బి ఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విలువనిచ్చి, వారి ఆలోచనా విధానంలో నడుద్దాం
1.భౌగోళికంగా మనం ఒక దగ్గర చేరి ఉన్నంత మాత్రాన, దాదాపు ఒకే విధమైన ఆచారాలు వున్నంత మాత్రాన, మన దేశం ఏర్పడలేదు. అంతకంటే మించి దేశానికి ప్రాణం ఐన ఏకాత్మత అంటే మనమంతా ఒకే ప్రజ,ఒకే దేశం అనే భావన వల్ల దేశంగా ఏర్పడ్డామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అయన అందించిన రాజ్యాంగం ఇదే అందిస్తుంది. అది బలపడాలంటే సోదర భావం పంచాలి.ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంచాలి.సామాజిక న్యాయం అనే గట్టి నేలను తయారు చేయాలి. దానిపైన శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు కలలు కన్నారు.మన దేశంలో వివిధ కులాలు, అంతకంటే మించిన వైవిధ్యం ఉన్నంత మాత్రాన విభేదాలకు,విభజనకు పాల్పడవద్దని వారు కోరుకున్నారు.
2. అంబేద్కర్ కారణంగా నేటి యువ తరానికి 'దేశమంటే- యావత్తూ భారతదేశం' అని అర్థం అవుతుంది. రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాల కి చాలా అధికారాలు ఇచ్చారు. కేంద్రానికి ఎక్కువ విచక్షణాధికారాలు ఇచ్చారు. ఎందుకు? సార్వభౌమ అధికారం ఇచ్చి , ఒకే పౌరసత్వం ఇచ్చి భారతదేశం విడివడని ఒకే దేశం అనే కల్పన ను (The idea of India) ఇచ్చి తన దూరదృష్టి ని ప్రదర్శించి,జాగ్రత్తలు తీసుకున్న అంబేద్కర్ ని మనం అభినందించాలి. 'అధికారం ఇవ్వడం సులభమే..కాని వివేకం ఇవ్వడం సాధ్యమా?" అంటారు అంబేద్కర్. కేంద్రం బలహీనమైనప్పుడల్లా, దేశం విదేశీ ఆక్రమణలకు గురైందని గుర్తించిన వారు, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్రం వివేకాన్ని ప్రదర్శించాలని గౌరవ పూర్వకంగా, అభిమానం గా భావిస్తున్నట్లు అంబేద్కర్ రాజ్యాంగ సభలో పేర్కొన్నారు. భారతదేశాన్ని విభజించాలని కోరిన అప్పటి ముస్లిం లీగ్ కి వ్యతిరేకంగా అఖండ భారతమే మెరుగైనదని నేను భావిస్తున్నానని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఈనాడు మనం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వేర్వేరు శిబిరాలు నడిపిస్తున్నామని నేను ఒప్పుకుంటాను.అయితే మన 'ఈ దేశం ఒకటి కాకుండా ' ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని గట్టిగా చెప్పిన దేశ భక్తుడు అంబేద్కర్.(1946 డిసెంబరు 19న రాజ్యాంగ సభలో మాట్లాడింది)
3. అంబేద్కర్ , 20 వ శతాబ్దంలో దేశ భవిష్యత్తు గురించే కాదు, వేల సంవత్సరాల తర్వాత కూడా దేశానికి ఎదురయ్యే పరిస్థితులలో స్థిరంగా ఎలా ఉండాలో, గట్టి ఏకాత్మత గల, గట్టి ప్రభుత్వం గల దేశంగా రూపకల్పన చేయడం లో అత్యంత కఠినమైన పనిని, మనసు పెట్టి, శక్తి యుక్తులను వినియోగించారు. ఆయన అందించిన 'బలమైన భారతదేశ కల్పన' కు మనం తరతరాలుగా ఆయనకు ఋణపడి వున్నామనటంలో అతిశయోక్తి లేదు.కుల,మత కలహాలతో సతమతమవుతూ, వందల సంఖ్యలో వున్న చిన్నచిన్న రాజ్యాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యంగా భారత ప్రభుత్వం లో కలిపితే, అంబేద్కర్ సాహసంగా ఎన్నో విషయాలు అధ్యయనం చేసి, రాష్ట్రాలన్నీ కేంద్రం నీడన వుండి, సార్వభౌమత్వానికి రాజ్యాంగ బద్దతను కల్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ ని ఎన్నుకోగానే, 'ఇప్పుడు నేను ఎస్ సి వర్గాలకు మాత్రమే నాయకున్ని కాదని, సంపూర్ణ భారత సమాజం గురించి ఆలోచించ వలసునవాడిగా భావించి, ఆ మనో భూమికతో వ్యవహరించారు. ప్రజాజీవన రంగంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప ఆ పాత్రను ఎవరూ పోషించలేరు. కాని అంబేద్కర్ ఆ పనిని సులభంగా నెరవేర్చారు.
4.
అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడానికి వెనక ఎవరెవరు వున్నారో చదివితే ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. " రాజ్యాంగ సభ్యునిగా, వివిధ ఉప సమితుల సభ్యునిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మనదేశం ఇంకా లాభపడాలంటే, జులై 14 నుండి మొదలయ్యే రాజ్యాంగ సభలో అంబేద్కర్ వుండవలసిందేనని, ఆ విషయంలో నేను ఎంతో ఆసక్తి తో వున్నానని డా. రాజేంద్ర ప్రసాద్ , అప్పటి ముంబాయి ముఖ్య మంత్రి బిజి ఖేర్ కి ఉత్తరం వ్రాసారు. అలాగే అంబేద్కర్ ఎంపిక విషయం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యక్షంగా బిజి ఖేర్ తో మాట్లాడారు.
