Breaking News

నేతాజీ మిస్సింగ్ మిస్టరీ..! (Neatji Missing Mystery)


దేశంలో కీర్తిశేషులైన రాజకీయ ప్రముఖులందరికీ జయంతులు, వర్థంతులు ఉన్నాయి. కానీ స్వాతంత్ర్య సమరంలో పోరాడి భారతీయుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు మాత్రం ఇప్పటి వరకు వర్థంతి జరుపలేదు. ఆయన మరణం గురించి ప్రభుత్వానికి తెలియదా? తెలిసినా కావాలనే దాచిపెడుతోందా? సుభాష్ చంద్రబోస్ 1945 లోనే మరణించారని ప్రభుత్వం ఒకవైపు వాదిస్తూనే, ఆ మరణంపై ఉన్న మిస్టరీని మాత్రం ఎందుకు మిస్టరీగా మార్చాల్సి వచ్చింది. బోస్ మిస్సయ్యాడా? మరణించాడా? బోస్ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించాడన్న వార్తను జాతి పిత గాంధీజీ కూడా కొట్టి పారేశాడంటారు. అసలు బోస్ మరణం గురించి గాంధీజీకి ఎంతవరకు తెలుసు?

బోస్ తైవాన్ విమానప్రమాదంలోనే మరణించాడు. ఇందులో దాయడానికి ఏముంది. బోస్ మరణం, ఆయన అదృశ్యాన్ని ఓ మిస్టరీగా మార్చడం ఓ రాజకీయ తంతు తప్ప మరొకటి కాదని ఏనాడో తేల్చేసిన వారూ లేకపోలేదు. ఆ పోరాట యోధుడి మరణాన్ని ధృవీకరించిన రాష్ట్ర ప్రభుత్వాలూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బోస్ ప్రస్తావన, ఆయనకు సంబంధించిన రహస్యాలపై మరోసారి వివాదం ఓ అప్రస్తుతమే అని కొట్టిపారేసే వాదనలూ బలంగానే వినపడుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గురించిన రహస్య ఫైళ్ళను బయటపెట్టే ప్రసక్తే లేదంటూ కొత్త వివాదానికి తెరలేపుతోంది. ఇది దేశం కోసం సుభాష్ రగిలించిన స్ఫూర్తికి, చైతన్యానికి మచ్చతేవడమే.


భారత స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ సేనను బ్రిటిష్ వారిపైకి నడిపించిన ఘనత సుభాష్ చంద్రబోస్ ది. అయితే స్వాతంత్ర్యం వచ్చాక ఆయన ఏమయ్యాడు? మీరు నాకు మీ రక్తం ఇవ్వండి...నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను అన్న నినాదంతో భారత యువకులలో స్వాతంత్ర్య ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన బోసు. అదృశ్యం ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణాలేమిటి? దీనికి ప్రభుత్వం చెబుతన్న దేమిటంటే...ఆయనకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేస్తే అంతర్జాతీయంగా వున్న సంబంధాలు దెబ్బతినే అవకాశం వుందని, అందువల్ల ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతోంది.


స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్ వారు మన రాజకీయ నేతలతో మాట్లాడుతూ బోస్ ను మాకు అప్పగించండి. మీకు స్వాతంత్యాన్ని ఇస్తాము. అని అన్నారంటే బోస్ బ్రిటిష్ వారిని ఎంతలా గడగడలాడించాడో అర్థమౌతుంది. మన భారత ప్రభుత్వం వద్ద బోస్ కు సంబంధించి 33 రహస్య ఫైల్స్ వున్నట్లు సమాచారం. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఆయన వివరాలను మిస్టరీగా మార్చిందా? బ్రిటిష్ గుండెకు గురిపెట్టిన భారత్ బాణం సుభాష్ చంద్రబోస్. కత్తికి కత్తి, తూటాకు తూటా అని నమ్మిన బోసంటే గాంధీజీకి వల్లమాలిన అభిమానం. ఒక సందర్భంలో కాందిశీకుల గొడవలతో అతలాకుతలమవుతున్న భారత్ పరిస్థితికి గాంధీజీ ఇలా వాపోయారట. ఇప్పుడు నా రెండవ కొడుకు వుంటే ఎంత బావుండేదో అని. దానికి ఆయన సహచరుడు బోస్ విమాన ప్రమాదంలో మరణించారు కదా.. అని చెప్పగానే గాంధీజీ అతన్ని.. ''నీకెవరు చెప్పారు? అతను రష్యాలో వున్నాడని గాంధీ అతనితో చెప్పారట. అంటే బోస్ ఆచూకీ గురించి గాంధీజీకి తెలుసని ఆ సందర్భం చెబుతోంది. అయితే ఒకవేళ బోస్ విమాన ప్రమాదంలో మరణిస్తే నెహ్రూ అంత్యక్రియలకు ఆయన ఎలా హాజరు కాగలుగుతాడని, నెహ్రూ అంత్యక్రియలలో పాల్గొన్న బోస్ ఫొటోలను కూడా భారత మీడియా విడుదల చేసింది. అంతేకాక అయోధ్యలో సర్వసంగ పరిత్యాగిలా 'గుమాంబాబా' పేరుతో బోస్ వున్నట్లు కథనాలు కూడా వచ్చాయి.


లక్ష్మీ సెహగల్ కూడా నేతాజీ అదృశ్యం ప్రకటనలను ఖండించిన దాఖలాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సిపిఎం నేత కీ. శే. జ్యోతి బసు కూడా ఈ విషయాన్ని ఖండించారు. అయితే ఇవన్నీ అభూతకల్పన అని, కొత్తగా రాజకీయం చేయడానికికే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. విచారణ చేయిస్తున్న ప్రభుత్వాలు ఆ నివేదికలను రహస్యంగా మూటలు కట్టడం మినహా, మంచో, చెడో ఏదో ఒకటి ఆయన గురించి చెపుతున్న పాపాన పోలేదు. ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఆయన వివరాలను వెల్లడికి నిరాకరించడం పాలకుల అసమర్థతా? కావాలని ఆడే డ్రామానా? అని అనిపించక మానదు.


*ఈ వీడియో ను చుడండి*


నేతాజీ గురించి మరిన్ని టపాలు

4 comments: