జోహార్ యతిన్
భగత్‌సింగ్ సాగిస్తున్న ఆకలి సమ్మెలో నెల తరవాత మిగతా సహచరులూ చేరాలని తొందరపడినప్పుడు వద్దని వారించినవాడు ఒకే ఒక్కడు:
యతీంద్రనాథ్ దాస్.
నిరాహారదీక్షను ఒకసారి మొదలెట్టాక కడ ఊపిరిదాకా కఠోరంగా కొనసాగించి, యావద్భారతానికీ ఆరాధ్యుడైన అమరుడు కూడా యతీన్‌దాసే.
మిత్రులను మొదట యతిన్ వారించింది ఆమరణ దీక్షకు భయపడి కాదు. ప్రాణం మీద తీపితో కాదు. హంగర్ స్ట్రైక్ యతిన్‌కు కొత్త కూడా కాదు. అంతకు ముందు అనేక పర్యాయాలు ఆకలి సమ్మె కట్టిన అనుభవం సహచరులందరిలోకీ అతడొక్కడికే ఉంది. అది ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టే...
‘దిగే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. ఆకలి సమ్మె అనేది ఎడతెగని అగ్నిపరీక్ష. తుపాకులతో, రివాల్వర్లతో పోరాడటం కంటే బాగా కష్టమైంది. పోలీసు తూటా వల్లో, ఉరికంబం ఎక్కో మరణించడం దానితో పోలిస్తే చాలా తేలిక. అణువణువూ అణగారిపోతూంటే, అంగుళమంగుళం మరణానికి చేరువవటం భయంకరమైన అనుభవం. ఒకసారి అందులో అడుగుపెట్టాక చేతగాక మధ్యలో ఆపెయ్యవలసి వస్తే అది విప్లవకారుడికి అవమానకరం. దానికంటే ఆ ఆలోచన విరమించుకోవటం మేలు’ అని యతిన్‌దాస్ బోర్‌స్టల్ జైలు సహచరులను హెచ్చరించాడు. ‘ఆకలి బాధను తట్టుకుని నిలబడటం తమ వల్ల అవుతుందో కాదో ఎవరికి వారు ముందే పరీక్షించుకోవటం మంచిది. మొదట ఓ 24 గంటలపాటు ఏ ఆహారం తీసుకోకుండా ఉండి చూడండి. మీ వల్ల కాదు అనుకుంటే సమ్మెలో చేరకండి’ అని దాస్ సలహా ఇచ్చాడు. మిత్రులందరూ ‘సై’ అన్నాక ‘మీతోబాటే నేనూ’ అన్నాడు. మధ్యలో ఎవరు మానేసినా, తాను మాత్రం గవర్నమెంటు తమ డిమాండ్లన్నిటికీ ఒప్పుకునేదాకా పట్టిన దీక్ష ఆపేది లేదని చెప్పాడు. దానికి కడదాకా కట్టుబడ్డాడు.
1929 జూలై 14న సహ నిందితులు, తోటి ఖైదీలు ఆకలి సమ్మెలో చేరారు. రాజకీయ ఖైదీలుగా గుర్తింపు, కనీస వసతులు, మంచి ఆహారం, పత్రికలు, పుస్తకాలు వంటి డిమాండ్లను పెడుతూ అదే రోజు అందరి తరఫున భగత్‌సింగ్ హోమ్ మెంబరుకు లేఖ రాశాడు.
