అన్నం మనల్ని తినేస్తుంది, జాగ్రత్త!!!
నడవడి, ప్రవర్తించుట అన్న అంశాలకు ఉండవలసిన లక్షణం ఏది? అసలు శరీరమంటూ ఒకటి ఉంటే, అది ఆరోగ్యంగా ఉంటే - ప్రవర్తించుట, పదిమందికీ ఉపయోగపడుట, పదిమంది ఆదర్శంగా స్వీకరించడమనే మాట ఉంటుంది. అసలు ఆ శరీరమే లేకపోతే, రోగగ్రస్థమై పోతే, మంచాన పడిపోతే ఇక నడవడి అన్నమాట ఉండదసలు. రోగగ్రస్థుడై మంచాన పడి ఉన్న వ్యక్తి తనకు తానే పనికిరాడు, ఆయనకు వేరొకరు సేవ చేయాలి. ఇక ఆయన ఎవరికి ఉపయోగపడగలడు? ఎవరికి ఆయన దార్శనికుడిగా నిలబడగలడు? భగవంతుడు మనకిచ్చిన పరమాద్భుత సాధనం-ఈ శరీరం. ఇది ధర్మార్థ కామ మోక్షాలకు హేతువు. దీనితో ఎన్నో విషయాలు చక్కబెట్టవచ్చు. దీనిలోంచి వచ్చిన మాట కొన్ని కోట్లమందికి ఆదర్శప్రాయమవుతుంది. అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దాన్ని పోషించి, రక్షించుకోవడం శీల నిర్మాణంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం.
వేదాంతంలో ఈ శరీరానికి అన్నవికారం అని పేరు. మనం తినే ఆహారాన్ని అన్నం అంటాం. కానీ వేదాంతంలో కేవలం మనం తినేది మాత్రమే అన్నం కాదు. అన్నము-అను మాటకు రెండు అర్థాలున్నాయి. మనచేత తినబడునది, మనలను తినునది-అని. ఒకటి మనల్ని తినేస్తుంది. రెండోది మనం దాన్ని తింటాం. కొంతకాలం అన్నం తిని మన శరీరం పెరుగుతుంది. ఏ అన్నం నేను తింటానో అదే నన్ను తింటుంది. ఎందుచేత అంటే ఏది కూడా అధికంగా పుచ్చుకోవడానికి వీల్లేదు. ఈ శరీరాన్ని పోషించడానికి ఆహారం తీసుకోవాలి తప్ప జిహ్వేంద్రియాలకు లొంగి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు. నాలుకకీ, కడుపుకీ పరస్పర విరోధం. కడుపుకీ, కంటికీ దగ్గర సంబంధం. కడుపు నిండితే కనురెప్ప వాలిపోతుంది.
రుచి కోసమని పదార్థాలను తెమ్మనమని నాలుక అడుగుతుంటుంది. ఒక మధుమేహ వ్యాధిగ్రస్థుడున్నాడనుకోండి. ఆయన తీపి పదార్థం తినకూడదు. కానీ నాలుక తిను.. తిను.. అని ప్రోత్సహిస్తుంటుంది. రుచిని ఎంతసేపని అనుభవించగలదు! ఒక్క క్షణ కాలమే. కానీ తరువాత ఆ పదార్థం కడుపులోకి వెళ్లిపోయిన తరువాత ఏది తినకూడదో అది తిన్నాడు కనుక అది విషంగా మారిపోతుంది. తత్ఫలితంగా ఆయనకు అంధత్వం రావచ్చు, గుండెపోటు రావచ్చు, శరీరానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన అవయవాలు దెబ్బ తినవచ్చు. ఇప్పుడు ఆ అన్నం శరీరపోషణకు పనికి రాలేదు. శరీరం పాడవడానికి పనికొచ్చింది. అందుకే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్నే మాత్రమే తీసుకోవాలి తప్ప శరీర పోషణకు పనికిరాని ఆహారాన్ని, శరీరాన్ని పాడుచేసే ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు.
