Breaking News

బాలగంగాధర తిలక్ జీవిత చరిత్ర-Bal Gangadhar Tilak Life Story in telugu

జూలై 23 బాలగంగాధర తిలక్ జయంతి
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. అందుకు సంబంధించిన స్పృహ నాలో చైతన్యవంతంగా ఉన్నంతకాలం కూడా నేను వృద్ధుడిని కాను. ఆ స్ఫూర్తిని ఏ ఆయుధమూ ఖండించలేదు. ఏ నిప్పూ దహించలేదు. ఏ నీరూ తడిపి ముద్ద చెయ్యలేదు. ఏ గాలీ ఎండిపోయేటట్టు చేయలేదు. మనం స్వయంపాలన కోరాలి. సాధించుకోవాలి.’
హోంరూల్ లీగ్ తొలి వార్షికోత్సవం (1917) నాసిక్లో జరిగినప్పుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇచ్చిన ఉపన్యాసంలో కొన్ని మాటలవి. ఆ ఉపన్యాసం యువకుల కోసం చేశారు. తనది వృద్ధుడి శరీరమే అయినా ఆత్మ మాత్రం ఎప్పటికీ శిథిలం కాదని అన్నారు తిలక్. స్వాతంత్య్రం అన్న భావనను ఆత్మతో అనుసంధానం చేసి, తరం తరువాత తరం దానిని అనుభవించాలని ఆయన ఆకాంక్షించారు.
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు. దానిని సాధించి తీరుతాను’ అంటూ బాలగంగాధర తిలక్ భారత జాతికి ఇచ్చిన నినాదం ఎన్నో రాజకీయ చింతనల సారాంశం. స్వాతంత్య్రోద్యమ చరిత్ర భారతదేశ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. అలాంటి భారత స్వాతంత్రోద్యమ చరిత్రకు తాత్విక భూమిక తిలక్ (జూలై 23, 1856 - ఆగస్టు 20, 1920) నినాదం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నినాదం స్వరాజ్య ఉద్యమం మీద చూపిన ప్రభావం అంచనాకు అందనిది.
తిలక్ మహరాజ్ ఇంగ్లీష్ విద్యను అందుకున్న తొలి తరం భారతీయులలో అగ్రగణ్యులు. ఆంగ్ల విద్య ప్రభావంతో భారతీయులు అనుభవిస్తున్న బానిసత్వం గురించి తెలుసుకున్న వర్గంలో కూడా తిలక్ అగ్రగణ్యులే. ఇంగ్లీష్ విద్యతో ఆంగ్లేయులకు మరింత బానిసలుగా మారిపోయిన వర్గంలో ఆయన పడిపోలేదు. రాజారామ్మోహన్ రాయ్, దయా నందుడు, వివేకానందుడు వంటి వారి కృషి ఫలితంగా భారతదేశం సాంస్కృతిక పురుజ్జీవనం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆ అడుగులలో అడుగు కలిపిన మహానుభావులు కొందరు ఉన్నారు. అందులో తిలక్ ఒకరు. ఇంగ్లీష్ చదువుకున్నా, మూలాలు ఇక్కడి మట్టిలోనే ఉండాలని భావించిన విజ్ఞులు తిలక్ కాలంలో కనిపిస్తారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ ఫలశ్రుతి తిలక్, ఆయన సమకాలికులు కొందరి ఆలోచనలలో కనిపిస్తుంది. మహదేవ గోవింద రానడే, జ్యోతిరావ్ ఫూలే, లోక్ హితవాది, బాల్శాస్త్రి జంబేకర్ అలాంటివారే. జాతీయవాదానికీ, భారతీయ సమాజ సంస్కరణకీ వీరు దేశీయమైన ఆలోచనలనే పునాదిగా స్వీకరించారు. తిలక్ కూడా అంతే. ఆయన సంస్కృత పండితుల కుటుంబం నుంచి వచ్చారు. స్వయంగా సంస్కృత పండితుడు. అయినా హెగెల్, కాంట్, స్పెన్సర్, మిల్, బెంథామ్, వాల్టేర్, రూసోల సిద్ధాంతాలను శిరోధార్యంగా భావించారు. తండ్రి గంగాధర తిలక్ ఉపాధ్యాయుడు. సంస్కృత పండితుడు. తన పదహారవ ఏటనే తిలక్ తండ్రిని కోల్పోయారు. తిలక్ అసలు పేరు కేశవ్ గంగాధర తిలక్. అదే బాలగంగాధర తిలక్ అయింది. చదువంతా పుణేలో సాగింది. పూనా దక్కన్ కళాశాల నుంచి ఆయన గణితశాస్త్రం ప్రధానాంశంగా పట్టా తీసుకున్నారు. కెరునానా ఛాత్రే గణితశాస్త్రంలో తిలక్ అభిమాన గురువు. అలాగే ఆచార్య వర్డస్ వర్త్ కూడా తిలక్ను అభిమానించేవారు. ఆయన మహాకవి వర్డస్వర్త్ మనవడు. తరువాత తిలక్ న్యాయశాస్త్రం కూడా అభ్యసించారు.
తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్ గణేశ్ అగార్కర్, ఇంకా మహాదేవ బల్లాల్ నామ్ జోషి, విష్ణుశాస్త్రి చిపూంకర్ కలసి తిలక్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ సంస్థ ధ్యేయం. భారతీయ చింతన ప్రాతిపదికగా జాతీయ భావాలను పెంపొందించడమే ఆ సొసైటీ ఆశయం. ఈ వ్యవస్థాపకులంతా సంవత్సరం పాటు ఉచితంగానే విధులు నిర్వహిం చారు. తిలక్ గణితం, సంస్కృతం బోధించేవారు. మేఘదూతం కూడా ఆయనే చెప్పేవారు. న్యూ ఇంగ్లీష్ స్కూలు, ఫెర్గూసన్ కళాశాల దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీయే స్థాపించింది. పూనా కేంద్రంగా ఇవి పనిచేసేవి.
తిలక్ ఎంతటి ఆలోచనాపరుడో, అంతటి కార్యశీలి. మొదట ఆయన విద్యావేత్త. తరువాత పత్రికా రచయిత. గ్రంథకర్త. రైతాంగ ఉద్యమాలలో భాగస్వామ్యం ఉన్నవారు. పూనా సార్వజనిక్ సభ నాయకత్వం గోఖలే తరువాత తిలక్ చేతికి వచ్చింది. 1896లో మహారాష్ట్రలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. సార్వజనిక్ సభ కార్యకర్తలను ఆయా ప్రాంతాలకు పంపించి, వాస్తవాలను సేకరించి వాటిని తన పత్రిక కేసరిలో ప్రచురించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు తిలక్ కృషి చేశారు. 1872లోనే రూపొం దించిన ఫేమిన్ కోడ్ను బయటకు తీసి, మరాఠీ భాషలోకి అనువదించి రైతుల కోసం తిలక్ తన పత్రికలో వెలువరించారు. ఆ కోడ్ మేరకు ప్రభుత్వాన్ని రైతులు నిలదీయవచ్చునని తిలక్ ప్రబోధించారు. అయితే ప్రొఫెసర్ పరాంజపే అనే మేధావి కూడా రైతుల సభలు ఏర్పాటు చేసి ఫేమిన్ కోడ్లో ఏమి ఉందో, ప్రభుత్వాన్ని ఏ మేరకు నిలదీసే అవకాశం ఉందో ఉపన్యాసాలు ఇచ్చినందుకు పోలీసులు నిర్బంధించారు. దీనితో తిలక్ స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఫేమిన్ కోడ్ను మరాఠీలోకి అనువదించి మరీ ప్రచురించిన తనను మొదట అరెస్టు చేయాలని పట్టుపట్టారు. కానీ తిలక్ను అరెస్టు చేయకుండా ఉండడమే కాదు, ప్రొఫెసర్ పరాంజపేను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన ఐదేళ్ల తరువాత తిలక్ మొదటిసారి సభలకు హాజరయ్యారు. చాలాకాలం ఆ సంస్థలో కొనసాగినా మితవాదుల ధోరణి ఆయనకు సమ్మతంగా ఉండేది కాదు. విన్నపాలు, వినతులు వలస ప్రభుత్వాన్ని లొంగదీయ లేవని తిలక్ సిద్ధాంతం. కానీ ఆయన కాంగ్రెస్లోని చాలామంది ప్రముఖులను విశేషంగా గౌరవించే వారు. దాదాభాయ్ నౌరోజీ అంటే ఎంతో గౌరవం. భారత పేదరికం బ్రిటిష్ పుణ్యమేనన్న నౌరోజీ సిద్ధాంతాన్ని సమర్థించడమే కాకుండా, తన పత్రికలో ఎంతో ప్రాచుర్యం కల్పించారు. అలాగే గోఖలేతో చాలా అంశాలలో తిలక్కు విభేదాలు ఉండేవి. ముఖ్యంగా వయో పరిమితి బిల్లు విషయంలో ఇద్దరికీ తీవ్ర విభేదాలు వచ్చాయి. అయినా గోఖలేను తిలక్ సగౌరవంగా చూసేవారు. కానీ 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సభలు తిలక్ను ఘోర అవమానానికి గురి చేశాయి. అదే ఆ సంస్థలో చీలికకు నాందీ వాచకమైంది. ఆ సభలకు అధ్యక్షుడు అరవింద్ ఘోష్ కావడం మరొక విశేషం. కాంగ్రెస్ సాధారణ భారతీయుడికి చేరువ కావాలన్నదే తిలక్ ఆశయం. కానీ అప్పటికి ఆ సంస్థ మహారాష్ట్ర, బెంగాల్ సహా పలు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, ఉపాధ్యాయుల ఆధీనంలో ఉండేది. ఇంగ్లీష్ తెలిసిన వారికే ప్రవేశం మరొక ఆటంకం. అయినా ఉదారవాదంలో ప్రజానీకం మనసును తాకే అంశాలు లేవన్నదే తిలక్ అభిప్రాయంగా కనిపిస్తుంది.
జాతీయ కాంగ్రెస్లో పని చేస్తున్నప్పటికీ తిలక్ తనదైన మార్గం నుంచి తప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ లోని మితవాదులకు రుచించేది కాదు. ఆయన 1893లో గణేశ్ చతుర్థిని సామూహిక ఉత్సవంగా నిర్వహించే సంప్రదాయాన్ని పుణే, బొంబాయిలలో తీసుకువచ్చారు. అది దేశవ్యాప్త మైంది. తరువాత శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. శివాజీ పట్టాభిషేకం జరిగిన రాయగఢ్ కోటలోనే ఆయన సమాధి కూడా ఉంది. కానీ అది శిథిలావస్థకు చేరింది. దీనిని పునరుద్ధ రించేందుకు తిలక్ పెద్ద ఉద్యమమే నిర్వహించారు. మతం మనుషులను ఒక శక్తిగా నిలబెడుతుందని తిలక్ నమ్మకం. ‘మతం, వాస్తవిక జీవనం వేర్వేరు కావు. సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదు. అందులో ఉన్న నిజమైన స్ఫూర్తి ఏదంటే - దేశం మొత్తాన్ని కూడా నీ కుటుంబంగానే భావించడం. నీ కుటుంబం కోసమే కాకుండా, ఈ ప్రపంచం కోసం కూడా పనిచేయడం. దీని తరువాత మెట్టు మానవ సేవ. ఆ తరువాతి అడుగు భగవంతుడి సేవ’ అన్నారు తిలక్. అలా మతం ద్వారా ప్రజల మధ్య ఐక్యత సాధించాలన్నదే తిలక్ ఉద్దేశం. అలాగే శివాజీ జీవితానికీ, పోరాటానికీ తిలక్ ఇచ్చిన నిర్వచనం ప్రత్యేకమైనది. హిందువుల హక్కులను హరిస్తూ, వారి మత విశ్వాసాలను దారుణంగా అవమానిస్తున్న మొగలుల మీద యుద్ధం చేసిన వీరునిగా తిలక్ శివాజీని విశ్లేషించేవారు. అలాగే అఫ్జల్ఖాన్ మరణం గురించి కూడా. అఫ్జల్ఖాన్ అనే బీజాపూర్ సైనికాధికారిని చంపడం వెనుక మత భావనను వెతక్కూడదని తిలక్ చెప్పారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడు కాబట్టే శివాజీ అఫ్జల్ను చంపాడని చెప్పేవారు. ఆనాడు ఆంగ్లేయుల యాజమాన్యంలో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా దీనినే వక్రీకరించి, తిలక్ హత్యను సమర్థిస్తున్నారని ప్రచారం ప్రారంభించింది. ఏప్రిల్ 15, 1896లో తిలక్ శివాజీ ఉత్సవాలను కూడా ప్రారంభించారు. దేశం కోసం మరణించడం అనే ఊహ మీద తిలక్ స్పందన కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒకసారి అభినవ్ భారత్ సభ్యులు ఒక అంశం మీద సలహా కోసం తిలక్ను కలుసుకున్నారు. ఇది సావర్కర్ నాయకత్వంలో నడిచేది. అందులో ఎవరో ‘తాము దేశం కోసం చనిపోవడానికి కూడా సిద్ధమ’ని అన్నారు. అందుకు తిలక్, ‘అవసరమైతే మరణించడం సరే, కానీ దేశమాత సేవకు జీవించడం కూడా అవసరమే’ అని చెప్పారు.
