Breaking News

శిష్యుడు గురువ్రతుడు


గురువుగారూ! అని ఎవరినైనా పిలిస్తే వారు మనకు గురువులయిపోరు. నీ ఉద్ధరణ కోసం పాటుపడుతున్న వారిలో నీకు ఎవరిమీద గురి పెరిగిందో వారు నీకు గురువులు. గురిలేనప్పుడు వారు గురువులు కాలేరు, కారు కూడా. ఒక్కొక్కసారి గురువు ప్రమేయం లేకుండా కొందరు గురువుకి శిష్యులయిపోతుంటారు. పూనిక అంత గొప్పది. గురుశిష్యుల సంబంధం శిష్యుడి వైపునుంచి ప్రవహిస్తుంది. కబీర్‌దాసుగారి విషయంలో అలా జరిగింది. గురుశిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది. శిష్యుడి ఆర్తిచేత గురువవుతాడు తప్ప గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు. అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, ఉద్ధరణ పొందేస్తాడు. అంతే. మరి కొన్ని సందర్భాల్లో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తుంటాడు.
అంతేవాసి అంటే శిష్యుడు. గురువు మనసులో చోటు సంపాదించి కొడుకయిపోతాడు. కొంతకాలానికి కొడుకుకంటే శిష్యుడే ఎక్కువ గుర్తుకొస్తుంటాడు. అలా శుశ్రూషచేత గురువు గారి హృదయంలో చేరిపోతాడు. గురువుకూడా ప్రేమతో స్వీకరిస్తాడు. గురువు ఆజ్ఞ స్వీకరించి ఈశ్వరపథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అటువంటి శిష్యుణ్ణి చూసి ’ఏమి దీక్షరా, ఎంత అనుష్ఠానం చేస్తున్నాడ్రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడ్రా’ అని గురువు మురిసిపోతుంటాడు. గురుశిష్య సంబంధాల్లో అనేక విధాలుంటాయి. పతివ్రత అనేమాట మీరు వినే ఉంటారు కదా !
అటువంటిదే గురువ్రత అనే మాట ఒకటుంది.అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే గురువు ఈ మాట వాడతాడు. పతివ్రత అంటే ఆమె ఆలోచనలన్నీ ఆమె భర్త గౌరవాన్ని పెంచడం పైనే కేంద్రీకృతమై ఉంటాయి. అలా గురువ్రతుడైన శిష్యుడు గురువుగారి గౌరవాన్ని పెంచుతూ ఆయనకు వశవర్తయి ఉంటాడు. అందుకే ’ఇదినాది’అనే భావన ఉండదు. ‘ఇదంతా నీది. నీ ఉచ్చిష్టాన్ని నేను ప్రసాదంగా అనుభవిస్తున్నాను’ అనే భావనతో ఉంటాడు. గురువు సమర్థ రామదాసు కనబడితే భిక్షాపాత్రలో శివాజీ మహరాజ్‌ ఒక కాగితం ఉంచాడు. అది విప్పి చూస్తే రాజ్యమంతా ధారపోసినట్లుంది.
‘‘నాకెందుకురా సన్యాసిని. నా ప్రసాదంగా నువ్వే ఏలుకో. ఇదిగో కాషాయ పతాకం. అన్ని చోట్ల పెట్టు.’’ అన్నాడు. అలాగే విద్యారణ్యులవారు రాజ్యస్థాపన చేసారు. తర్వాత దాన్ని హరిహర బుక్కరాయల వారికి ఇచ్చేసారు. ఇప్పటికీ శృంగేరీ గురువులకు ‘కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య’ అన్నది వారి బిరుదావవళిలో వినిపిస్తుంటుంది. గురువోచ్చిష్టం. గురువు తాను ఏం అనుభవిస్తున్నాడో ఎంత ఐశ్వర్యం ఉందో అది గురువోచ్చిష్టంగా శిష్యుడు అనుభవిస్తాడు.
శిష్యుడు బయట ఎంత గొప్పవాడయినా గురువ్రతుడిగా గురువుకి లొంగి ఉంటాడు. ‘ఆజ్ఞాపాలన హనుమ’ లాగా గురువుగారు చెప్పే దానిని శాసనంగా స్వీకరిస్తాడు. ఆయన శాసకుడు. గురుశిష్య సంబంధంలోని ఒక సత్యాన్ని రూఢం చేసుకున్నవాడిని ‘గురువ్రత’ అంటారు. ఏమిటా సత్యం? ‘గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు’ అని. లోకంలో ఎవరు ఇచ్చినా అది సలహా కావచ్చు. కానీ గురువు ఇచ్చేది ఆజ్ఞ. ‘నేను కింకరుణ్ణి. ఆయన చెప్పింది చేసేయడమే నా పని’ అనేది శిష్యుడి భావనగా ఉంటుంది. ‘నాకు, నా భార్యకు అత్యంత ప్రియమైన పని ఒకటి ఉంది. మంచిపనే. ఎందుకో ఒకరోజు గురువుగారు – ’ అది నువ్వు జీవితంలో చేయడానికి వీల్లేదు’ అన్నారు. ఎందుకని అని–మేం అడగలేదు. ఆనాటినుంచి నేను కానీ, నా భార్యకానీ దాని జోలికెళ్ళలేదు. దాన్ని సలహాగా కాదు, శాసనంగా స్వీకరించాం. ప్రపంచంలో ఎవరయినా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు.

1 comment:

  1. అలాగే విద్యారణ్యులవారు రాజ్యస్థాపన చేసారు. తర్వాత దాన్ని హరిహర బుక్కరాయల వారికి ఇచ్చేసారు. ఇప్పటికీ శృంగేరీ గురువులకు ‘కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య’ అన్నది వారి బిరుదావవళిలో వినిపిస్తుంటుంది.

    ReplyDelete