ఎమర్జెన్సీకి 45 ఏళ్లు-Complete Story of Emergency in telugu
నలభయ్ ఐదేళ్లు గడిచాయి. అది దారుణమైన చేదు జ్ఞాపకమే అయినా,
చరిత్రహీనమైనా భారతీయుల జ్ఞాపకాల నుంచి చెరిగిపోవడం దుర్లభం. ఏ చారిత్రక
ఘటన అయినా అది వదిలి వెళ్లిన ఫలితాన్ని బట్టి స్థానాన్ని
సంపాదించుకుంటుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి జనతా పార్టీకి
జన్మనిచ్చింది. జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి పురుడు పోసింది.
కాంగ్రెస్ తన రాజకీయ శత్రువును తానే సృష్టించుకుని, ఆ శత్రువు చేతిలోనే
మట్టి కరిచింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 28 ఏళ్లకే ఈ దేశం మీద
కాంగ్రెస్ అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని రుద్దింది. ఆ అర్ధరాత్రి
దేశంలో జరిగిన స్వైర విహారం సైనిక పాలనలోకి పోతున్నామన్న అనుమానాన్ని
కలిగించింది. రక్త సహిత అధికార మార్పిడి ఏదో జరిగిపోతున్నదన్న భయాందోళనలు
రాజ్యమేలాయి. ఆ నిశివేళ దేశంలోని పలుచోట్ల ప్రముఖ విపక్ష రాజకీయ నాయకుల
ఇళ్ల మీద పోలీసులు దాడులు చేసి, అరెస్టు చేశారు. ఎలా ఉన్నవారిని అలా
ఎత్తుకుపోయి గుర్తు తెలియని చోట నిర్బంధించారు. ఢిల్లీ కేంద్రంగా
వెలువడుతున్న చాలా పత్రికలకు హఠాత్తుగా, ఏ హెచ్చరిక లేకుండా విద్యుత్
సరఫరా నిలిచిపోయింది. ఈ అరెస్టులు, ఆ నిశిరాత్రి వీరంగం పత్రికలలో
కనపడకుండా చేయడమే ఆ చర్య వెనుక ఉద్ద్యేశమని వెంటనే బయటపడింది. నిద్ర
పోతున్న జర్నలిస్టులను లేపి తీసుకుపోయారు. అర్ధరాత్రి నుంచి 21 మాసాలు
భారతదేశం అక్షరాలా బందిఖానాను మరిపించింది. ఇలాంటి చేదు అనుభవాన్ని నాటి
ప్రధాని ఇందిరాగాంధీ జాతికి రుచి చూపించారు. స్వాతంత్య్ర పోరాట సంస్థగా
భారత జాతీయ కాంగ్రెస్‌కు ఉన్న మూలాల మీద, ఇందిరకు ఉందని చెప్పుకుంటున్న
నెహ్రూ వారసత్వం మీద దేశ ప్రజలకు భ్రమలన్నీ పటాపంచలైపోయిన రాత్రి అదే.
జూన్ 25, 1975… స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యం భంగపడడానికి వేదికగా
మారిన రాత్రి ఆనాటిదే.
ఒక ఎన్నికల తీర్పు, ఒక కోర్టు తీర్పు అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం
తీసుకోవడానికి తక్షణ కారణాలని గుర్తుంచుకోవాలి. మూడు నాలుగు ఘోర రాజకీయ
తప్పిదాల పతాక సన్నివేశం – 1975-77 నాటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. భారత
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు అని చెప్పదగిన ఎన్నికలలో జరిగిన తప్పిదాన్ని
సవరించడానికి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్
మోహన్‌లాల్ సిన్హా తన తీర్పు ద్వారా చేసిన ప్రయత్నాన్ని నాటి అధికార
పార్టీ, ప్రధానమంత్రి మొత్తంగా ప్రజాస్వామ్యం హత్యకు ఉపయోగించుకున్న వైనం ఆ
పరిణామంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎన్నికల తప్పిదానికి
పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నదీ, విచారణ జరుగుతున్నదీ సాక్షాత్తు
నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీయే. కాంగ్రెస్‌లో, దేశంలో తిరుగులేని
నాయకురాలిగా వెలిగిపోతున్నప్పటికీ చట్టం ముందు అంతా సమానులే అన్న
సిద్ధాంతాన్ని ఇందిర కేసులో జస్టిస్ సిన్హా మహా సాహసంతో ఆచరించి చూపారు.
