Breaking News

సర్దార్ వల్లభభాయి పటేల్

జననం :31 అక్టోబరు 1875-నాడియర్, గుజరాత్.
మరణం :డిసెంబరు 15, 1950


భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడిగా పేరుపొందారు. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం
1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాడ్ లో జవేరీ భాయి, లాడ్‌లా పటేల్‌లకు నాల్గవ సంతానంగా వల్లభభాయి పటేల్ జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్ర చదువులకై ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.

తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె - మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియచేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు.

36 ఏళ్ళ వయసులో ఇంగ్లాండుకు వెళ్ళి అక్కడ లండన్‌లో ఒక లా కాలేజీలో చేరాడు. 36 నెలల కోర్సును 30 నెలలో పూర్తిచేసాడు, అదీ క్లాసులో ప్రథమ స్థానంలో. తర్వాత అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చి అనతికాలంలోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని ధనాన్ని ఆర్జించాడు. ఆయన ఎప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు.

జాతీయ నేతగా
బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జర్గుతున్న భారత జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్డోలీ లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.

గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్‌లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు.

1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు.

రాజ్యాంగ సభ సభ్యుడిగా
భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటు లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడ అతనే ప్రతిపాదించాడు.

కేంద్ర మంత్రిగా
దేశ స్వాతంత్రం కోసం విశేషకృషి సల్పిన వల్లబ్ భాయి పటేల్ కు సహజంగానే స్వాతంత్ర్యానంతరం ముఖ్యమైన పదవులు లభించాయి. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు.

నెహ్రూతో విబేధాలు
భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో విబేధించాడు. ముఖ్యంగా 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజంను వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించాడు. స్వాతంత్ర్యానంతరం కూడ స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం, సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించాడు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విబేధించాడు. పాకిస్తాన్ కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడ వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించాడు. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడ చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించాడు.

మరణం
1950 డిసెంబరు 15 న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. ముంబాయి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.

బిరుదులు
1991లో భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

సంస్థలూ మరియు స్మారకాలు
సర్దార్ వల్లభాయి పటేల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మోదీపురం, మీరట్, ఉ.ప్ర.

సర్దార్ వల్లభాయి పటేల్ మెమోరియల్ ట్రస్టు

సర్దార్ వల్లభాయి పటేల్ జాతీయ స్మారకం, అహ్మదాబాదు

సర్దార్ సరోవర్ డ్యామ్, గుజరాత్

సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్

సర్దార్ పటేల్ యూనివర్శిటి, గుజరాత్

సర్దార్ పటేల్ విద్యాలయ్, న్యూఢిల్లీ

సర్దార్ పటేల్ పోలీస్ అకాడెమి, హైదరాబాదు

సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ముంబై

సర్దార్ పటేల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.

ఐక్యతా ప్రతిమ, గుజరాత్

సర్దార్ పటేల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అహ్మదాబాదు

సర్దార్ వల్లభాయి పటేల్ ఫౌండేషన్, ఢిల్లీ

సర్దార్ పటేల్ ఎడ్యుకేషన్ ట్రస్టు, ఆనంద్

సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషంస్ & మేనేజ్ మెంట్, ఢిల్లీ.

సర్దార్ పటేల్ పబ్లిక్ కాలేజి, ఢిల్లీ

సర్దార్ పటేల్ కాలేజి, గుర్గావ్

సర్దార్ పటేల్ మెడికల్ కాలేజి, బికనేర్

సర్దార్ పటేల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి, వాసడ్

సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టు, అహ్మదాబాదు

సర్దార్ పటేల్ స్టేడియమ్

సర్దార్ పటేల్ స్టేడియం, అహ్మదాబాదు.

సర్దార్ పటేల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ & సోషియల్ రీసర్చ్

సర్దార్ పటేల్ బోచాసన్, ఆనంద్

సర్దార్ పటేల్ విద్యాలయ్ వడోదర

సర్దార్ పటేల్ పాలిటెక్నిక్ కాలేజి, భోపాల్, మ.ప్ర.

సర్దార్ పటేల్ చౌక్, రాంచి, ఝార్ఖండ్

సర్దార్ పటేల్ స్మారక్ ఇంటర్ కాలేజి, జట్టారి, అలీగఢ్, ఉ.ప్ర.

సర్దార్ పటేల్ చెస్ట్ ఇంస్టిట్యూట్, ఢిల్లీ యూనివర్శిటి.

5 comments:

  1. భారత దేశపు ఉక్కు మనిషి గా పేరుగాంచినసర్దార్ వల్లభ్‌భాయి పటేల్.

    ReplyDelete
  2. The Iron Man of INDIA.

    ReplyDelete
  3. Statue of unity in Gujarat

    ReplyDelete
  4. National unity day..

    ReplyDelete