Breaking News

గురువు పునర్జన్మనిస్తాడు


’డాక్టరుగారి పక్కన నిలబడి సహాయకుడిగా వేయి శస్త్రచికిత్సలు చూశానండి. ఈ గోరుచుట్టుకు నేను శస్త్రచికిత్స చేస్తాను’ అంటే కుదరదు, డాక్టరుగారి పర్యవేక్షణ లోనే చేయాలి. అలాగే ఆ వ్రణం మారేకట్టు ఎవరు వేయాలంటే గురువుగారే వేయాలి. బ్రహ్మచర్యం–ఉపనయనం చేసాం. వేదాధ్యయనం చేయడానికి గురువుగారి దగ్గరకు వెళ్ళాలి. గురుశుశ్రూష చేసి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవాలి. బ్రహ్మచర్యాశ్రమం పూర్తయింది. మనసుకు కామమనేది సహజంగా ఉత్పన్నమవుతుంది. అది పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. ఆ కారణంగా పరమసంతోషంతో ధర్మబద్ధమైన భార్యయందు తన తేజస్సు ప్రవేశపెడితే –తేజోవంతమైన సంతానం కలుగుతుంది. ఆ పుత్రుడివలన పున్నామనరకం పోగొట్టుకుంటాడు. పితృరుణం తీర్చుకుంటాడు. అందుకు వచ్చింది కామం. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. కామాన్ని ధర్మబద్ధం చేయాలి. అక్షరాభ్యాసం చేస్తాడు కాబట్టి తండ్రి గురువు. మంత్రోపదేశం చేసినవాడు గురువు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలంటే –గురువుగారే వస్తారు. స్నాతకం అని చేస్తారు. అంటే ఇప్పుడు గురువుగారే వచ్చి కట్టుమీద కట్టు వేస్తారు. కట్టువిప్పి కట్టు కట్టడు.
ఈ కట్టుమీద కట్టు ఏమిటో మీకు సులభంగా వివరిస్తా–నేను పచ్చిగడ్డికోసి దాన్ని కట్టకట్టమని నా కొడుకుకు చెప్పాను. వాడు కట్టాడు. వదులుగా ఉన్నప్పుడు–నెత్తిమీదిపెట్టుకుని వెడుతుంటే కిందపడి పోతుందేమోనని మరో తాడు తీసుకుని ఈసారి నేను గట్టిగా బిగించి కట్టాను. వాడు కట్టిన కట్టు వదులుకట్టు. నేను కట్టిన కట్టు గట్టికట్టు. నేను కట్టు వేశాక అంతకుముందు వాడు వేసిన కట్టు జారిపోతుంది. కట్టువిప్పకూడదు. విప్పకుండా జార్చాలి. అదీ గురువు గొప్పదనం. అందుకు గురువు అవసరమవుతాడు. కాబట్టి ఇప్పుడు గురువువచ్చి బ్రహ్మచర్యాశ్రమం మీద గృహస్థాశ్రమం అన్న కట్టువేస్తాడు.

గృహస్థాశ్రమంలో కామం ధర్మబద్ధమవుతుంది. ధర్మపత్ని పక్కకు వచ్చి చేరింది. ఆమెను యజ్ఞానికి ఉపకరణంగా స్వీకరించి పత్నీస్థానంలో కూర్చోబెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హతనిచ్చి ఆమె చిటికెనవేలు పట్టుకుని ధర్మపథంలో ప్రయాణించడానికి సాధనం చేస్తాడు గురువు. కామాన్ని ధర్మబద్ధం చేస్తాడు. ఇప్పుడు కట్టుమీద కట్టు వేశాడు. కొన్నాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నావు. భోగాలనుభవించావు. అనుభవించి అనుభవించి ‘‘ప్చ్‌! ఈ భోగాలు ఒక భోగాలా!’’ అన్న వైరాగ్యాన్ని పొందావు. ఇప్పుడు వానప్రస్థమన్న కట్టువేస్తాడు. భార్యతోనే ఉంటావు. అరణ్యాలకు వెళ్ళి అన్నిటితో సంబంధం వదిలిపెట్టేస్తావు. కేవలం పరబ్రహ్మాన్ని ఉపాసన చేస్తూ దొరికినదానితో ఈ శరీరాన్ని పోషిస్తుంటావు. ఇక ఈ శరీరంమీద కూడ భ్రాంతిపోయింది. ఏ ఇంటిముందుకో వెళ్ళి నిలబడి భిక్షాన్నం ఏది దొరికితే ఆ కబళంతో పోషిస్తావు. ఏదీ దొరకకపోతే ఊరుకుంటావు. ఏ గుహలోనో, ఏ శ్మశానంలోనో ఉండి అక్కడ శరీరం దానంతట అది పడిపోతే సాక్షిగా చూస్తావు. సన్యాశ్రమ స్వీకారం చేసావు... కట్టుమీద కట్టు. ఇదయినా గురువుగారి వ్వవలసిందే. కట్టువేసి కట్టుజార్చేవాడు గురువు.
బ్రహ్మగారు శరీరం ఇచ్చారు. ఇందులో ఉంటూ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన శాస్త్రాన్ని మొదట తాను చదువుకుని శిష్యుడికి అర్థమయ్యేరీతిలో బోధించి శిష్యుని హృదయం భగవంతుని పట్ల, ధర్మానుష్ఠానం పట్ల అభిముఖ్యం పొందేటట్లు మార్గాన్ని సుగమం చేసి పరమేశ్వరునివైపుకి నడిపిస్తూ జ్ఞానాన్నిచ్చి కర్మాధికారం ఇచ్చి పునర్జన్మనిచ్చేవాడు గురువు. యజ్ఞోపవీతం వేస్తే ద్విజత్వం వచ్చింది. జన్మచేత అందరూ ఒక్కటే. సంస్కారంచేత ద్విజుడవయ్యావు. రెండోసారి పుట్టడం అంటే జ్ఞానమివ్వడం. బ్రహ్మగారు శరీరమిచ్చినా ద్విజుడిగా రెండోపుట్టుకనిచ్చి గురువు జ్ఞానమిస్తున్నాడ, శాస్త్రం ఇస్తున్నాడు. అందుకని గురువు బ్రహ్మ. ఆయనకు నమస్కారం.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

1 comment:

  1. బ్రహ్మగారు శరీరం ఇచ్చారు. ఇందులో ఉంటూ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన శాస్త్రాన్ని మొదట తాను చదువుకుని శిష్యుడికి అర్థమయ్యేరీతిలో బోధించి శిష్యుని హృదయం భగవంతుని పట్ల, ధర్మానుష్ఠానం పట్ల అభిముఖ్యం పొందేటట్లు మార్గాన్ని సుగమం చేసి పరమేశ్వరునివైపుకి నడిపిస్తూ జ్ఞానాన్నిచ్చి కర్మాధికారం ఇచ్చి పునర్జన్మనిచ్చేవాడు గురువు.

    ReplyDelete