Breaking News

భారత స్వాతంత్ర్యోద్యమము


భారత ఉపఖండం లో స్వాతంత్ర్య సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్ర్యోద్యమము" గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్ర్యోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ మరియు ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దములో బుడతగీచు (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్ లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్ లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్ గా ఆవిర్భవించింది.

20వ శతాబ్దం మెదట్లో ఈ పద్దతులలో మౌలికమైన (రాడికల్) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్, (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్రయోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారతసిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.

జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీ సింగ్ మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు. అయితే ఇతర నాయకులు సాయుధ పోరాటాలను అవలంబించారు. సుభాష్ చంద్ర బోస్, సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి సన్నకారు రైతులు, శ్రామికుల సంపూర్ణ ఆర్ధిక స్వాతంత్రా నికై పిలుపునిచ్చాడు. రెండవ ప్రపంచయుద్ధ కాలానికి ఈ ఉద్యమాలు ఉధృతరూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత జాతీయసైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది.


ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా అవిభక్త భారతదేశంలోని దేశాలు స్వతంత్ర దేశాలయినాయి.1947 ఆగష్టు 15న భారత దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్బవించినప్పటకీ 1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటివరకూ బ్రిటీష్ వారి పాక్షిక పాలలోనే సాగింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్బవింపజేసింది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956 లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికార పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణిచివేయబడింది, ఈ పరిణామాలు చివరకి 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో తూర్పుపాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఆవిర్భవించేందుకు దారితీశాయి.

భారత జాతీయోద్యమం అనేక దేశాలలో వలసపాలనలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా పనిచేసి, బ్రిటీష్ సామ్రాజ్య పతనానికీ కామన్ వెల్త్ ఆవిర్భావానికీ దారితీసింది. తరువాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత గాంధేయవాదం మార్గదర్శకం అయింది. 1955-1968 మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌరహక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం, మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసే పోరాటాలాను అందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆయితే ఈ నాయకులందరూ గాంధేయవాదాలయిన అహింస, సత్యాలని తుచ తప్పక పాటించారని చెప్పలేము.

లాభదాయకమైన సుగంధద్రవ్యాల వ్యాపారార్థం 1498 లో వాస్కోడగామా కాలికట్ లోని కోజికోడ్ ఓడరేవులో కాలిడినప్పటినుంచీ ఐరోపా వర్తకుల రాకపోకలు భారత ఉపఖండంలో ప్రారంభమయ్యాయి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించటంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది. ఈ యుద్ధం తరువాత బెంగాల్, బీహార్‌లు ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765 లో బక్సర్ యుద్ధంలో ఒరిస్సా కూడా కంపెనీ వశమైంది. 1839 లో మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరం 1845-46 లో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తరువాత 1848-1849 లో జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్, కంపెనీ వశమైంది. ఈ కాలంలో బ్రిటీష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేక శాసనాలు చేసింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 లో చేసిన ఇండియా చట్టం, 1813 చార్టర్ చట్టం మెదలయినవి బారతదేశంలో బ్రిటీష్ అధికారాన్ని సుస్థిరం చేసాయి. 1835 లో ఇంగ్లీషును ఆధికారిక భాషగా గుర్తించారు. ఈ సమయంలో ప్రాచ్యవిద్యని అభ్యసించిన హిందూ విద్యావేత్తలు హిందూ ధర్మంలోని సాంఘిక దురాచారాలైన సతీ సహగమనం, కులవివక్ష, బాల్య వివాహాలను రూపుమాపటానికి ఉద్యమించారు. ఈ విధంగా బొంబాయి, మద్రాసులలో ఏర్పడిన సంఘాలు రాజకీయసంఘాలుగా పరిణతి చెందాయి. ఉన్నత విద్యనభ్యసించిన నాటి తొలి సంస్కర్తలు పత్రికలను మిక్కిలి సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం కారణంగా ఆనాటి సామాజిక విలువలు, మతసంప్రదాయాలకు ఎక్కువ విఘాతం కలగకుండానే సంస్కరణలు సాధ్యమయ్యాయి.

బ్రిటీష్ పాలన వలన పరోక్షంగా ఆధునిక భావజాలం వ్యాప్తిచెందినప్పటికీ, భారతీయులు బ్రిటీష్ వారి వలసపాలన పట్ల వ్యతిరేకతను పెంచుకో సాగారు. నైన్త్ లాన్సర్స్ లో నిక్షిప్తమైన హెన్రీ ఔరీ జ్ఞాపకాలు, సుగంధద్రవ్య వ్యాపారి ఫ్రాంక్ బ్రౌన్ తన మేనల్లునికి వ్రాసిన ఉత్తరాలు బ్రిటీష్ పాలనలో భారతీయులపై జరిగిన దాష్టీకాలను తెలియజేస్తాయి. ఉపఖండంలో బ్రిటీష్ వారి అధికారం పెరిగేకొద్దీ వారు భారతీయుల ఆచారాలను హేళన చెయ్యడం ఎక్కువయింది. మసీదులలో పార్టీలు చేసుకోవడం, తాజ్ మహల్ పై సైనిక నృత్యాలను ప్రదర్శించటం, రద్దీగా వుండే దారులలో, సంతలలో తమకు అడ్డువచ్చిన వారిని కొరడాలతో కొట్టడం (ఆధారం హెన్రీ బ్లేక్ జ్ఞాపకాలు), సిపాయిలను అగౌరవంగా చూడటంవంటి ఆగడాలు పెచ్చుమీరాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తరువాత అనేక చిన్నచిన్న తిరుగుబాట్లు జరిగాయి, అయితే వీటిని బలవంతంగా అణచివేసారు.

2 comments:

  1. భారత స్వాతంత్ర్యోద్యమము.

    ReplyDelete
  2. Jai bolo bharath mata ki jai

    ReplyDelete