అత్యవసర పరిస్థితి విధింపు 1971 నాటి లోక్‌సభ, 1972 నాటి అసెంబ్లీ ఎన్నికల
నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామం. అప్పటికి ఇందిర తిరుగులేని నాయకురాలు.
లోక్‌సభలో కాంగ్రెస్‌దే మెజారిటీ.. అసెంబ్లీలలో కూడా ఆ పార్టీదే హవా.
1972లో దేశ వ్యాప్తంగా 3754 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే,
కాంగ్రెస్ పార్టీయే 2237 స్థానాలు గెలిచింది. వ్యవస్థా కాంగ్రెస్
(దీనినే పాత కాంగ్రెస్ అనేవారు) 104, భారతీయ జనసంఘ్ 153, సీపీఐ 67,
సీపీఐ (ఎం) 147 గెలుచుకున్నాయి. అయినా నియంత పోకడలకు పోయిన ఇందిర రాజకీయ
అస్థిరతకు బాటలు పరిచారు. కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాలలో కాంగ్రెస్
అధికారంలో ఉన్నప్పటికీ దేశంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అత్యవసర
పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారామె. ఇదే పెద్ద విచిత్రం. భారత్‌లో
అత్యవసర పరిస్థితి విధింపు నాటి ప్రధాని పదవీ దాహానికి గీటురాయి వంటిదే
కానీ మరొకటి కాదని దేశ విదేశ రాజకీయ విశ్లేషకులు ఆనాడే నిర్ధారణకు వచ్చారు.
దేశంలో అశాంతి పరిస్థితులు ఉన్న మాట నిజమే. అవి ఎలాంటివి? జేపీ వంటివారు
ధర్మాగ్రహం ప్రకటించక తప్పని పరిస్థితి. ఆయన ఏనాడూ అధికార రాజకీయాలలోకి
రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సర్వోదయ ఉద్యమంలో పనిచేశారు. బిహార్
వారి స్వరాష్ట్రం. సంపూర్ణ విప్లవం కోసం అక్కడ నుంచే పిలుపు నిచ్చారు.
అసలే పేదరికం, వెనుకబాటుతనం. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి. ముఖ్యమంత్రి
స్థానం అంటే తోలుబొమ్మ కంటే అధ్వానమైపోయింది. 1967 నుంచి 1971 వరకు ఆ
రాష్ట్రంలో పదిమంది ముఖ్యమంత్రులు మారారు. మహామాయా ప్రసాద్‌తో మొదలయిన ఈ
తతంగం బోలా పశ్వానాశాస్త్రి రాకతో ఆగింది. ఆ మధ్యలోనే వచ్చిన సతీశ్
ప్రసాద్ సింగ్ కేవలం నాలుగు రోజులే ముఖ్యమంత్రి. 1968లోనే ఈ
ప్రహసనానికి తెర దించమని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపమని జేపీ
కోరారు. అది జరగలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడమని విద్యార్థులకు
పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమాక్రసి, యూత్ ఫర్ డెమాక్రసి
సంస్థలు ఈ ఉద్యమం కోసమే ఆరంభమయ్యాయి. చిత్రం ఏమిటంటే, బిహార్ అమాత్యులు
ఎంతటి అవినీతిపరులో ఇందిర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులే సభలలో తూర్పార
పట్టేవారు. జేపీ పిలుపులోని ఔచిత్యం వెల్లడయి నప్పటికీ బిహార్ ప్రజలు
స్పందించలేదు. కానీ గుజరాత్ విద్యార్థులు ఉద్యమించారు. ఆపై బిహార్ కూడా
రగులుకుంది. గుజరాత్‌లో ఎమ్మెల్యేలను నిలదీసి, అక్కడికక్కడే రాజీనామాలు
చేయించారు. దానినే బిహార్ ఆందోళనకారులు అనుసరించారు.
