నేడు జాతీయ విద్యా దినోత్సవం
భారత దేశాన్ని బ్రిటిషు వారి దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ క్రమంలో జాతిపిత మహాత్మాగాంధీకి ముఖ్య అనుచరుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని కీలక పాత్ర పోషించారు. అయితే ఇక్కడ విశేషం ఏమంటే ఆజాద్ జన్మత: భారతీయుడు కానప్పటికీ మహాత్మాగాంధీ స్ఫూర్తితో భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న కాంక్ష ఈయనలో బలీయంగా నాటుకోవడం ప్రపంచ నాయకులను సయితం అబ్బురపరచింది. ఆజాద్ 1888 నవంబర్ 11 వ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించారు. ఆజాద్ అసలు పేరు మొహిద్దీన్ అహ్మద్. ఆజాద్ అనునది కలం పేరు. మౌలానా చిన్నతనం నుండే కవిత్వం రాసేవారు. ఆ విధంగా ఆయన పేరులో ఆజాద్ చేరింది. మౌలానా తండ్రి పేరు మహమ్మద్ ఖైరుద్దీన్. కాగా వీరి పూర్వీకులు భారతీయులు. మౌలానా పూర్వీకుల్లో కొంత మంది అరబ్బీ, పారశీక భాషల్లో గొప్ప పండితులు కావడం వల్ల మొగల్ చక్రవర్తి అక్బర్ తన పరిపాలనా కాలంలో వీరిని ఘనంగా సత్కరించారు. మౌలానా తండ్రి 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు అనంతరం అరేబియా దేశానికి వలస వెళ్లడం జరిగింది. మౌలానా 10 సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి భారత దేశానికి తిరిగి వచ్చాడు. మౌలానా కోల్‌కటా (కలకత్తా)లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కాగా 1905 లో ఈజిప్టు రాజధాని కైరోలోని అజహస్ విశ్వ విద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేసుకొని 1908 లో భారత దేశానికి తిరిగి వచ్చారు. మౌలానా మాతృభాష అరబ్బీ అయినప్పటికీ అరబ్బీతో పాటు పారశీక భాషలో కూడా సాటి లేని మేటి పాండిత్యాన్ని సంపాదించి మత, ధర్మ శాస్త్రాల్లో మంచి పట్టు సాధించారు. ఇతని పాండిత్యం వల్ల మౌలానా అనే బిరుదును పొందారు. మౌలానా అనగా పండితుడు అని, అబుల్ కలాం అనగా భాషా జనకుడు అని అర్థం. ఈ విధంగా మొహిద్దీన్ అహ్మద్ కాస్తా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌గా మారారు. మౌలానా తన పదహారవ ఏట లిసానస్ సిదిక్ ( సత్యవాణి ) అనే పత్రికను స్థాపించారు. ఆ పత్రికలో ధార్మిక, సారస్వత విషయాలకు సంబంధించిన సంపాదకీయాలు రాసేవారు. వాటిని చదివిన పాఠకులు ఆ పత్రిక సంపాదకుడు వయో వృద్ధుడైన గొప్ప విద్వాంసుడేమోనని భావించారు. ఈ నేపథ్యంలో ఒక సాహిత్య సభకు మౌలానాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సభా నిర్వాహకుల్లో కొంతమంది ముఖ్య అతిథి రాక కోసం ప్రవేశద్వారం వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. ఒక యువకుడు నిరాటంకంగా వేదిక వద్దకు చేరుకొనగా నిర్వాహకులు అతనిని ఆపి అతడే ఆజాద్ అని తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ రోజుల్లో ఖాజీ అల్తాఫ్ హుస్సేన్ అలీ గొప్ప విద్వాంసుడుగా పేరు గాంచాడు. అయితే ఆయన రచనలను ఆజాద్ తన పత్రికలో నిశితంగా విమర్శించారు. దీంతో అతడు ఆజాద్‌ను కలిసి మాట్లాడి ఆయన పాండిత్యానికి అలీ మంత్రముగ్ధుడయ్యాడు. కాగా 1912 లో ఆజాద్ అల్ హిలాల్ ( చంద్రరేఖ ) అనే ఉర్దూ వార పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ఉర్దూ సాహిత్యంలో ఒక నూతన శకానికి నాంది పలికింది. హిందూ ముస్లింల సమైక్యతను ప్రోత్సహిస్తూ మౌలానా తన పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. అందులో బ్రిటిషు వారి