు చెక్క నూనె తీసే ఫ్యాక్టరీ, సబ్బుల తయారీ పరిశ్రమ, వివిధ లోహ పరిశ్రమలు మొదలైన ఎన్నో ఆయన కాలంలోనే వచ్చాయి. వీటన్నిటిలోకీ భద్రావతి ఉక్కు పరిశ్రమ చాలా ముఖ్యమైనది.

1917లో ఆయన మార్గదర్శనంలో బెంగళూర్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభమయింది. దేశంలో ప్రారంభమయిన మొదటి తరం ఇంజనీరింగ్ సంస్థల్లో ఇది ఒకటి.

విశ్వేశ్వరయ్య కృషికి గుర్తులు:

కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట

బృందావన్ గార్డెన్

భద్రావతి ఉక్కు కర్మాగారం

మైసూర్ బ్యాంక్

దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ

స్వయంచాలిత వరదనీటి గేట్లు (పూనా దగ్గర)

హైదరబాద్ కు వరద నీటి రక్షణ వ్యవస్థ

విశాఖపట్టణం రేవులో భూకోతను నివారించడం

తిరుమల, తిరుపతి మధ్య రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక

ఆసియాలోనే మొదటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్

మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ

శ్రీ జయాచామరాజేంద్ర పాలిటెక్నిక్ కళాశాల

బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

మైసూర్ చక్కెర మిల్లులు

కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, బృందావన్ గార్డెన్స్ : 


 
కె ఆర్ ఎస్ ఆనకట్ట అద్భుత ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యానికి ఉదాహరణ

ఈ ఆనకట్టను 1932లో మాండ్యా జిల్లాలో కావేరి నదిపై నిర్మించారు. కృష్ణరాజ వడియార్ – IV హయాంలో నిర్మించిన ఈ ఆనకట్ట ఎత్తు 125 అడుగులు, పొడవు 8,600 అడుగులు, నీటి నిల్వ సామర్ధ్యం 49 బిలియన్ ఘనపు అడుగులు.

ఇది ప్రపంచంలోనే స్వయంచాలిత వరద గేట్లు కలిగిన మొట్టమొదటి ఆనకట్ట. దీనికి ఆనుకునే ప్రఖ్యాత బృందావన్ గార్డెన్స్ ఉంది.

పదవీవిరమణ చేసిన రోజున శ్రీ విశ్వేశ్వరయ్య తన అధికారిక వాహనాన్ని వదిలిపెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. తాను పదవిలో లేనుకనుక ఆ వాహనాన్ని వాడరాదన్నది ఆయన పాటించిన నియమం. ఇలా ఆయన విలువలతో కూడిన సాదాసీదా జీవనాన్నే గడిపారు.

100 సంవత్సరాలకు పైగా పూర్ణ జీవితాన్ని గడిపిన శ్రీ విశ్వేశ్వరయ్య 14 ఏప్రిల్, 1962లో స్వర్గస్థులయ్యారు.

గతాన్ని మరచిపోవద్దు, దేశీయ పద్దతులలో విశ్వాసం ఉండాలి, ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దేశానికి ఉపయోగించాలన్నవి ఆయన జీవితం యువతకు ఇచ్చే సందేశం.

Arise Bharat సౌజన్యంతో……

1 comment:

  1. ఆధునిక ఋషి.. భారతరత్న.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య

    ReplyDelete