దేశం మొత్తం మీద రెండు మూడు రాష్ట్రాల విద్యార్థులు అప్పటికే ఆందోళన బాట పట్టిన మాట నిజమే. 1973లో సంపూర్ణ విప్లవం రావాలంటూ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పిలుపునిచ్చారు. కానీ, విద్యార్థుల ఆందోళనలను దేశానికి ప్రమాద ఘంటికలుగా ఎవరైనా చూస్తారా? 1974లో అసలు గుజరాత్‌లో విద్యార్థి ఉద్యమాలు ఎందుకు మొదలయినాయో చూస్తే వింత అనిపిస్తుంది. పెంచిన మెస్ చార్జీలు తగ్గించాలన్నది అందులో ఒకటి. మోర్వీ ఇంజనీరింగ్ విద్యార్థులు ట్యూషన్ ఫీజు తగ్గించాలని ఆందోళనకు దిగారు. ఇంకా చిత్రంగా తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని రాజ్‌కోట్ విద్యార్థులు కోరారు. మొదటివారు విద్యామంత్రి రాజీనామా కోరారు. ఆందోళనలు ఉధృతమైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీసు కాల్పులలో 48 మంది చనిపోయారు. అప్పుడు అది అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చి, అంతిమంగా గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కేంద్రబిందువుగా ఉద్యమం ఊపందు కుంది. మొరార్జీ విద్యార్థులకు అండగా నిలిచి, అసెంబ్లీ రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిరాహార దీక్ష చేశారు. చివరికి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపవలసి వచ్చింది. జూన్ 12, 1975 ఫలితాలు వెలువడినాయి. చిమన్‌భాయ్ నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయింది. జనమోర్చా కూటమి అధికారంలోకి వచ్చింది. ఉదయం అలహాబాద్ కోర్టులో ఓటమి. సాయంత్రం గుజరాత్ ఎన్నికల ఫలితాలలో ఓటమి.
అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద స్టే కోసం సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఈ కేసులో ఇందిర తరఫున వాదించిన నానీ ఏ పాల్కీవాలా సలహా ఇచ్చారు. రాయబరేలీలో ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు సాంకేతిక కారణాల ప్రాతిపదికగానే తీర్పు ఇచ్చిందనీ, సుప్రీంకోర్టు ఈ తీర్పును పక్కన పెడుతుందని ఆయన అన్నట్టు చెబుతారు. అయితే సుప్రీంకోర్టులో వెకేషనల్ న్యాయమూర్తి జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే మాత్రమే మంజూరు చేశారు. ఎందుకంటే, ప్రధాని పదవి కాబట్టి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కీలకం కాబట్టి. అంటే ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందిర మరో ఆరేళ్ల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేయరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది కూడా. పుండు మీద కారం చల్లడం అంటే అక్షరాలా ఇదే. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చు. పార్లమెంట్ ఉభయ సభలలోను పాల్గొనవచ్చు. మాట్లాడవచ్చు. కానీ ఓటు హక్కు ఉండదు. ఈ రెండు తీర్పులను కూడా ఇందిరా గాంధీ గౌరవించలేకపోయారు. ఈ గడ్డు సమస్య నుంచి బయటపడడం ఎలాగో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే, ప్రతిపక్షాలు ఇందిర రాజీనామాకు పట్టు పట్టాయి. జూన్ 25వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రైతు నాయకుడు చౌధురి చరణ్‌సింగ్ ఈ ఉద్యమంలో ముందున్నారు.

