ఆకలి పోరాటం
జైళ్లు, సంకెళ్లు విప్లవకారులను కట్టివేయలేవు. నాలుగు గోడల నడుమ బలవంతంగా బంధిస్తే ఆ బంధనాలలోనే వారు పోరాటానికి దారి వెతుక్కుంటారు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకూ విప్లవకారుడు ఆయుధంతో పోరాడుతాడు. అది లేనప్పుడు ఆకలినే ఆయుధంగా మలచుకుంటాడు.
పార్లమెంటు బాంబు కేసు విచారణను ఎంత వేగిరం ముగించి, సాండర్స్ కేసు తాడుతో భగత్‌సింగ్ మెడకు ఎంత త్వరగా ఉరి వేద్దామా అని బ్రిటిషు సర్కారు తొందరపడినట్టే, ఆ సర్కారును బోనులో నిలబెట్టటానికి భగత్‌సింగ్ కూడా తన వ్యూహం తాను పన్నాడు. అతడిని బంధించిన బందిఖానాయే తదుపరి కర్తవ్యాన్ని స్ఫురింపజేసింది.
పోరాటం ఎక్కడ ఏ అంశం మీద మొదలుపెట్టాలా అని బుర్ర బద్దలు కొట్టుకోవలసిన అవసరం భగత్‌సింగ్‌కి లేదు. అతడికి జైలు జీవితం కొత్తకాదు. కొట్టిన పిండే. 1927లో కాకోరీ నిందితులతో కుమ్మక్కు, దసరా బాంబు వంటి అభియోగాలతో తనను నిర్బంధించినప్పుడే బ్రిటిషు జైళ్లలోని దుర్భర స్థితిగతులు భగత్‌కి అవగతమయ్యాయి. భారతీయ ఖైదీలను పశువుల కంటే హీనంగా చూసే తెల్లవాళ్ల దాష్టీకానికి వ్యతిరేకంగా తోటి ఖైదీలను కూడగట్టి పోరాడాలని అప్పుడే అతడు తలచాడు. ఆ ప్రయత్నం ఒక కొలిక్కి రాకముందే తండ్రి అతి కష్టం మీద అతడిని జైలు నుంచి విడిపించాడు.
రెండేళ్ల తరవాత పార్లమెంటు బాంబు కేసులో మళ్లీ బంధింపబడ్డాక భగత్‌సింగ్‌కి అర్థమైంది ఏమిటంటే జైళ్ల పరిస్థితులు ఎంత మాత్రం మారలేదు. అవి ఇంకా నరకానికి నకళ్లే. తండ్రి పట్టుదల మీద అసపాలీని తమ తరఫున న్యాయవాదిగా పెట్టుకున్నా, డిఫెన్సును ఎలా నడిపించాలి, ఏ విషయం ఎలా వాదించాలి అన్నది ప్రధానంగా భగత్‌సింగే చూసుకున్నాడు. సర్వశక్తులూ వాటి మీదే నిలపడం వల్ల ఇతర అంశాలను ఆలోచించడానికి తీరిక దొరకలేదు. పైగా ఢిల్లీ కారాగారంలో పరిస్థితులు ఎంతో కొంత నయం.
హైకోర్టులో అపీలు వీగిపోయి యావజ్జీవ శిక్ష ఖరారు అయ్యాక ఇక తన పోరాట క్షేత్రాన్ని కోర్టు నుంచి జైలుకు మార్చుకోవాలని భగత్‌సింగ్ నిశ్చయించాడు. రైల్లో దత్‌ని కలిసి తదుపరి ప్రణాళిక వివరించి, తన ఏర్పాట్లలో తాను పడ్డాడు. మియావలి జైలుకు చేరీ చేరగానే అక్కడ ఖైదీలకు ఇస్తున్న సదుపాయాలేమిటి... యూరోపియన్, ఇండియన్ ఖైదీల నడుమ సౌకర్యాల్లో తేడాలేమిటి అన్నవి ఆరా తీశాడు. తెల్ల తోలువాళ్లని ఇంటల్లుళ్లలా, భారతీయ ఖైదీలని కట్టు బానిసల్లా చూస్తున్నారని అర్థమైంది. ఇచ్చే ఆహారంలో, దాని నాణ్యతలో, అనుమతించే సౌకర్యాల్లో అడుగడుగునా వివక్షే. దొంగతనం, మోసం, మానభంగం, దొమీ లాంటి నికృష్ట నేరాలు చేసిన యూరోపియన్ దుండగులకు మంచి గాలి, వెలుతురు ఉండే గదిని, ఎలక్ట్రికల్ ఫిట్టింగులను, పాలు, వెన్న, టోస్టు, మాంసాలతో ఫస్ట్‌క్లాస్ ఆహారాన్ని, నాణ్యమైన దుస్తులను ఇస్తున్నారు. ఆ మర్యాదలో శతాంశమైనా రాజకీయ ఖైదీలకు ఇవ్వడం లేదు. వారికి కనీసపు అవసరాలకే దిక్కు లేదు. బోనులోని జంతువులకు విసిరేసినట్టే ఆ ఖైదీల మొగాన రొట్టెలను విసిరేయటం పరిపాటి.
