Breaking News

సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం (NGO for Women in Distress)


జీవితమన్నాక ఎన్నెన్నో సమస్యలు…వాటినెదుర్కొని ముందుకు సాగాలనే అందరి ప్రయత్నమూ. కానీ ఒక్కోసారి ధైర్యం సన్నగిల్లుతుంది. మనసంతా చీకటి ఆవరిస్తుంది. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఇక చాలు… ఈ లోకం నుంచి నిష్క్రమిద్దామని కూడా అన్పించవచ్చు. అలాంటి వారికి నేనున్నానని ఎవరైనా అండగా నిలబడితే… నాలుగు మంచి మాటలతో మెరుగైన భవిష్యత్తుపై చిగురంత ఆశ కలిగేలా చేస్తే… ఆ పనే చేస్తోంది భూమిక హెల్ప్‌లైన్‌.

కేవలం టెలిఫోన్‌లో మాట్లాడడం ద్వారా కొంతకాలంలోనే ఎంతోమంది జీవితాల్లో వెలుగు తేగలిగిన ఈ హెల్ప్‌లైన్‌ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి అయింది. సంఘసేవ పట్ల ఆసక్తి కల కొందరు ఆయా ప్రాంతాల్లో సొంతంగా ప్రారంభించగా, వెలుగు పథకం కింద జిల్లాల్లో ఇలాంటి హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం తరఫునా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లా నుంచీ ఐదుగురు సభ్యులను ఎంచుకుని వారికి శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా భూమిక హెల్ప్‌లైన్‌ చేపట్టింది. ఈ నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ గురించి వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ‘వసుంధర’కు వివరించారు.

‘భూమిక’ తోనే మొదలు
‘పదిహేనేళ్లుగా నేను భూమిక పత్రిక ద్వారా స్త్రీ సమస్యలపై పోరాడుతున్నాను. కార్యాలయానికి పలువురు మహిళలు చేసిన ఫోన్లు చూశాక అలాంటి వారికి సాంత్వనిచ్చి..భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. ఆ యోచన కార్యరూపం దాల్చింది. ఇప్పటిదాకా పదిహేను వందలకు పైగా కేసులను పరిష్కరించాం’అని వివరించారామె.

ఎలా పనిచేస్తుంది?
భూమిక టోల్‌ఫ్రీ నంబరుకి ఫోన్‌ చేస్తే ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. ఎం.ఎ. సోషల్‌ వర్క్‌ చేసి కౌన్సెలింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఇక్కడ కౌన్సెలర్లుగా ఉన్నారు. ఉదయం ఎనిమిదినుంచి రాత్రి ఎనిమిదింటివరకు ఈ నంబరు సేవలందిస్తుంది. చాలావరకు కేసులకు కౌన్సెలింగ్‌ సరిపోతుందని, నిపుణుల అవసరం ఉన్నప్పుడు మళ్లీ చేయమని చెప్తామని, అవసరమైతే ఇతర కౌన్సెలింగ్‌ కేంద్రాల నంబర్లు, వారి వారి ప్రాంతాల్లో సహాయం అందించగల సంస్థల నంబర్లు కూడా వారికి ఇస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ సేవలందించడానికి కొందరు వృత్తి నిపుణులు కూడా తరచూ వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలనుంచీ ఫోన్లు వస్తుంటాయనీ కోస్తా ఆంధ్రా, గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాలనుంచీ వచ్చేవే అధికమన్నారు. ఎక్కువ శాతం కేసులు గృహహింసకు సంబంధించినవేననీ వివరించారు. అయితే గత రెండు నెలలుగా వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారామె. ఒత్తిడినెదుర్కొంటున్న విద్యార్థినులు, అపరిపక్వ ప్రేమలు వాటి తాలూకు పరిణామాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే వస్తున్నాయని కార్యకర్తలు వివరించారు.

మంచి పని ఇప్పిస్తానని చెప్పిన బ్రోకరుని నమ్మి గోదావరి జిల్లానుంచి మాల్దీవులకు చేరిందో మహిళ. అక్కడికెళ్ళాక తాను మోసపోయానన్న విషయం తెలిసి .ఎలాగో భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా సంప్రదించింది. తర్వాత ఆమెను క్షేమంగా ఇల్లు చేర్చగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందంటారు సత్యవతి. పాస్‌పోర్టు తదితర పత్రాలేవీ లేకుండా విమానం దిగిన ఆ మహిళను అధికారులు తిరిగి త్రివేండ్రం పంపించేశారు. తెలుగు తప్ప మరో భాషరాని ఆమెను తెలుగు వనితగా గుర్తించి కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థ సత్యవతికి ఫోన్‌ చేసింది. వెంటనే ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, ఛార్జీలకు డబ్బు పంపి, క్షేమంగా ఇల్లు చేరుకునేలా చేశాం. మరో కేసులో అత్యాచారం చేయబోయిన కన్నతండ్రినుంచి ఇద్దరు కుమార్తెలను కాపాడామన్నారు. ఇలాంటి సీరియస్‌ కేసుల విషయంలో పోలీసు అధికారులు, జిల్లాల్లో న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోనూ సంప్రదించి బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.

హెల్ప్‌లైన్‌లో…
ఫోన్‌ మోగగానే తీస్తారు.
ఫోన్‌ చేసిన స్త్రీ చెప్పేదంతా సహనంతో, సానుభూతితో వింటారు.
వివరాలన్నీ అత్యంత గోప్యంగా ఉంచుతారు.
కేసుని బట్టి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు తప్ప తీర్పరితనంతో వ్యవహరించరు.
పరిస్థితి మరీ సీరియస్‌గా ఉందనుకుంటే స్థానిక పోలీసు యంత్రాంగం, కుటుంబహింస చట్టానికి సంబంధించిన రక్షణాధికారి, స్వచ్ఛంద సంస్థలవారిని అప్రమత్తం చేస్తారు.

(సలహా, సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌: 1800 425 2908 సంప్రదించవచ్చు)
భూమిక గురించి ఇంకా తెలుసుకోవాలంటే


11 comments:

  1. సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం.

    ReplyDelete
  2. భూమిక సంస్థ సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం పనిచేస్తుంది. ఈ టోల్ ఫ్రీ ను అందరికి షేర్ చేయండి.

    ReplyDelete
  3. Thanks for your information. I'll forward this to all my friends and family.

    ReplyDelete
  4. Useful info. Thanks

    ReplyDelete
  5. Every girl should know about this organisation.

    ReplyDelete
  6. Good initiative by Bhumika

    ReplyDelete
  7. I know this NGO Bhumika Women's Collective

    ReplyDelete
  8. Thanks for ur info sir

    ReplyDelete