ఈ సభలో జేపీ చేసిన ఒక వ్యాఖ్యతో మొత్తం విపక్షం ఒక విద్రోహక పాత్రకు సిద్ధమైందన్నట్టు ఇందిర అనుచరులు కథ అల్లారు. చట్టబద్ధత లేని ప్రధాని ఇచ్చే ఆదేశాలు సైన్యం, పోలీసులు పాటించరాదంటూ జయప్రకాశ్ నారాయణ్ ఈ సమావేశంలోనే పిలుపునిచ్చి అల్లర్లకు పురిగొల్పారని కాంగ్రెస్ ఆరోపణ. ఆ రాత్రే- జూన్ 25, 1975న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దేశం అంతర్గత కల్లోలాన్ని ఎదుర్కొంటున్నదన్న వాదనతో ఇలాంటి తీవ్ర నిర్ణయం వైపు ఇందిరను నడిపించిన వారు సిద్ధార్థ శంకర్ రే. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నాటి హోం శాఖ సహాయ మంత్రి ఓం మెహతా చేత ఇందిర అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించిన పత్రాలను రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు పంపించి ఆగమేఘాల మీద సంతకం చేయించారు. రాజ్యాంగంలోని 352 అధికరణం మేరకు ‘దేశంలో కల్లోల పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందితే’ సంతకం చేయవచ్చు. కాసు బ్రహ్మానంద రెడ్డి కేంద్ర హోంమంత్రి. ఆయన కూడా 26వ తేదీ ఉదయమే వార్తాపత్రికలలో చూసి అత్యవసర పరిస్థితి సంగతి తెలుసుకున్నారని కొందరు అంటారు. కానీ నిద్రపోతున్న హోంమంత్రిని ఓం మెహతాయే లేపి సంతకం చేయించుకుని వెళ్లాడని మరో కాంగ్రెస్ దిగ్గజం జలగం వెంగళరావు తన ఆత్మకథ (నా జీవిత కథ)లో రాశారు. మరొక పక్క అర్ధరాత్రి రెండు-మూడు గంటల మధ్య జేపీ, మొరార్జీలను పోలీసులు అరెస్టు చేశారు. మదర్లాండ్ పత్రిక సంపాదకుడు కేఆర్ మల్కానీని కూడా అరెస్టు చేశారు. ఈ అర్ధరాత్రి అరెస్టుల గురించే మల్కానీ తన పుస్తకం ‘మిడ్ నైట్ నాక్’లో వర్ణించారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నంత హడావుడి జరిగిందట. ఇళ్ల చుట్టూ పోలీసులు మోహరించడం, తరువాత అరెస్టు. తెల్లవారిన తరువాత జరిగిన అరెస్టులు మరీ విచిత్రం. నాటి జనసంఘ్ నాయకులు అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీ, సోషలిస్ట్ మధు దండావతే మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు. పార్లమెంటరీ బృంద సభ్యులుగా వారు బెంగళూరు వెళ్లారు. ఫిరాయింపుల బిల్లు మీద ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీల అభిప్రాయాలు తీసుకోవడం వారి ఉద్దేశం. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వారిని అరెస్టు చేయడానికి ఉపయోగించే ఐపీసీ 151 నిబంధన ప్రయోగించారు. అడ్వాణీ ఇక్కడ జైలులో ఉండగానే ‘ఏ ప్రిజనర్స్ స్క్రాప్ బుక్’ రాశారు. అత్యవసర పరిస్థితి కాలంలో దేశంలో సెన్సార్ అయిన వార్తల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న తదితరులు అరెస్టయ్యారు. 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. అత్యవసర పరిస్థితి వంటి అసాధారణ చర్య తీసుకుంటే మంత్రిమండలితో చర్చించాలి. ఆ రాత్రి రాష్ట్రపతి సంతకం అయిన తరువాత 26వ తేదీ ఉదయం ఏడు గంటలకు మంత్రి మండలిని పిలిచి సంగతి చెప్పారు. వెంటనే ఆకాశవాణిలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె వెళ్లారు.