మొదట వారం రోజులు ఈ సామూహిక సమ్మెను అధికారులు పట్టించుకోలేదు. నిండా పాతిక ఏళ్లు లేని కుర్రకారు. ఎంతకాలం అన్నం లేకుండా ఉంటారు? కడుపు మాడితే వాళ్లే దారికొస్తారు - అని ధీమాగా ఉన్నారు. అది ఆషామాషీ సమ్మె కాదు; వాళ్లు తేలిగ్గా లొంగే రకం కాదు -అని అర్థమయ్యాక బలవంతంగా ఆహారం ఎక్కించటానికి జైలువాళ్లు దౌర్జన్యానికి దిగారు. అతికష్టం మీద దాదాపుగా అందరికీ ఏదో ఒక విధంగా ఎంతో కొంత ద్రవాహారం ఎక్కించగలిగారు. వారి పన్నాగాలు ఏవీ పనిచేయనిదల్లా ఒక్క యతిన్‌దాస్ దగ్గరే.
‘మాస్టర్‌జీ’ అని సహచరులు ప్రేమగా పిలుచుకునే యతిన్‌దాస్ గతంలోనూ ఖైదులో నిరాహారదీక్ష చేశాడు. దాన్ని చెడగొట్టటానికి జైలువాళ్లు ఎలాంటి ఎత్తులు వేస్తారో అతడికి తెలుసు. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అతడికి ఒకరు నేర్పక్కరలేదు.
మొదటి రోజున అందరితోబాటు యతిన్‌కీ బలవంతపు ఆహారం ఎక్కించాలని అధికారులు ప్రయత్నిస్తే కుదరలేదు. అతడి సంగతి తీరికగా మర్నాడు చూద్దాము లెమ్మనుకున్నారు. మరునాడు పది మంది పఠాన్లను వెంటేసుకుని వచ్చి, యతిన్‌ని ఎటూ కదలలేకుండా కింద పడేసి డాక్టర్లు నోట్లోకి పైపు దూర్చారు. యతిన్ దాన్ని పళ్లతో గట్టిగా కరచి పట్టుకున్నాడు. డాక్టర్లు ఇంకో గొట్టం దిగవేశారు. మాస్టర్‌జీ దాన్నీ నొక్కి పట్టుకోవాలని ప్రయత్నించాడు. అతడికి ఊపిరాడలేదు. దగ్గు వచ్చింది. డాక్టరు వచ్చిన చాన్సు వదలదలచలేదు. రెండో పైపులోకి ధారాళంగా పాలు ఎక్కించాడు. అది కాస్తా కడుపులోకి కాక ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. డాక్టరు ఆ సంగతి గ్రహించలేదు. తన తొందరలో తానుండి ఏకంగా అరలీటరు పాలను నేరుగా ఊపిరితిత్తుల్లోకి కుమ్మరించాడు.
‘ఇదంతా జైలు హాస్పిటల్‌లో జరిగింది. అప్పటికే మేము అరడజను మందిమి అదే బారక్‌లో అడ్మిట్ అయి ఉన్నాం. దాస్‌కు ఉద్ధృతంగా ఫిట్లు రాసాగాయి. మేమందరం అక్కడ మూగాం. అతడి ఒళ్లు జ్వరంతో పేలిపోతున్నది. విపరీతంగా దగ్గుతూ, ఊపిరాడక లుంగచుట్టుకు పోతున్నాడు. మేము కేకలు పెట్టాం. అర్ధగంట తరవాత డాక్టర్ల బృందం వచ్చింది. అతడి పరిస్థితి చూసి వాళ్లు బిత్తరపోయారు. నెమ్మదిగా నేల మీంచి లేపి మంచం మీద పడుకోబెట్టారు. ఏదో మందు వేయబోయారు. అప్పటికి అపస్మారక స్థితిలో ఉన్నా ఎలాగో శక్తి తెచ్చుకుని, ‘నో’ అని ఇంగ్లిషులో వారిస్తూ నోరు గట్టిగా మూసుకున్నాడు. ‘మందే కదా, వేయనివ్వు’ అని మాలో కొందరు బతిమిలాడాం. అంత బాధలోనూ అతడు మాకేసి చిరునవ్వు నవ్వి తల అడ్డంగా తాటించాడు. చివరి దాకా అతడు ఇంజక్షనుకు గాని, మందు వేయడానికి గాని ఒప్పుకోలేదు. ఆ పరిస్థితిలో అతడిని బలవంతం చేస్తే ప్రమాదం. చేసేది లేక డాక్టర్లు ఛాతి మీద మర్దన మాత్రం చేసి, న్యుమోనియా అని తేల్చి నిష్క్రమించారు. రెండు మూడు గంటల తరవాత దగ్గు తెరలు కాస్త నెమ్మదించాక యతిన్ కళ్లు విప్పి, మమ్మల్ని చూసి ‘ఇక నన్ను వాళ్లు ఏమీ చేయలేరు’ అని యతీంద్ర సన్యాల్ చెవిలో వినపడీ వినపడనట్టుగా అన్నాడు.’
