నారదమహర్షి జీవిత చరిత్ర - Narada Maharshi Life Story in telugu
నారద ముని ఆబాల గోపాలానికి తెలిసిన మునిపుంగవుడు. “నారాయణ నారాయణ” అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. నారద ముని ప్రస్తావన లేని భారతీయ వాఙ్మయం లేదు. సనాతన ధర్మ సంప్రదాయంలో మనిషి, మనీషి గా, మహాత్ముడుగా ఉన్నతిని అందుకొని ముముక్షువుగా పరమపదంచేరి మహర్షిగా దైవత్వాన్ని పొందుతాడు. నారద మహర్షి ఆ కోవలో ‘ నేను ‘ అనే మాయను పూర్తిగా అవగాహన చేసుకొన్న బ్రహ్మా మానస పుత్రుడు. విష్ణుభక్తుడు పరమశివుని ప్రియశిష్యుడు. పద్నాలుగులోకాలను ఇచ్చామాత్రంగా చుట్టిరాగల బ్రహ్మర్షి. ఆధ్యాత్మికసాధనలో ఆయనకు ఆయనే సాటి.
బ్రహ్మాప్రళయం ఏర్పడినప్పుడు కొందరు మహాత్ములు శుద్దసాత్విక ఆత్మస్వరూపంతో శ్రీవిష్ణుసాన్నిధ్యంలో ఉండి పునఃసృష్టి జరిగినప్పుడు, బ్రహ్మా నుండి పాంచభౌతికదివ్యరూపం తిరిగి పొందుతారు. బ్రహ్మర్షి నారదమహర్షి. ఎన్నో బ్రహ్మాకల్పాలు విష్ణుస్వరూప సాక్షాత్కారఫలంతో గడిపారని మన పురాణాలు పేర్కొన్నాయి. ఆయన వయస్సు అంచనా మన ఊహకు కూడా అందదు.
సనాతనహిందూసాంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధన గురుశిష్యవిధానంలో, గురు శుశ్రూష చేసిన శిష్యుడు (తెలుసుకోవాలీ అన్న తపనతో) వినమ్రంగా అడిగితే గురువు బోధన చేయటం జరుగుతుంది. నారదుడు దాసీపుత్రుడిగా జన్మించి అయిదేళ్ళ చిరుప్రాయంలో తల్లీతండ్రులను కోల్పోయి మునులసేవలో జ్ఞానార్ధిగా ఎదిగిన సామాన్యమానవుడు. హరినామ సాధన అవిరళంగా చేసి, అఖండభక్తితో విద్వత్తు పొందినవాడు. ఆయన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించి తృప్తిపడక తనలా ప్రతీ సామాన్యుడు ఆ ముక్తిమార్గాన్నిఅందుకోవాలి అన్న ఉన్నతాశయంతో “ భక్తిసూత్రాలు “ ప్రకటించారు. అవే“ నారదభక్తిసూత్రాలు“ గా ప్రఖ్యాతమైనవి.
సనకసనందనాదులు శుద్ధసాత్వికరూపధారణలో బాలల రూపంలో పూర్తి దైవచింతనలో గడిపితే, వారి స్థాయిని అందుకున్న నారద మహర్షి, ప్రాపంచిక విషయాలలో కూడా తన లోకకళ్యాణదృక్పథం చూపారు. మాయ ఆవరించి సాంసారికజీవనంలో ఏది చెయ్యాలి ఏదిచెయ్యరాదు?? మనిషి తత్వచింతనలో జీవితాన్ని గడపాలా లేక సంసారసాగరం ఈదుతూగడపాలా?? ప్రకృతి- పురుషుడు వారివారి బాధ్యతలు ఏమిటి?? సంతానఫలం ఏమిటి?? వైరాగ్యం ఎందుకు ఏర్పడుతుంది?? ఎలా ఏర్పడుతుంది?? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు సామాన్యులకు, మహాత్ములకూ( స్థాయీబేధంతో) కలగటం పరిపాటి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నారదమహర్షి వివిధ గ్రంథాలరూపంలో మనకు అందించారు. “నారద పురాణం“గమనిస్తే నారాయణ మహర్షిని సేవించి తాను స్వయంగా గ్రంధస్థం చేసిన ‘గణేశఖండం‘. వ్యాసమహర్షికి బోధించి గ్రంధస్థం చేయించిన ‘ భాగవతము‘, వాల్మీకి మహర్షిని ప్రేరేపితం చేసి గ్రంధస్థం చేయించిన ‘రామాయణం’ ఇలాఎన్నో ప్రఖ్యాత పురాణ, ఇతిహాసాలు ఉన్నాయి.
నారద మహర్షి నాదసాధకులకూ మార్గాన్నిచూపిన మహతీ నినాదుడు. స్వయంగా సరస్వతీఅమ్మవారు సంగీతవిద్యను ఆయనకు బోధించారు. మహతి అనే వాద్యవిశేషాన్ని వాయుదేవుడు అందించాడు. నారదమహర్షి తన గాత్రాన్ని‘మహతి’ తో అనుసంధానం చేసి నాదాన్నిసప్తస్వరభాగాలు చేశారు. తద్వారా రాగాలు, నాద వికారబేధాలతో వర్ణాలు, స్వరములు, వాద్యములు అనేకానేక సంగీతవిశేష్యములు ఆవిష్కరించారు.. శబ్ద సంగీతవిశేషమైన‘ ఆహత’, ‘అనాహత’ గాన సూత్రాలు కూడా నారదీయ ఆవిష్కరణయే. నారదులవారు బ్రహ్మా సన్నిధిలో స్థాయి, సంచారి, ఆరోహణ, అవరోహణరూపాలతో వాది, సంవాది పాద భేదములు కలిగిన సనాతన భారతీయసంగీతం అందించారు.
త్రికాలదర్శి అయిన నారదులవారికి ‘కలహభోజుడు ‘ అన్న పేరు జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యం పొందింది. లౌకిక దృష్టికి స్ఫురించని అనేక కార్యక్రమాలను ఆయన తన భుజానవేసుకుని మరీ నడిపించారు. పురాణాలలో, ఇతిహసాలలో ఈ లోకకళ్యాణ క్రీడలు కోకొల్లలు. నాటకాన్ని రక్తికట్టించడం ఈయనకు కొట్టినపిండి.
ఈ విశేషాలు ఇలాఉంటే నారదులవారి ప్రజ్ఞ అనేకరంగాల్లో ప్రకటితమైంది కూడా. ధర్మశాస్త్రం పై నారదవిరచిత “నారద స్మృతి” ఈనాటికీ న్యాయవ్యవస్థలో అమలులో ఉంది. “బృహన్నారదీయము “,“ లఘునారదీయము “ ఆంగ్లభాషలో కూడా అనువదించబడ్డాయి. ఈ గ్రంథంలో ఆస్తి పంపకములు మొదలగు ధర్మాలన్నీ చెప్పబడ్డాయి. శిల్పశాస్త్రం పై కూడా నారదులవారు గ్రంధరచన చేశారు. గ్రామనిర్మాణము మొదలుకొని పట్టణ నిర్మాణ వివరములు కలిగిన వాస్తుశాస్త్ర లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. ఇతరరచనలు “ జ్యోతిర్నారదము“, “ చతుర్వింశతి మతము“. ఈ గ్రంధాల వైవిధ్యాన్ని గమనిస్తే నారద మహర్షికి ఈ లోకంలో మనుష్యులకు అవసరమైనవీ, అలాగే ఆధ్యాత్మిక లోకసాధన సంపత్తీ అన్నిటిపై పూర్తి అవగాహన ఉందని అర్ధమవుతుంది. సద్గురు శ్రీశివానందమూర్తిగారు చెప్పినట్లు మహర్షులుగా ఉన్నత మానవుల గురించి తెలుసుకొని వారి అడుగుజాడలలో నడవడం వివేకవంతులు చేయవలసిన పని. మన అఖండభారతవాఙ్మయంలో ఇంతటి ప్రభావశాలి అయిన నారదమునీంద్రుని చరిత్ర ప్రతీ భారతీయుడు చదవాలి. తమతమ లౌకిక, అలౌకిక జ్ఞానసముపార్జనకు ఆయన చూపించిన దారిలో అడుగులువెయ్యాలి..
సేకరణ: సద్గురు శ్రీ శివానంద మూర్తి గారు వ్రాసిన `మార్గదర్శకులు మహర్షులు’ (సనాతన సుపధ పబ్లికేషన్స్) నుండి..
సంక్షిప్తీకరణ: చంద్రమౌళికళ్యాణచక్రవర్తి
సంక్షిప్తీకరణ: చంద్రమౌళికళ్యాణచక్రవర్తి
Source- VSK TELANGANA
లోక కళ్యాణాన్ని కోరుకున్న నారదమహర్షి
ReplyDelete