స్థితిగతులను ఆకళింపు చేసుకున్నాక భగత్‌సింగ్ తోటి ఖైదీలను వీలైన మేరకు కూడగట్టాడు. న్యాయంగా వారికి రావలసినవి ఏమిటో, అధికారులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు ఏమిటో వారికి బోధపరిచాడు. బయట విజృంభించి, వీరుల్లా పోరాడిన దేశభక్తులు జైలుపాలయ్యాక నిస్పృహ చెంది, పరిస్థితులతో రాజీపడటం సరికాదని పురికొల్పాడు. పోరాడితే గానీ ఏదీ సాధించలేమనీ, అందరూ కలిసి ఆకలి సమ్మెకి దిగితే తెల్లదొరతనం మెడలు వంచవచ్చనీ ఉద్బోధించాడు. ఈ దిశగా అన్నిటికీ తెగించి మొదటి అడుగు తాను వేస్తున్నాననీ, తనకు జరిగేదేమిటో చూశాకే మిగతా వాళ్లూ ఏమి చేయాలన్నదీ నిర్ణయించుకోవచ్చుననీ చెప్పాడు. ఆ వెంటనే నిరాహారదీక్షను మొదలెట్టాడు. దానికి కారణాలేమిటో, తాను కోరేదేమిటో వివరిస్తూ పంజాబ్ జైళ్ల ఇన్స్‌పెక్టర్ జనరల్‌కి ఇలా ఉత్తరం రాశాడు.
అసెంబ్లీ బాంబు కేసులో నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అనగా నేను రాజకీయ ఖైదీని. ఢిల్లీ జైలులో మాకు ప్రత్యేక ఆహారం ఇచ్చేవారు. కాని ఇక్కడికి వచ్చాక నన్ను మామూలు క్రిమినల్‌లా చూస్తున్నారు. దీనికి నిరసనగా నేను 1929 జూన్ 15 ఉదయం నుంచి ఆకలి సమ్మె (హంగర్ స్ట్రైక్) మొదలెట్టాను. ఈ రెండు మూడు రోజుల్లోనే
నా బరువు ఆరు పౌండ్లు తగ్గింది.
రాజకీయ ఖైదీగా నన్ను ప్రత్యేకంగా చూడవలసి ఉన్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. నా డిమాండ్లు ఇవి:
1.పాలు, నెయ్యి, అన్నం, పెరుగు వగైరాలతో ప్రత్యేక ఆహారం.
2.బలవంతపు కాయకష్టం చేయించరాదు.
3.సబ్బు, నూనె, షేవింగ్ కిట్ వగైరా టాయిలెట్ సామగ్రి
4.అన్ని రకాల సాహిత్యం (చరిత్ర, ఆర్థిక వ్యవహారాలు, పొలిటికల్ సైన్సు, కవిత్వం, నాటకం, కాల్పనిక సాహిత్యం), వార్తాపత్రికలు వగైరా.