-అని తరవాత కాలంలో శివవర్మ గుర్తు చేసుకున్నాడు.
[Samsmritiyan, Shiv Verma, pp.126-127]
‘ఖైథీ యతీంద్రనాథ్ దాస్ నిన్న సాయంత్రం కృత్రిమ ఆహారం
ఇవ్వడాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ స్పృహ కోల్పోయాడు. అతడికి తగు చికిత్స చేయబడింది. ఈ ఉదయం అతడి టెంపరేచరు 102 డిగ్రీల ఫారన్ హీటు, పల్స్ రేటు 118. ఊపిరితిత్తుల్లో ద్రవం చేరింది. అతడికి ఇంజక్షను, పైపూతకు మందు ఇచ్చాం. నోటి నుంచి ఆహారాన్ని, ఔషధాలను అతడు ఇవ్వనివ్వడం లేదు. పరిస్థితి విషమిస్తుందన్న భయంతో కృత్రిమ ఆహారం అతడికి ఎక్కించడం లేదు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది’ అని జూలై 27న ప్రిజన్స్ ఐ.జి.కి స్థానిక జైలు అధికారులు తెలియపరిచారు.
‘యతిన్‌దాస్ ఆరోగ్యం విషమించింది. నిన్న అతడికి నోటి నుంచి, ముక్కు నుంచి గొట్టాలు వేసి ఆహారం ఎక్కించబోయి నానా ఆగం చేశారు. ఆకలి సమ్మెలో ఉన్న మా అందరినీ ఇలాగే చిత్రహింసలు పెడుతున్నారు. దాస్ మరణశయ్య మీద ఉన్నాడు. అతడికి ఏమైనా అయితే ఈ కోర్టు వారిదే బాధ్యత’ అని శివవర్మ, అజయ్ ఘోష్‌లు స్పెషల్ మేజిస్ట్రేటు కోర్టులో హెచ్చరిక చేశారు.
అలా నిరాహారంగా, ఏ ఔషధమూ తీసుకోకుండా జబ్బులతో బాధపడుతూ, అణువణువూ కుంగి కృశిస్తూ, మృత్యు ముఖంలోకి నెమ్మది నెమ్మదిగా ప్రయాణించసాగాడు యతిన్‌దాస్. శరీరం ఎంత శిథిలమై, నిస్త్రాణతో మంచానికి అతుక్కుపోయి కళ్లు కూడా తెరవలేనంత నీరసంగా ఉన్నా ఆఖరి ఊపిరిదాకా రాజీపడక పోరాడుతూనే ఉండాలన్న అతడి దృఢదీక్ష సడలలేదు.