అక్రమాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడం జరిగింది. దీంతో బ్రిటిషు ప్రభుత్వం అల్ హిలాల్ పత్రికను నిషేధించడమే కాకుండా మౌలానాను నాటి బీహార్ లోని రాంచీలో నిర్బంధించింది. బ్రిటిషు వారి బెదిరింపులకు ఏమాత్రం భయపడని మౌలానా అల్ బలాగ్ ( సందేశం ) అనే మరొక పత్రికను స్థాపించి తన రచనా పరంపరను కొనసాగించారు. బ్రిటిషు ప్రభుత్వం ఆ పత్రికపై కూడా నిషేధాన్ని విధించి పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించింది. మౌలానా అరెస్టై బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా 1920లో మౌలానా మహాత్మాగాంధీని మొదటిసారిగా ఢిల్లీలో కలుసుకున్నారు. గాంధీ మార్గంలో నడచి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ ప్రచారానికై దేశ సంచారం చేసి నాయకుల్లోని భేదాభిప్రాయాలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో గాంధీజీకి ముఖ్య అనుచరుడుగా మారారు. కాగా 1923 లో మౌలానాఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జమియత్ ఉల్ ఉలేమాకు 1924 లో అలాగే 1929 లో జాతీయ వాద ముస్లిం సదస్సుకు అధ్యక్షత వహించారు. 1937 లో పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడుగా కాంగ్రెస్ మంత్రిత్వ శాఖల పనితీరును నిర్దేశించారు. కాగా 1940 నుండి 1946 వరకు తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా వ్యవహరించారు. 1946 లో రాజ్యాంగ సభకు సభ్యుడుగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయోద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. ఇండియా విన్స్ ఫ్రీడం అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో భారత దేశం తప్పక స్వాతంత్ర్యాన్ని సాధించితీరుతుందని మౌలానా గట్టిగా అభిప్రాయపడ్డారు. కాగా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 1947 ఆగష్టు 15 వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. మొట్ట మొదటి భారత ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఏర్పడింది. నెహ్రూ తన మంత్రి మండలిలో ఆజాద్‌కు విద్యాశాఖామంత్రిగా స్థానం కల్పించి గౌరవించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖతో పాటు సహజ వనరులు, శాస్త్ర పరిశోధన శాఖలను కూడా నిర్వహించారు. మౌలానా విద్యాశాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. మంత్రి పదవిలో ఉండగానే 1958 లో మౌలానా కన్నుమూశారు. గొప్ప వక్త, విద్యావేత్త, రచయిత, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత జాతీయ జీవనంలో లౌకికవాదం, ఏకత్వ భావనలకు ప్రతీకగా నిలచారు. కాగా విద్యా రంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించి గౌరవించడం ఎంతో ముదావహం!
మూలం: ఆదివారం నవంబర్ 11, 2012- ఆంధ్రప్రభ దినపత్రిక.
జై హింద్.
వందేమాతరం..
- సాయినాథ్ రెడ్డి.
నేడు జాతీయ విద్యా దినోత్సవం.
ReplyDeleteఈ రోజు నాకు తెలిసినంత వరకు ఏ దినపత్రికా దీని గురించి ప్రస్తావించలేదు.
ReplyDeleteGood article. Everyone should know this. thanks for sharing sir.
ReplyDeleteచరిత్రను మరచిపోతున్నవారిని ఈ బ్లాగు ద్వారా తట్టి నిద్రలేపుతున్నారు. మీ ప్రయత్నానికి నా సహాయం తోడుంటుంది.
ReplyDelete- లక్ష్మీనారాయణ, ఇంకొల్లు.
Nice post
ReplyDeleteమౌలానా అబుల్ కలాం గురించి చాలా బాగా చెప్పారు.
ReplyDelete125th Birth anniversary of Abula Kalam Azad.
ReplyDelete