మీరు దయతో నా అభ్యర్థన పరిశీలించి తగు చర్య తీసుకోగలరని ఆశిస్తున్నాను. ఇంకో విషయం. సాండర్స్ హత్య కేసులో నన్ను ప్రాసిక్యూట్ చేయబోతున్నప్పటికీ, నన్ను ఢిల్లీ నుంచి మియావలి జైలుకు మార్చారు. ఆ కేసు విచారణ ఈ నెల 26 నుంచి లాహోర్‌లో మొదలవనున్నది. ప్రతి విచారణ ఖైదీకి తన వాదాన్ని వినిపించుకోవడానికి, కేసును కంటెస్టు చేయడానికి న్యాయ ప్రకారం అన్ని సదుపాయాలు కల్పించవలసి ఉంది. నేను ఇక్కడ ఉంటే లాయరును ఎలా నియమించుకోగలను? నా తండ్రితో, ఇతర బంధువులతో కేసు గురించి ఎలా మాట్లాడగలను? ఈ స్థలం లాహోర్‌కు చాలా దూరం. విసిరేసినట్టు ఎక్కడో ఉంది. ఇక్కడికి ప్రయాణ సదుపాయాలూ తక్కువ.
ఇలా చెప్పుకొచ్చి తనకు కోరిన సౌకర్యాలు సమకూర్చి, తక్షణం లాహోర్ జైలుకు మార్చాలని భగత్‌సింగ్ కోరాడు. ఇందులోని లాజిక్‌ను బ్రిటిషు సర్కారు కాదనలేకపోయింది. ఆహారం, సదుపాయాలు, పుస్తకాలు, పత్రికలకు సంబంధించిన డిమాండ్లనైతే పెడచెవిన పెట్టింది. చివరి కోర్కెను మాత్రం మన్నించి భగత్‌సింగ్‌ని మియావలి నుంచి లాహోర్ సెంట్రల్ జైలుకు మార్చింది.
అదీ భగత్‌సింగ్ మీద ప్రేమతో కాదు. దాని వెనుకా ఒక కుత్సితం ఉన్నది.
సెంట్రల్ జైలుకు పంపించే ముందు అధికారులు భగత్‌సింగ్‌ని ఏదో మిష మీద లాహోర్ కంటోనె్మంటు పోలీసుస్టేషనుకు తీసుకెళ్లారు. కుట్ర కేసులో సాక్ష్యం చెప్పటానికి అప్పటికే 600 మంది సాక్షులను పోలీసులు కూడగట్టారు. వారిలో ఎవరూ భగత్‌సింగ్ మొగమైనా ఎరుగరు. ఐడెంటిఫికేషన్ పెరేడ్‌లో అతడిని వారు గుర్తుపట్టాలి కదా? అందుకు వీలుగా దొంగ సాక్షులను ముందే పోలీసుస్టేషనుకు రప్పించారు. భగత్‌సింగ్‌ని దగ్గరగా చూసి మొగం గుర్తు పెట్టుకునే అవకాశాన్ని వారికి ఎంచక్కా కల్పించారు.
లాహోర్ సెంట్రల్ జైలులో భగత్‌సింగ్ వెళ్లేసరికే ఎందరో గొప్ప విప్లవకారులు ఉన్నారు. 1915లో చారిత్రాత్మక గదర్ తిరుగుబాటులో యావజ్జీవ ఖైదు పడిన వారిలో చాలామందిని అండమాన్‌కు తరలించారు. అక్కడి సెల్యూలార్ జైల్లో అమానుషమైన ఆరళ్లకు, అవమానాలకు నిరసనగా వారు దీర్ఘకాలం నిరాహారదీక్ష చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉండటంవల్ల, లోపల ఏమి జరిగేదీ బయటకి తెలియనివ్వని దుర్భేద్యమైన సెక్యూరిటీ కట్టుదిట్టాల వల్ల ఆ చారిత్రక పోరాటం వివరాలు లోకానికి వెల్లడి కాలేదు. చిత్రహింసలను తట్టుకుని విప్లవకారులు సాగించిన మహా పోరాటానికి తాళలేక బ్రిటిషు దొరతనం రాజకీయ ఖైదీలను అక్కడి నుంచి వేర్వేరు జైళ్లకు మార్చింది. ఆ విధంగా 1921-22 ప్రాంతాల్లో పలువురు లాహోర్ సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. వాళ్ల గురించి భగత్‌సింగ్‌కి తెలుసు. వాళ్లూ అతడి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆకలి సమ్మెల్లో అప్పటికే ఆరితేరిన ఆ విప్లవకారులు భగత్‌సింగ్ ప్రారంభించిన నిరశన దీక్షలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ప్రసిద్ధ విప్లవకారుడు ఉద్దంసింగ్ కూడా ఆ జైలులోనే భగత్‌ని కలిశాడు. జలియన్ వాలాబాగ్ ఘోర దురంతం జరిగినప్పుడు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్న మైకేల్ ఓడ్వయర్‌ని తాను ఏనాటికైనా చంపి తీరతానని అతడు భగత్‌కి చెప్పాడు. (చివరికి అంత పనీ చేశాడు. భగత్‌ని ఉరి తీశాక తొమ్మిదేళ్ల తరవాత లండన్‌లో ఓడ్వయర్‌ని పబ్లిగ్గా కాల్చి చంపాడు. శపథం నెరవేరిందన్న తృప్తితో ఆనందంగా ఉరికంబమెక్కాడు.)