కొన్నాళ్లకు యతిన్ శరీరం మొత్తానికి ఇనె్ఫక్షన్ వ్యాపించింది. ఎప్పుడూ కళ్లు మూసుకునే ఉండసాగాడు. ఎనీమా ఇస్తే ప్రయోజనం ఉంటుందేమో, కనీసం దానికైనా అంగీకరించమని డాక్టర్లు అడిగారు. దాస్ అడ్డంగా తల ఊపాడు. యతిన్ పరిస్థితి బాగా విషమించినట్టు పత్రికల ద్వారా తెలియడంతో ఎక్కడెక్కడి ప్రజలూ, ప్రముఖులూ ఆందోళన పడసాగారు. భగత్‌సింగ్‌తో యతిన్‌కి చెప్పించి చూడమని కొంతమంది సలహా ఇచ్చారు. అధికారుల అభ్యర్థన మీద భగత్‌సింగ్ బోర్‌స్టల్ జైలుకు వెళ్లాడు. అతడు అడగగానే ఎనీమా చేయించుకోవడానికి యతిన్ ఒప్పుకున్నాడు. ఎవరు ఎన్ని విధాల చెప్పినా విననివాడివి భగత్ కోరగానే ఎందుకు సరే అన్నావని జైలరు అడిగాడు. ‘సర్! భగత్‌సింగ్ ఎంతటి ధీరుడో మీకు తెలియదు. అతడి మాట ఎవరు కాదనగలరు?’ అని బదులిచ్చాడు యతీంద్రనాథ్.
ఇంకో పర్యాయం, ప్రాణాన్ని నిలబెట్టటానికి అత్యవసరమైన మందును యతిన్ చేత మింగించడానికి మళ్లీ భగత్‌సింగే అవసరమయ్యాడు. ‘్భగత్‌సింగ్! ఔషధం ముట్టనని నేను శపథం చేసిన సంగతి నీకు తెలుసు. అయినా నీ మాట కాదనలేక ఈ ఒక్కసారి ఒప్పుకుంటున్నాను. దయచేసి మళ్లీ నన్ను ఇలాంటి కోరిక కోరవద్దు’ అన్నాడు యతిన్.
దాస్ పరిస్థితి మరీ విషమించడంతో అతడిని వెంటనే విడుదల చేయాలని జైలు కమిటీ సిఫారసు చేసింది. తెల్లదొరతనం దాన్ని తిరస్కరించింది. తనతోబాటు లాహోర్ కుట్ర కేసు నిందితులందరినీ బేషరతుగా విడిచిపెట్టాలని యతిన్‌దాస్ పట్టుబట్టినట్టు పచ్చి అబద్ధం ఆడింది. నిజానికి దాస్‌గాని, భగత్‌గాని, మరొకరు గాని జైలులో ఖైదీల హక్కుల కోసమే పోరాడారు తప్ప, కుట్ర కేసుకూ ఆందోళనకూ ఎప్పుడూ లంకె పెట్టలేదు. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావటంతో ప్రభుత్వం ఇంకో ఎత్తు వేసింది. బెయిలు మీద యతిన్‌ను విడిచిపెట్టటానికి అభ్యంతరం లేదంది. ఎక్కడి నుంచో ఒక జామీనుదారును కూడా సిద్ధం చేసింది. బెయిలు తనకు అక్కర్లేదని అతడు నిక్కచ్చిగా నిరాకరించాడు. తరవాత ఏమైందో శివవర్మ మాటల్లో వినండి:
‘నేను బతకనని ప్రభుత్వానికి తెలుసు. నా మరణానికి తమ బాధ్యత లేనట్టు తప్పించుకోవటం కోసం నన్ను జైలు నుంచి పంపెయ్యాలని చూస్తున్నారు. నేను మీ అందరి మధ్య ఇక్కడే మరణించాలని అనుకుంటున్నాను. నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకుపోకుండా మీరు చూడండి’ అని ఆస్పత్రి గదిలో సహ ఖైదీలను కోరాడు యతీంద్రనాథ్.
‘అప్పటికి మా సమ్మె మొదలై నెల మీద పక్షం రోజులు దాటింది. అందరమూ శుష్కించి ఆస్పత్రి బెడ్ల మీద మహా నీరసంగా పడి ఉన్నాము. అతికష్టం మీద ఓపిక తెచ్చుకుని మేమున్న బారక్ ప్రవేశద్వారానికి అడ్డంగా మా బెడ్లను వేసుకుని పడుకున్నాము. అది చూసి చలించిపోయిన జైలు సూపర్నెంటు ‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా. దాస్‌ను ఆస్పత్రి నుంచి బలవంతంగా తరలించనివ్వను. నమ్మండి’ అని మాట ఇచ్చాడు.