అత్యవసర పరిస్థితి వెన్నంటే ఉంటుంది సెన్సార్షిప్. పత్రికల కార్యాలయాలలో సెన్సార్ అధికారులు కత్తెర పట్టుకుని సిద్ధంగా ఉండేవారు. జూన్ 26 నుంచి ఇది అమలులోకి వచ్చింది. తరువాత ఇందిర ఇరవై సూత్రాల కార్యక్రమం ప్రకటించారు. దీనికి తోడు ఆమె కుమారుడు సంజయ్ గాంధీ నాలుగు సూత్రాల ప్రణాళికను ప్రకటించారు.
అయినా ఇందిర రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను విపక్షాలు విడిచి పెట్టలేదు. నాడు లోక్‌సభలో విపక్షాల బలం అరవై లోపే. జూన్ 29, 1975న జేపీ నాయకత్వంలో లోకసంఘర్ష సమితి ఏర్పాటయింది. దీనికి మొరార్జీ అధ్యక్షుడు. జనసంఘ్ ప్రముఖుడు నానాజీ దేశ్‌ముఖ్ కార్యదర్శి. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఉద్యమం జరిగింది. అత్యవసర పరిస్థితి సమయంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. రాజ్యాంగాన్ని అడ్డగోలుగా సవరించారు. లోక్‌సభ కాలపరిమితి పెంచారు. తమకు వ్యతిరేకమని తలచిన చాలామంది న్యాయ మూర్తులను బదిలీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, ఆనంద్ మార్గ్, జమాయితే ఇస్లాం, సీపీఐ (ఎంఎల్) సహా 26 సంస్థలను నిషేధించారు. చిత్రం ఏమిటంటే క్విట్ ఇండియా ఫేం అరుణా అసఫాలీ వంటి ఎందరో ఇందిర చర్యలను వేనోళ్ల పొగిడారు. క్రమశిక్షణ అంటూ వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఒక్క ఆంధప్రదేశ్‌లోనే 1975 సెప్టెంబర్ నాటికి 1600 మంది ఎన్జీవోలను బలవంతంగా పదవీ విరమణ చేయించారు. ఆ సెప్టెంబర్ 20న ఈ సంగతిని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అసెంబ్లీలో ప్రకటించారు కూడా. క్రమశిక్షణ లేని వారినీ, అసమర్థులనూ వందలాదిగా ఉద్యోగాల నుంచి తొలగించామని పలువురు ముఖ్యమంత్రులు బాహాటంగా చెప్పారు. సంజయ్ గాంధీ లీలలు ఎన్నో తరువాత బయటకు వచ్చాయి. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల పేరుతో ఘోరాలు జరిగాయి. తమకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు పోలీసుల సాయంతో గ్రామాలను ముట్టడించి మరీ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను బలవంతంగా చేసేవారు. ఇందులో బాలలు, ఎనభయ్ ఏళ్ల వృద్ధులు కూడా ఉండేవారు. రకరకాలుగా బెదిరించి 25,000 మంది ప్రభుత్వోద్యోగులకు కూడా కు.ని. శస్త్ర చికిత్సలు చేశారు. సుందరీకరణ పేరుతో ఢిల్లీలో టర్క్‌మన్ గేటు ప్రాంతాన్ని కూల్చివేశారు. 1977, జనవరిలో సెన్సార్‌షిప్‌ను ఎత్తివేసిన తరువాత ఇలాంటి వార్తలన్నీ పత్రికలలో వెల్లువెత్తాయి. స్నేహలతారెడ్డి విషాదాంతం (కర్ణాటక), రాజన్ అదృశ్యం (కేరళ) దేశాన్ని కదిలించాయి.
