Breaking News

వట్టికోట ఆళ్వారుస్వామి


తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు వట్టికోట ఆళ్వారుస్వామి. రచయిత. సేవాశీలి. ఉద్యమకర్త. కమ్యూనిస్టు నేత. ప్రచురణకర్త. పాత్రికేయుడు. ప్రచారకుడు ఆయన. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాలల్ల పాలుపంచుకున్నడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.

విశేషాలు
ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు.దాశరధి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు.

ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు:

“ఇస్లాం అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది”

హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై , ప్రచురణ కర్త అయ్యాడు.

బాల్యం
1915 నవంబర్ 1 తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం లో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించాడు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు.

నిజాంకు వ్యతిరేకంగా
గ్రంధాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పని చేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యాడు. వంటపనిలో, ప్రూఫ్ రీడింగ్‌లో, హోటల్ సర్వర్‌గా పని చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. నిజాంను గడగడలాడించిన 'ఆంధ్రమహాసభ' నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు.

రచనలు
వట్టికోట జైలు జీవితం జైలు లోపల పేరుతో కథల సంపుటిగా వెలువడింది.

తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952ల ప్రజలమనిషి నవల రచించిండు.

1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు నవల రచించిండు.

తెలంగాణ చైతన్యం కోసం 'దేశోద్ధారక గ్రంథమాల' స్థాపించి 35 పుస్తకాలు ప్రచురించాడు. తెలంగాణ విశేషాలను కూర్చి, 'తెలంగాణ' పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి.

1961 ఫిబ్రవరి 5 న మరణించారు.

1 comment:

  1. ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి.

    ReplyDelete