దేవీ భాగవతంలో వ్యాసభగవానుడు - చేయకూడని భోజనం ఒక్కరోజు చేస్తే, తినకూడని పదార్థం ఒక్కసారి లోనికి పుచ్చుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని అంటాడు. ఆరోగ్యం సరిగా లేకపోతే మీరు చదవలేరు, మీకు ఆ రోజు పరీక్ష ఉన్నా రాయలేరు. శరీరానికి రోగ నిరోధక శక్తి కానీ, ఆరోగ్యం కానీ ఎక్కడినుంచీ వస్తుందంటే - తినడంతోనే వస్తుంది. అందుకే ఆ వయసులో మీరు సారవంతమైన ఆహారాన్ని తీసుకోవాలి కనుక విద్యార్థిదశలో ఉపవాసాన్ని శాస్త్రం నిర్దేశించలేదు.
లోగడ మనం చెప్పుకున్నట్లు వేంటేశ్వరస్వామివారికి మొదటి నైవేద్యం - అమ్మ వకుళమాత పెట్టిన పెరుగన్నం - మాతృప్రసాదం అంటారు. ఒక పిల్లవాడి జీవితంలో రోజు దేనితో ప్రారంభం కావాలి - అమ్మచేతి పెరుగన్నంతోనే. దానివల్ల కడుపు చల్లగా ఉంటుంది. విశేషమైన దాహమూ వేయదు. బుద్ధికి ప్రచోదనం. పగటిపూట ప్రారంభ కాలంలో తింటారు కనుక, శరీరం దానికవసరమైన శక్తిని పుంజుకుంటుంది. తినేటప్పుడు ఏదో తినడం కాదు, ఏదైనా ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే - ఆ పదార్థానికి ఒక స్వభావం ఉంటుంది. అన్నం ఎంత శౌచంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వండినా, అది తెల్లవారేటప్పటికి దుర్గంధ భూయిష్టమైపోతుంది. చెడువాసన వస్తుంది. దాన్ని బలవంతంగా నిల్వ చేయాలంటే కృత్రిమ వాతావరణం కల్పించాలి. లేదా కొన్ని రసాయనాలను చేర్చాలి. కానీ మన సాంప్రదాయంలో ప్రమాదరహితంగా నిల్వ చేసేవారు.
కృత్రిమంగా సిద్ధం చేసిన పదార్ధాలు అప్పటికి నాలుక మీద రుచిగా ఉంటాయేమో గానీ, జీర్ణకోశాన్ని, జీర్ణవ్యవస్థను పాడుచేస్తాయి. జిహ్వచాపల్యాన్ని నియంత్రించుకుని శరీర పోషణకు ఎంత పదార్థం, ఎటువంటి పదార్థం అవసరమో అటువంటివి తీసుకుని ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటే వారు జీవితంలో అనుకున్నవి సాధించుకోగలుగుతారు. ఎంత పెద్ద ఆశయమున్నా ఆరోగ్యం సహకరించనప్పుడు అది నిష్ఫలమౌతుంది.
బిడ్డను కన్నదగ్గర్నుంచీ తన శరీరం విడిచిపెట్టేవరకూ బిడ్డ శ్రేయస్సే కోరుతుంది తప్ప స్వార్థంతో ఇది కావాలని అమ్మ ఏనాడూ కోరుకోదు. అమ్మ అంటే - సౌందర్యం. అమ్మ అంటే - ఆశీర్వచనం-శ్రేయస్సు-క్షేమం-ఆప్యాయత-అమ్మ అన్న మాట ఒక గొప్ప ఓదార్పు. ఈ సౌందర్యం ఉన్నవారికి బాహ్య శరీరం ఎలా ఉన్నా దానితో సంబంధం ఉండదు. మీ మనసు కూడా సత్సంకల్పాల చేత, సత్సాంగత్యం చేత ఇంత సౌందర్యవంతం కావాలి. ఇది అంత తేలికైన విషయం కానప్పటికీ ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తే కానిదేముంది?
అన్నం మనల్ని తినేస్తుంది, జాగ్రత్త!!!
ReplyDelete