Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 19 / 50



1963 లో బెళగావి లో ఉన్న శ్రీ గురూజీ ని ట్రినిడాడ్ పార్లమెంట్ లో సభ్యుడైన శ్రీ శంభునాథ కపిల్ దేవ్ కలవడానికి వచ్చారు. 

సుమారు 150-200 సంవత్సరాల క్రితం వెళ్ళిన భారతీయుల అయిదు లేదా ఆరవ తరం హిందువులు వెస్టిండీస్ ద్వీపాలలో ఉన్నారని, తమ ధార్మికనిష్ఠను పోషించి , పెంచుకోవడంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం ఎక్కడుందనేది శ్రీ శంభునాథ్ గారిని వేధిస్తున్న ప్రశ్న. తమ భవిష్యత్ తరాలకు ఉత్తమ హిందూ సంస్కారాలను ఇచ్చే వ్యవస్థలు అక్కడ లేవు. హిందూ పండుగలను ఆచరించాలంటే, పూజ చేయించేవారు లేరు. నామకరణం, వివాహం, అంత్యేష్ఠి లాంటి విధులకూ చర్చి ఫాదరీ సహకారం పొందే పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి తమకు హింది, సంస్కృతం నేర్పే భాషా పండితులు, ధార్మిక విధులు నడిపించే పురోహితులు, హిందూ సంస్కృతి, రీతినీతులను తెలియజెప్పే అధ్యాపకులు కావాలని - ఇలా అనేక కోరికలతో భారత్ కు వచ్చారాయన. అయితే ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో విద్య మరియు సాంస్కృతిక శాఖకు మంత్రిగా ఉన్న శ్రీ హుమయూన్ కబీర్ , సెక్యులరిజం విధానం నెపంగా చూపి శ్రీ శంభునాథ్ కోరికలకు స్పందించడాన్ని తిరస్కరించారు. 

నిరాశ చెందిన శ్రీ శంభునాథ్ కపిల్ దేవ్ కు అకస్మాత్తుగా ఢిల్లి లోని ఒక పార్క్ లో నడుస్తున్న సంఘశాఖ కంటపడింది. అక్కడ ఎగురుతున్న భగవాధ్వజం, యువకులు ఆడుతున్న ఆటలు, సంఘప్రార్థన ఆయనలో కుతూహలం కల్గించింది. దాంతో ఆయన శాఖ దగ్గరకు వెళ్ళి ,స్వయంసేవకులకు తన గురించి పరిచయం చేసుకున్నాడు. సంఘం గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకుని ఢిల్లి కార్యాలయానికి, ఆ తర్వాత నాగ్పూర్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడినుండి బెళగావి కి వచ్చాడు. 

ఆయన మాటలు, కోరిక విన్న శ్రీ గురూజీ , సంఘం ద్వారా మీరు పేర్కొన్న విషయాల గురించి లోతైన చర్చ జరుపుతాము. సరైన వ్యక్తులను ఇక్కడినుండి పంపే ఏర్పాటు చేస్తాము. వివిధ దేశాల్లోని హిందువుల కొరకు ఒక సంస్థ అవసరం ఉంది. ఆ దిశలో ఆలోచన మొదలైంది. త్వరలోనే కార్యరూపం దాలుస్తుంది అన్నారు. 

వారిరువురి మధ్య చర్చ 1964 లో విశ్వహిందూపరిషత్ స్థాపనకు దారి తీసింది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. 1963 లో బెళగావి లో ఉన్న శ్రీ గురూజీ ని ట్రినిడాడ్ పార్లమెంట్ లో సభ్యుడైన శ్రీ శంభునాథ కపిల్ దేవ్ కలవడానికి వచ్చారు.

    ReplyDelete