బ్రిటిష్ జాతి మీద జాతీయ కాంగ్రెస్లోని మితవాదులు పెట్టుకున్న నమ్మకం ఒట్టి భ్రమ అన్నది మొదటి నుంచి తిలక్ వాదన. అదే బెంగాల్ విభజనతో రుజువైంది. బెంగాల్ విభజన వ్యతిరేకోద్య మంలో లాలా లజపతిరాయ్, బిపిన్పాల్లతో కలసి తిలక్ ముఖ్యమైన పాత్ర పోషించారు. నిజానికి ముస్లింలు, హిందువులకు మధ్య ఘర్షణలను నివారించడంలో బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తిలక్ కేసరిలో వాదించేవారు. బెంగాల్ను మత ప్రాతిపదికనే కర్జన్ 1905లో విభజించాడు. లాల్, పాల్లతో పాటు చిత్తరంజన్ దాస్, రవీంద్రనాథ్ టాగూర్ వంటి బెంగాలీ ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటికి యువతరంలో అరవింద్ ఘోష్ అంటే ఎంతో ఆకర్షణ ఉండేది. ఘోష్తో తిలక్ అనుబంధం ప్రత్యేకమైనది. 1902లో ఆ ఇద్దరు మొదటిసారి అహమ్మదాబాద్ జాతీయ కాంగ్రెస్ సభలలో కలుసుకున్నారు. ఘోష్ను కాంగ్రెస్ డేరా బయటకు తీసుకు వెళ్లి తిలక్ చాలాసేపు మాట్లాడారు. ఇద్దరి అభిప్రాయాలు దాదాపు ఒక్కటే. మితవాదుల పంథా సరికాదన్నది అందులో ఒకటి. అలాగే స్వాతంత్య్రో ద్యమం మరింత విస్తరించాలి. విప్లవాత్మకం కావాలి. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం జాతీయ స్థాయికి వెళ్లడానికి నాలుగు సూత్రాలను ముందుకు తెచ్చారు. అవి-స్వరాజ్, జాతీయ విద్య, స్వదేశీ, విదేశీ వస్తు బహిష్కరణ. ఇవి తిలక్ అందించినవేనని కొందరు రాశారు. వీటితోనే ఉద్యమం భారతీయులందరికీ చేరువ కాగలదని తిలక్ నమ్మారు. ఇవి ఆచరించ దగినవే అయినా, మరింత విప్లవ దృష్టితో ఉద్యమం రావాలన్నది ఘోష్ అభిప్రాయం.
ఇవన్నీ జరిగిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం మౌనంగా ఉంటుందనీ, తిలక్ని ఊరికే వదులుతుందని ఎవరూ అనుకోలేదు. అదే జరిగింది కూడా. అలాంటి అవకాశం కోసమే పొంచి ఉన్న పోలీసులకి ఏప్రిల్ 30, 1908న జరిగిన ముజఫర్పూర్ బాంబుదాడి, తరువాతి పరిణామాలు అవకాశం కల్పించాయి. బొంబాయిలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు భారతీయుల పట్ల అత్యంత నిర్దయగా వ్యవహరించినందుకు ప్రతీకారంగా ఆ రోజున ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ అనే యువకులు బొంబాయి ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్ఫోర్డ్ మీద బాంబు విసిరారు. అది గురి తప్పి ఇద్దరు స్త్రీలు మృతి చెందారు. ఆ ఇద్దరు యువకుల ఉద్దేశాన్ని మాత్రం తిలక్ కేసరి పత్రికలో శ్లాఘించారు. పైగా వెంటనే స్వరాజ్యం ఇవ్వాలని కోరారు కూడా. దీని మీదనే జూలై 3, 1908న దేశద్రోహ నేరం ఆరోపించి అరెస్టు చేశారు. ఈ కేసును తిలక్ కోసం బొంబాయి హైకోర్టులో మహమ్మదలీ జిన్నా వాదించారు. కానీ ఓడిపోయారు. అదంతా ఒక పథకం. తిలక్కు ప్రవాస శిక్ష విధించినందుకు దావర్ అనే న్యాయ మూర్తికి ఆలస్యం లేకుండా సర్ బిరుదు వచ్చింది. జిన్నా తిలక్ వద్దకు వచ్చి చేతులు పట్టుకుని ఎంత బాధపడ్డారో ఎంసీ చాగ్లా తన ఆత్మకథ ‘రోజెస్ ఇన్ డిసెంబర్’లో అద్భుతంగా వర్ణించారు. 1908 నుంచి 1914 వరకు తిలక్ బర్మాలోని (నేటి మైన్మార్) మాండలే జైలులో శిక్ష అనుభవించారు. అక్కడే గీతా రహస్య పుస్తకం రచించారు.
బొంబాయిలోని సర్దార్ గృహ తిలక్ నివాసం. ఆగస్టు 1 (1920) వేకువన ఆయన మరణించినట్టు చెప్పే వార్త నగరంలో దావానలంలా వ్యాపించింది. ఆ ముందు రాత్రి అంతిమ క్షణాలు లెక్కిస్తున్న తిలక్ను రక్షించేందుకు ప్రముఖ వైద్యులంతా శ్రమించారు. అలాంటి సమయంలో కూడా తిలక్ అన్నమాట ఒక్కటే, ‘స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు.’
Source - Jagruthi Weekly

1 comment:

  1. స్వరాజ్యాన్ని సాధించలేకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు

    ReplyDelete