‘ఇది జరిగి వారం గడిచాక ఒక రోజు దాస్ మమ్మల్ని అందరినీ తన దగ్గరికి పిలిచాడు. అతడి తమ్ముడు కిరణ్ అధికారుల అనుమతితో అక్కడే ఉంటున్నాడు. అతడి నుంచి బిస్కెట్ పాకెట్ తీసుకుని యతిన్ మాకు తలా ఒక బిస్కెట్ ఇచ్చాడు. ‘తినండి. దీనివల్ల మన ఆకలి సమ్మె భగ్నమైనట్టు కాదు... ఇది మన చివరి విందు... నా ప్రేమకు గుర్తుగా మీకు ఇస్తున్నా’ అన్నాడు బావిలోంచి వస్తున్నంతటి బలహీన స్వరంతో. అతడి ముచ్చట మేము తీర్చాక, తమ్ముడిని పిలిచి తనకు ఇష్టమైన నజ్రుల్ ఇస్లాం గీతం ‘బోలో వీర్, చిర్ ఉన్నత్ మన్‌శిర్...’ (ఓ వీరుడా, నిటారుగా నిలబడ్డ నీ శిరస్సును చూసి హిమాలయం తలవంచింది)ను పాడించుకున్నాడు. అందరినీ పేరుపేరునా పలకరించి చాలాసేపు మాట్లాడాడు. చివరిగా మమ్మల్ని ‘వందేమాతరం’ పాడమన్నాడు. అది ఆరిపోతున్న దీపపు ఆఖరి వెలుగు అని మాకు అర్థమవుతూనే ఉంది.
‘మరునాడు సెప్టెంబరు 13. ఉదయం నుంచే యతిన్ మన లోకంలో లేడు. డాక్టర్లు వచ్చి చూసి పెదవి విరిచారు. ఎలాగూ స్పృహలో లేడు కనుక ఇంజక్షను ఇచ్చి చూద్దామనుకున్నారు. కాని స్పిరిటు రాయటానికి డాక్టరు చెయ్యి పట్టుకున్న వెంటనే దాస్ కళ్లు తెరిచి ‘నో’ అని ఉరిమినట్టు అన్నాడు. డాక్టర్లు బిత్తరపోయారు. అతడిని కనిపెట్టుకుని చుట్టూతా ఉండటానికి మమ్మల్ని అనుమతించారు. మేమందరం వౌనంగా మా కడపటి నివాళిని ప్రియ సహచరుడికి అర్పించాం. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఊపిరి ఆగిపోయింది. బ్రిటిషు డాక్టరు టోపీ తీసి శాల్యూట్ చేశాడు.
[Samsritian, Shiv Verma, pp.142-145]
థేశం నివ్వెరపోయింది. ప్రజలు తమ ఆత్మబంధువును పోగొట్టుకున్నట్టు దుఃఖించారు. 63 రోజులపాటు నిరాఘాటంగా సాగిన యతీంద్రనాథ్ దాస్ కఠోర నిరశన వ్రతాన్ని యావన్మందీ ఊపిరి బిగబట్టి గమనిస్తూ వచ్చారు. అంతా అయిపోయింది. గొప్ప వీరుడిని కోల్పోయినందుకు విచారం, అతడిని బలిగొన్న తెల్ల రాకాసిదొరతనం పట్ల ఆగ్రహం, బ్రిటిషు మహా సామ్రాజ్యంతో రాజీపడకుండా కడదాకా పోరాడి, జాతి పౌరుషాన్ని నిలబెట్టిన యతిన్‌ను తలచుకుంటే గుండె నిండా గర్వం జాతి జనులను ముప్పిరిగొన్నాయి.