భగత్ కంటే ముందే లాహోర్ సెంట్రల్ జైలు చేరిన బటుకేశ్వర్‌దత్ అనుకున్న ప్రకారం జూన్ 14నే నిరాహారదీక్ష ఆరంభించాడు. లాహోర్ కుట్ర కేసులో నిందితులైన సుఖదేవ్, రాజ్‌గురు, యతీంద్రనాథ్ దాస్, అజయ్ ఘోష్, శివవర్మ, గయాప్రసాద్, జైదేవ్, విజయకుమార్ సిన్హాలు లాహోర్‌లో రెండో చెరసాల అయిన బోర్‌స్టల్ జైలులో ఉన్నారు. నెల తరవాత భగత్, దత్‌ల ఆకలి సమ్మెలో వారు కూడా కలిశారు. 1929 జూలై నాటికి పంజాబ్‌లోని ఇతర జైళ్ల ఖైదీలు కూడా అన్నం మాని సమ్మె కట్టారు.
పూర్వం అక్కడక్కడ చెదురుమదురుగా నిరశన దీక్షలు జరిగితే పెద్దగా పట్టించుకోని బ్రిటిషు సర్కారు ఉన్నట్టుండి ఆకలి సమ్మె అనేక కారాగృహాలకు విస్తరించటంతో ఉలిక్కిపడింది. సమ్మెను వమ్ము చేయటానికి సర్వశక్తులూ ఒడ్డింది. అడ్డమైన తప్పుడు పనులకూ నిస్సంకోచంగా పాల్పడింది.
ఒకరోజు ఉపవాసానికే ఎవరికైనా శక్తి సన్నగిల్లుతుంది. రోజులు గడిచేకొద్దీ నిస్త్రాణ తీవ్రమవుతుంది. రోజులు కాస్తా వారాలలోకి తిరిగేసరికి కాలూ చెరుూ్య కదిలించలేనంత నిస్సత్తువ. ఆ స్థితిలోనే 1929 జూలై 10న లాహోర్ స్పెషల్ మేజిస్ట్రేటు శ్రీ కిషన్ కోర్టులో మొదలైన లాహోర్ కుట్ర కేసు విచారణకు భగత్‌సింగ్ హాజరయ్యాడు.
‘అప్పటికి 25 రోజులుగా భగత్ అన్నం ముట్టలేదు. కోర్టుకు అతడిని స్ట్రెచర్ మీద తీసుకువచ్చారు. ఆ స్థితిలో అతడిని చూడగానే మా అందరికీ కళ్లనీళ్లు వచ్చాయి. మాకు తెలిసిన భగత్‌సింగ్ దృఢంగా, బలిష్ఠంగా నవనవలాడుతూండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే అతడి చలాకీతనం మాకు ఎంతో ఇష్టం. అలాంటి వాడిని అంత బలహీన స్థితిలో చూస్తే మాకు దుఃఖం వచ్చింది. ఆకలి బాధ, దానికితోడు జైల్లో చిత్రహింసలు అతడిని అస్థిపంజరంలా మార్చాయి. ఆ స్థితిలో కూడా అతడు మాతో కేసు డిఫెన్సు ఎలా ఉండాలన్నది చర్చించాడు’ అని తరవాత గుర్తు చేసుకున్నాడు శివవర్మ.
