Breaking News

కార్యకర్త

ఈ రోజు శ్రీ భోజనపల్లి నరసింహమూర్తి ఒక వీడియోను షేర్ చేశారు. అందులో మూడు లేదా నాలుగేళ్ళ వయసున్న శిశు స్వయంసేవక్ శాఖను నడపడం ఉంది. ఈ వీడియో చూడగానే నేను ప్రత్యక్షంగా చూసిన ఒక ముఖ్యశిక్షక్ గురించి వ్రాయాలనిపించింది.
1991_ 92 నాటి కాలం. భాగ్యనగర్ బర్కత్ పురా లోని ప్రాంత కార్యాలయం కేశవ నిలయంలోని సాయం శాఖ. ఆనాటి దక్షిణ మధ్య క్షేత్రపు మాననీయ క్షేత్ర సంఘచాలకులు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆనాటి పశ్చిమ ఆంధ్రప్రదేశ్ మాననీయ ప్రాంత కార్యవాహ శ్రీ ముదుగంటి మల్లారెడ్డి పర్యటన నుండి తిరిగివచ్చారు. ఉదయం శాఖకు వెళ్ళడం కుదరలేదు కాబట్టి ప్రార్థన చేయడానికి ఈ శాఖకు వచ్చారు. కార్యాలయ వ్యవస్థలో ఉన్నందున , నేను కూడా వారి వెంట శాఖకు వెళ్ళాను. ఆ సమయానికి గీత్ ప్రారంభమైంది. తర్వాత అమృత వచనం, ఆ తర్వాత ముఖ్యశిక్షక్ చిన్నకథ చెప్పడం జరిగింది. ఉత్తిష్ఠ చెప్పడానికి ముందు, ఎవరెవరు అగ్రేసర్ గా రావాలో చెప్పడం ఆ శాఖలో ఆనవాయితీ గా ఉండేది. దాంతో ఆ రోజుముఖ్యశిక్షక్ గా వ్యవహరించిన బాల స్వయంసేవక్, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వైపు చూసి , ' నువ్వు తరుణ గణకు అగ్రేసర్ గా రావాలి ' అన్నాడు. వెంటనే , శ్రీ మల్లారెడ్డి గారు తనదైన శైలిలో ' ఆయన క్షేత్ర సంఘచాలక్. కాబట్టి అధికారి స్థానంలో నిలబడాలిగదా! ' అన్నారు. అపుడా ముఖ్యశిక్షక్ , అవునుగదూ, సరేలే అంటూ శ్రీ మల్లారెడ్డి గారి వైపుచూస్తూ, ' అయితే నువ్వు అగ్రేసర్ గా రా! ' అన్నాడు. వెంటనే శ్రీ మల్లారెడ్డి గారు సరేనంటూ తలూపారు. తర్వాత మిగిలిన గణలకు ఎవరెవరు అగ్రేసర్ గా రావాలో చెప్పేశాడు ముఖ్యశిక్షక్. తర్వాత యథావిధిగా శాఖ ముగిసింది. 
ఆ తర్వాత శ్రీ శాస్త్రి గారు తమాషాగా , 'ముఖ్యశిక్షక్ అంటే ఇలాగే ఉండాలి . తన శాఖలోని స్వయంసేవకులకు ఏ బాధ్యతనైనా అప్పగించడానికి వెనుకాముందు చూడకూడదు.' అన్నారు. 
ఎలాంటి భయం లేకుండా వ్యవహరించిన ఆ బాల ముఖ్యశిక్షక్ పేరు చెప్పనేలేదు కదూ! అతడి పేరు సీతారామ్ కులకర్ణి. శ్రీ పాండురంగారావు కులకర్ణి గారబ్బాయి. ప్రస్తుతం లాయర్ గా పనిచేస్తున్నాడు.

" ముఖ్యశిక్షకులు జాతిని ముందుకు నడిపిస్తారు " అని ఓ పాతగీత్ లో ఓ పాదం ఉంది.
"ముఖ్యశిక్షక్ సంఘాన్ని మోసే ఆదిశేషుడు " అనేవారు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు.

1 comment:

  1. " ముఖ్యశిక్షకులు జాతిని ముందుకు నడిపిస్తారు " అని ఓ పాతగీత్ లో ఓ పాదం ఉంది.

    ReplyDelete