కాంగ్రెస్‌లోని ఇందిర వందిమాగధులు ఆమెను బ్రహ్మాండమైన భ్రమలో ఉంచేశారు. నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర అని కీర్తిస్తూ ఉండే వాడు. అత్యవసర పరిస్థితిలో దేశంలో బోలెడంత అభివృద్ధి జరిగిపోయిందని ఆమె కూడా నమ్మారు. అభివృద్ధి అంటే రైళ్లు వేళకు నడవడం, ఉద్యోగులు సమయ పాలన పాటించడం. ఆఖరికి జనవరి 18, 1977న ఆకాశవాణిలో ప్రసంగిస్తూ లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజున మొరార్జీ, అడ్వాణీ విడుదలయ్యారు. జనవరి 24న వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలు జనతా పార్టీగా అవతరించాయి. వ్యవస్థా కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్ట్ పార్టీ కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇదే జనతా పార్టీ. ఫిబ్రవరి 2న బాబూ జగ్జీవన్‌రామ్ కాంగ్రెస్‌నీ, ప్రభుత్వాన్ని వదిలి పెట్టి ఇందిర మీద ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలు జరిగాయి. ఇందిర, సంజయ్ గాంధీ కూడా ఓడిపో యారు. అత్యవసర పరిస్థితి ప్రతినాయకులుగా పేరు మోసిన బన్సీలాల్, వీసీ శుక్లా వంటి వారంతా మట్టి కరిచారు. మార్చి 21, 1977న నాటి ఉప రాష్ట్రపతి బీడీ జెత్తి అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినట్టు ప్రకటిం చారు. జనతా పార్టీ చీలికలు పేలికలై రెండేళ్లకే కుప్ప కూలి ఉండవచ్చు. అయినా అత్యవసర పరిస్థితి ద్వారా దేశం నేర్చుకున్న పాఠం చిరస్మరణీయమైనది.
చరిత్రాత్మక తీర్పు
జూన్ 12, 1975న అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రా
త్మకమైనది. 258 పేజీల ఆ తీర్పు చట్టం ముందు అంతా సమానమే అన్న రాజ్యాంగ
విలువను ఆశ్రయించుకుని ఉన్నది. 1971 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీ
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ
ఎన్నికలలో ఆమె ప్రత్యర్థి, సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్. ఈ ఎన్నికలలో
ఇందిర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆమె ఎన్నిక చెల్లదని
వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు. లక్ష ఓట్లతో ఓడిన రాజ్‌నారాయణ్, కోర్టులో
మాత్రం ఘన విజయం సాధించారు. 1971లో మొదలయిన విచారణ 1975 జూన్ రెండో
వారంలో ముగిసింది. రెండు ఆరోపణలతో జస్టిస్ సిన్హా తీర్పు చెప్పారు.
ప్రధాని సచివాలయ ఉద్యోగి యశ్ పాల్ కపూర్‌ను తన గెలుపునకు
ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇందిర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సాయం
తీసుకున్నారు. కానీ ప్రధానమంత్రి పదవికి ఉన్న ప్రాముఖ్యాన్ని బట్టి తన
తీర్పును రెండు వారాలు నిలిపివేస్తూ సిన్హా వెసులుబాటు కల్పించారు. అంతవరకు
ఇందిర ప్రధానిగా కొనసాగవచ్చు. ఈ కేసులో ఇందిర తరఫున పాల్కీవాలా, రాజ్
నారాయణ్ తరఫున శాంతిభూషణ్ వాదించారు. కానీ ఇందిర కోరుకున్నట్టు
సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద పూర్తి స్టే విధించడానికి
అంగీకరించలేదు. షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చింది. ఇందిర ప్రధానిగా
కొనసాగవచ్చు. పార్లమెంటులో జరిగే చర్చలలో పాల్గొనవచ్చు. కానీ ఓటు వేసే
హక్కు లేదు. కాబట్టి ఓటుహక్కు లేని ప్రధాని పదవిలో ఎందుకని విపక్షం వాదన.
