Breaking News

నాన్నే నారాయణుడు-Chaganti Koteswararao


మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ–ఈ నలుగురినీ సాక్షాత్తు ఈశ్వర స్వరూపాలుగా భావించి నమస్కరించిన ఉపనిషత్తు మనకూ అలాగే ప్రబోధం చేసింది. ఈ క్రమంలో మొదట తల్లి వైభవాన్ని గురించి తెలుసుకున్నాం కదా. తండ్రిని పరబ్రహ్మంగా ఎందుకు భావించాలో ఇప్పుడు చూద్దాం.

పితృదేవోభవ–తండ్రి సాక్షాత్‌ పరమాత్మ స్వరూపమే. ఆయన చర్మచక్షువులకు కనబడేవాడు కాడు. పాలలోనే నెయ్యి ఉన్నది. కానీ మామూలు కన్నులకు కనిపించదు. కానీ ఆ పాలను కాచి, తోడుపెట్టి, కవ్వంతో చిలికి, వెన్నతీసి, కాచితే నెయ్యి వస్తుంది. పాలలో ఉన్న నెయ్యి ఎలా కనబడదో, అలా విశ్వనాథుడే విశ్వం రూపంలో ఉన్నప్పటికీ అందరికీ కనిపించడు. కొంత సాధన చేసినవారికి తప్ప ఇతరులకు పరమాత్మ దర్శనం లభించదు. ‘మాయ’ అనే తెర అడ్డు ఉన్న కారణంగా నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యత చెంది పునరావృత్తి చెందుతుంటాడు.

కానీ ఈ లోకంలో మనకున్న మాంసనేత్రాలతో చూడడానికి యోగ్యమైన పరబ్రహ్మ స్వరూపమే తండ్రి. అందుకే తల్లికి తొలి నమస్కారం చేయించిన వేదం... తరువాత తండ్రిని పరబ్రహ్మగా గుర్తించి నమస్కరించాలన్నది. తండ్రి ఎలా పరబ్రహ్మ అవుతున్నాడు? ఇటువంటి ప్రశ్నలకు మనం సాధికారికంగా ఏదయినా చెప్పాలంటే ప్రమాణంగా వేటిని స్వీకరించాలి? ’భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి నీవు ఇలా బతకవలసి ఉంటుంది’ అని మార్గదర్శనం ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి–వాటిలో మొదటిది శృతి. అంటే వేదం. వేదమే ప్రమాణం. శృతి భగవంతుని ఊపిరి. తరువాత స్మృతి. దీనిలోని విషయాలు రుషులు సంకలనం చేసినవి. ఈ రెండింటినీ జనసామాన్యానికి మరింత స్పష్టంగా చూపించేవి పురాణాలు. కాలానుగుణంగా ఇవి ధర్మంపట్ల మనకు అనురక్తిని కలిగిస్తుంటాయి. తరువాత శిష్టాచారం. అంటే శృతి, స్మృతి, పురాణం కూడా తెలియకపోతే పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి, శాస్త్రం తెలిసినవారి నడవడి ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవడం. ఈ నాలుగూ కూడా తెలియకపోతే అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి.

కాబట్టి మొట్టమొదటి ప్రమాణం శృతి. స్మృతులను అందరూ చదువుకోలేరనుకుని, కలియుగంలో మానవుల అల్పాయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసభగవానులు వేద విభజన చేసారు. స్వర ప్రధానంగా మూడుగా చేసి వాటిలో అత్యంత ప్రధానమైన అధర్వణ వేదాన్ని అత్యంత భద్రంగా మధ్యలో ఉంచారు. మళ్ళీ అత్యంత ప్రధానమైన రుద్రాధ్యాయాన్ని అధర్వణ వేదం మధ్యలో ఉంచారు.(ఈ భూలోకంలో ఎంత పెద్ద కష్టాన్నయినా తప్పించగలిగేది శివాభిషేకం.

ఆ అభిషేకానికి వాడే భాగమే రుద్రాధ్యాయం.) ఈ రుద్రాధ్యాయంలో కూడా అత్యంత శక్తిమంతమైన మహామంత్రాన్ని దాని మధ్యలోని అష్టమానువాకంలో పెట్టారు. అందులో ఒకచోట ’నమశ్శంకరాయచ, మయస్కరాయచ..’ అంటుంది వేదం. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడు ఈ లోకంలో తండ్రిరూపంలో తిరుగుతాడు. ఆ పరబ్రహ్మమే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా మూడు మూర్తులైనట్లు, అంటే.. మూడు మూర్తులు కలిసిన పరబ్రహ్మ–తండ్రిగా మన కంటిముందు తిరుగుతుంటాడు. ‘ఆ తండ్రికి చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే’ అంది వేదం– అదే పితృదేవోభవ. 
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.

1 comment:

  1. నాన్నే నారాయణుడు-Chaganti Koteswararao

    ReplyDelete