ఆ విధంగా 1947 జులై లొ సభలో ప్రవేశించారు. 1947 లో దేశ విభజన కారణంగా వారు అప్పటికే ఎన్నికైన పశ్చిమ బెంగాల్ లోని ఒక భాగం పాకిస్తాన్ లో కలవడం తో సభలో సభ్యత్వం కోల్పోయారు. ఆ తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ చొరవ తో సభలో ప్రవేశించి, డ్రాఫ్టింగ్ కమిటీ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఇందులో 7 గురు సభ్యులున్నా , ప్రధాన పాత్ర మాత్రం అంబేద్కర్ పోషించారు.
సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యం లేకుండా జాతీయ భావన రాదని, ఒకే సంస్కృతి ని అనుసరిస్తూ నే, భారతీయులందరికి సమాన భాగస్వామ్యం వుండాలని, సమాన సంబంధాలు వుండాలని, సమాన ఆశా ఆకాంక్షలు వుండాలని వారు వందల సంవత్సరాల పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాల కు రిజర్వేషన్ కల్పించి, జాతీయ జీవన స్రవంతిలో కలిపే పనిని విజయ వంతంగా చేశారు. అలాగే అన్ని వర్గాల కు చెందిన మహిళలకు, కార్మికుల కు ఎన్నో హక్కులు కల్పించి అందరి వాడని అనిపించుకున్నారు.
5.
ఆధునిక భారత దేశంలోని ప్రొటెస్టంట్ హిందూ నాయకులలో మొదటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన జీవితాన్ని హిందూ ధర్మ పునరుజ్జీవనం కోసం, హిందూ సాంఘిక వ్యవస్థ యొక్క పునర్వ్యవస్థీకరణ లో అంకితం చేశారు. హిందూ మతం, హిందూ సాంఘిక వ్యవస్థ లపై ధ్వజమెత్తడమే కాకుండా హిందుత్వాన్ని శుభ్రపరచి విప్లవీకరించిన వ్యక్తి. పునర్వ్యవస్థీకరించి చైతన్యవంతం చేశారు.హిందూ సమాజం శిథిలమై, దిగజారి పోకుండా రక్షించడానికి ఒక అపూర్వమైన మానసిక విప్లవానికి శంఖం పూరించాడు
స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే పునాదుల మీద హిందూ సాంఘిక వ్యవస్థ పునర్నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. కుల తత్వం నుండి, పూజారుల ఆధిపత్యం నుండి హిందూ సమాజం విముక్తం కావాలని కోరుకున్నారు.ఆయన చెప్పినట్లు గా నడిస్తే, హిందువులు స్వేచ్చా జీవులుగా, సజీవమైన, చైతన్య సమాజం గా రూపొందుతారు. ఆయన సిద్దాంతం ప్రకారం తన తోటి మతస్తులతో కలిసి జీవించడానికి హిందువులకు స్వేచ్ఛ వుండాలి.తమ దేశం, ధర్మం, భవిష్యత్తు లను నష్ట పరిచే సమస్యలను హిందువులందరు చర్చించుకునే అలవాటు వుండాలంటారు.
ఆయన సామాజిక సిద్ధాంతం కులతత్వాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించి,హిందూ భావనను పునర్ జ్వలింపజేసి, హిందూ సమాజాన్ని సంఘటితపరచడానికేనని హిందువుల కు నచ్చచెప్పింది.షెడ్యూల్డ్ కులాల హిందువులకు ఆయన చేసిన సేవ ప్రపంచంలోని పేదలలోకెల్ల పేదలకు చేసిన సేవగా గుర్తించాలి. ఆయన కార్యం హిందూ సమాజ కార్యమని, దేశకార్యమని, మానవాళి కార్యమని అందరూ అర్థం చేసుకోవాలి. ఆయనది హిందూ సమాజ కార్యం ఎలా అవుతుంది? అనే ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుంది. ఇస్లాం, క్రైస్తవ మతాలలో కూడా అసమానతలు వున్నాయి. కాని వాటి గురించి ఉద్యమించలేదు.కేవలం హిందూ సమాజంలో వెయ్యి సంవత్సరాల నుండి ఒక జాఢ్యంగా పరిణమించిన దురాచారాలను నిర్మూలించడానికి కృషి చేసారంటే...హిందూ సమాజానికి మేలు చేయాలనే కదా? బౌద్ధం కూడా హిందూ సమాజంలో ని మూఢనమ్మకాల పై యుద్ధం ప్రకటించి, ప్రజ్ఞ, కరుణ,సమతల నిర్మాణానికే. అంతేగాని హిందూ మతాన్ని సమూలంగా ధ్వంసం చేయడానికి కాదు.కేవలం సంస్కరించడానికే.
( "డాక్టర్ అంబేద్కర్ - లైఫ్ అండ్ మిషన్ " పుస్తకం లో రచయిత ధనుంజయ ఖీర్. అంబేద్కర్ మీద వ్రాసిన పుస్తకాలు ఆయన చనిపోయిన తరువాత వ్రాయబడినవే. కాని 'లైఫ్ అండ్ మిషన్' పుస్తకం మాత్రం అంబేద్కర్ బ్రతికున్నప్పుడు ఆయన ఆమోదం తర్వాతే ముద్రించబడింది.
- అప్పాల ప్రసాద్.
బి ఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విలువనిచ్చి, వారి ఆలోచనా విధానంలో నడుద్దాం
ReplyDelete