ప్రధానిగా కొనసాగే హక్కు కోర్టు ఇచ్చిందని అధికార పక్షం కాంగ్రెస్ వాదన.
అసలు ఎన్నికే చెల్లదని తీర్పు చెప్పిన తరువాత ఇక పదవిలో ఉండే హక్కు
ఎక్కడిది?
పత్రికల మీద ప్రతీకారం
అత్యవసర పరిస్థితి భారతీయ పత్రికలకు చేటు కాలమనిపించింది. జూన్ 25 రాత్రే బహదూర్‌షా జాఫర్
మార్గ్‌లో ఉన్న అన్ని పత్రికలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అత్యవసర
పరిస్థితిని విధించిన సంగతితో ప్రత్యేక సంచికలు తేవాలని పలు పత్రికలు
ప్రచురించి విఫల మయ్యాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్టేట్స్‌మన్ వంటి
దినపత్రికలు ఎన్నో నిర్బంధాలను చవి చూశాయి. శంకర్ పిళ్లై సంపాదకత్వంలోని
‘శంకర్స్ వీక్లీ’ కథ మరీ విషాదం. అది దేశంలో ఉన్న ఏకైక కార్టూన్ల పత్రిక.
పత్రికను అచ్చుకు పంపే ముందు సెన్సార్ అధికారులకు విధిగా చూపించాలన్న
నిబంధనతో ఏకీభవించలేక శంకర్ తన పత్రికను మూసివేశారు.
కేఆర్ మల్కానీ పత్రిక మదర్ ఇండియా కూడా మూత పడింది. సెన్సార్‌షిప్‌నకు నిరసనగా చాలా పత్రికలు మూడు రోజులు సంపాదకీయం అచ్చు వేసే స్థలాన్ని ఖాళీగా ఉంచాయి. నాలుగో రోజున మాత్రం సంపాదకీయం రాశాయి.
ఎన్నో పత్రికలను నిషేధించారు. వాటిలో కొన్ని- జాగృతి (తెలుగు, హైదరాబాద్), సృజన(తెలుగు, హైదరాబాద్), ప్రజా సమస్యలు (తెలుగు, రాజమండ్రి), మెయిన్ స్ట్రీమ్ (ఇంగ్లిష్, ఢిల్లీ), జవానీ దివానీ (హిందీ, ఢిల్లీ), ఆర్గనైజర్ (ఇంగ్లిష్, ఢిల్లీ), సెమినార్ (ఇంగ్లిష్, ఢిల్లీ), సాధన (గుజరాతీ, అహమ్మదాబాద్), భూమిపుత్ర (హిందీ, బరోడా), లోకవాణి (కన్నడ, బెంగళూరు), పాంచజన్య (హిందీ, లక్నో), ఒపీనియన్ (ఇంగ్లిష్, ముంబై), రాష్ట్రవార్త (మలయాళం, ఎర్నాకులం), విక్రమ్ (కన్నడ, బెంగళూరు), క్వెస్ట్ (ఇంగ్లిష్, ముంబై) వంటి ఎన్నో పత్రికలు నిషేధానికి గురైనాయి.

Source - Jagruti Weekly
నలభయ్ ఐదేళ్లు గడిచాయి. అది దారుణమైన చేదు జ్ఞాపకమే అయినా, చరిత్రహీనమైనా భారతీయుల జ్ఞాపకాల నుంచి చెరిగిపోవడం దుర్లభం. ఏ చారిత్రక ఘటన అయినా అది వదిలి వెళ్లిన ఫలితాన్ని బట్టి స్థానాన్ని సంపాదించుకుంటుంది.
ReplyDelete