నిరాహారదీక్ష ఎలాగైనా చెడగొట్టాలన్న కసితో జైల్లో భగత్‌నీ, అతడి సహచరులనీ తెల్లదొరతనం పెట్టిన తిప్పలు అన్నీఇన్నీ కావు. ఆకలితో అలమటిస్తున్న ఖైదీల ఎదురుగుండా నోరూరించే పండ్లు, స్వీట్లు, తినుబండారాలు పెట్టేవాళ్లు. క్షుద్బాధ తీర్చుకోవటానికి వాటిని తినకపోతారా అని ఎదురుచూసేవాళ్లు. ఖైదీలు వాటిని బయట పారవేసేవాళ్లు. దప్పికతో పిడచ కట్టుకుపోయిన గొంతు తడుపుకోవటానికి కాసిని నీళ్లు తాగుదామని ఖైదీలు అనుకుంటే కాపలా వాళ్లు గదిలోని కుండల్లో నీటికి బదులు పాలు నింపేవాళ్లు. దాహం కోసం పాలు తాగారా నిరశన వ్రతం చెడినట్టే. ఆ దుర్మార్గానికి ఆందోళనకారుల ఒళ్లు మండేది. కొందరికైతే దాదాపుగా పిచ్చెత్తేది. ఆకలిదప్పులతో చావనైనా చస్తాము గానీ మీ పాలను మాత్రం ముట్టమురా అని అరుస్తూ ఖైదీలు పాలకుండలను
పగులగొట్టేవాళ్లు.
ప్రలోభాల ఎత్తు పారకపోయేసరికి వైద్య చికిత్స నెపంతో భగత్ బృందానికి బలవంతంగా ద్రవాహారం ఎక్కించడానికి అధికారులు పూనుకున్నారు. ఐదారుగురు దృఢకాయులు ఖైదీని ఎటూ కదలలేకుండా అదిమి పట్టుకుంటే డాక్టర్లు నోటి నుంచి ట్యూబు ద్వారా కడుపులోకి ద్రవాహారం పంపేవాళ్లు. ఖైదీలు పళ్లు బిగబట్టి, రబ్బరు గొట్టాన్ని గట్టిగా కరచి పట్టుకుని ఆహారం లోపలికి పోకుండా అడ్డుకునేవాళ్లు. నోటిద్వారా వీలుకానప్పుడు ముక్కులో నుంచి ట్యూబు వేసి అతికష్టం మీద ఆహారం ఎక్కించేవాళ్లు. ముక్కురంధ్రాలు కాస్త పెద్దవైన భగత్‌సింగ్ లాంటి వాళ్లు ఎంత పెనుగులాడి, తీవ్రంగా ప్రతిఘటించినా బలవంతపు ద్రవాహారాన్ని అడ్డుకోలేక పోయేవాళ్లు. భయంకరమైన బాధపడ్డా సరే ఆహారాన్ని మాత్రం లోనికి పోనివ్వరాదన్న పట్టుదలతో కొంతమంది మరిగే నీటిని గొంతులో పోసుకుని, మిరపకాయలు నమిలి మింగి, గొంతు పూడుకుపోయేట్టు చేసుకునేవారు.
ఇనుప గోడలు దాటిపోకుండా నిజాన్ని తొక్కిపెట్టాలని సర్కారు ఎంత తంటాలు పడ్డా జైళ్లలో జరుగుతున్నదేమిటో నెమ్మదిగా ప్రపంచానికి తెలిసింది. ఖైదీల ఆకలి పోరాటానికి మద్దతుగా, వారి దీక్ష చెడగొట్టటానికి సర్కారు చేయిస్తున్న పాపిష్టి పనులకు నిరసనగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఊరేగింపులు, బహిరంగ సభలు జరిగాయి. నౌజవాన్ భారత్ సభ ఆధ్వర్యంలో జూన్ 30న ‘్భగత్‌సింగ్ డే’ జరిగింది. ఆనాడు డాక్టర్ కిచ్లూ అధ్యక్షతన అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో భగత్ బృందం ఆకలి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ పెద్ద సభ జరిగింది. వీటికి సంబంధించిన వార్తలు, ఖైదీల ఆకలి సమ్మె వివరాలు పత్రికలు విస్తృతంగా ప్రచురించేవి.
క్రమేణా యావద్భారతం భగత్‌సింగ్, అతడి సహచరుల ఆకలి పోరాటం మీద దృష్టి నిలిపింది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ.
ఆకలి పోరాటం
ReplyDelete