1929 సెప్టెంబర్ 13 మధ్యాహ్నం 1.10కి యతీంద్రనాథ్ అమరుడైన వార్త తెలియగానే అతడి పార్థివ కాయాన్ని లాహోర్ నుంచి కలకత్తాకు చేరవేయడానికి రవాణా ఖర్చు కింద 600 రూపాయలను సుభాష్‌చంద్రబోస్ పంపించాడు. సాయంత్రం 4 గంటలకు లాహోర్ బోర్‌స్టల్ జైలు నుంచి అంతిమ యాత్ర బయలుదేరింది. పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. దుకాణాలు కట్టేసి, విద్యాసంస్థలు మూసేసి
వేల మంది వెంట ఉండి రైలుస్టేషను దాకా వెళ్లి సాగనంపారు. దారిపొడవునా ట్రెయిను ఆగినచోటల్లా వందల సంఖ్యలో ప్రజలు ప్లాట్‌ఫాం మీద మూగి జాతీయ వీరుడికి ఉద్వేగంతో జోహారులర్పించారు.
హౌరా స్టేషనుకు శవపేటిక చేరేసరికి లక్షల జనం అశ్రు నయనాలతో వేచి ఉన్నారు. అంతిమ యాత్ర సాగిన రోడ్లకు ఇరువైపులా, జనం కిక్కిరిసి ఉన్నారు. హుగ్లీ తీరాన శ్మశాన వాటిక చేరడానికి చాలా గంటలు పట్టాయి. దారిపొడవునా లక్షలాది అభిమానులు శవపేటిక మీద పూలవాన కురిపించారు. ‘నా కొడుకు యతిన్‌దాస్‌లా కావాలి’ అని బెంగాలీలో రాసిన నినాదాలు అట్టల మీద, గోడల మీద కలకత్తాలో ఎక్కడ చూసినా కనిపించాయి. ఎందరో మహా నాయకుల ఘన నివాళి నడుమ దాస్ అంత్యక్రియలు చిరస్మరణీయంగా జరిగాయి.
అంతకు ముందు వరకు యతీంద్రనాథ్ దాస్ పేరు విప్లవ వర్గాలకు వెలుపల ఎక్కువమందికి తెలియదు. అతడి ధీరోదాత్త ఆత్మబలిదానం ప్రజలను ఎంతలా కదిలించిందీ - లండన్‌లోని భారత విదేశాంగ మంత్రికి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ పంపిన ఈ టెలిగ్రామ్ చెబుతుంది:
The procession in Calcutta is stated to have been of a record size and to have consisted of five lakhs of people... The crowd was undoubtedly enormous... Meetings of sympathy with Das and of condemnation of the Government have been held in many places...
[Quoted in Without Fear, Kuldip Nayar, P.96]
(కోల్‌కతా ఊఠేగింపులో రికార్డు స్థాయిలో ఐథు లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని చెబుతున్నారు... ప్రజా సమూహం చాలా భారీ స్థాయిలో ఉందన్నది నిస్సందేహం.. దాస్‌కు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వాన్ని తెగనాడుతూ చాలాచోట్ల సభలు జరిగాయి.)
దాస్ ముక్కూ మొగం ఎరుగని ప్రజలే అతడి ఆత్మత్యాగానికి అంతలా పరితపించారంటే యతిన్‌దాస్‌ను సన్నిహితంగా ఎరిగి, అతడిని ప్రేమించిన భగత్‌సింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు. అసలే అతడి మనసు మహా సున్నితం. యతిన్ మరణవార్త వినగానే వలవల విలపించాడు. అతడు మళ్లీ మామూలు స్థితికి రావటానికి చాలా రోజులు పట్టింది.
జోహార్ యతిన్
ReplyDelete