Breaking News

తండా తండాల ప్రజల - Tanda Tandala Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


తండా తండాల ప్రజల 

తరతరాల వీరగాథ

గుట్ట చెట్టు గుండెల్లో 

గర్జించే ప్రతిధ్వనులు 

బంజారా వీరులం!

తలవంచని ధీరులం!

ధూళిబాటే  దారైనా 

ధర్మం జీవనగానం!


జై జై బంజారా — వీర బంజారా!

జోహార్ జోహార్ — త్యాగ బంజారా!

తండాలే  కోటలై —

స్వాభిమానమే  శ్వాసై !


 1

ఎడ్లబండ్ల చక్రాలతొ 

నలుమూలల సంచరించి 

ధాన్యపు గింజలు పంచి 

ఆకలి తీర్చిన జాతి!


అడవి,కొండ దారుల్లో 

ఆంగ్లేయుల నడ్డగించి 

స్వరాజ్య సైన్యాలకు 

సరుకులనందించే జాతి 


దమ్మున్న జాతిరా!

ధైర్యమున్న జాతిరా!

స్వతంత్ర పోరులోన 

చరిత్ర సృష్టించెరా 


2

పన్నులతొ పీడించినా

ఆంక్షలు విధియించినా 

వ్యాపార బాటల్లో అడ్డుగోడకట్టినా 

ఎద్దుల బండాగ లేదు 

గజ్జెల మోతాగలేదు

తండ దీపమారలేదు

తలవంచని సంచారులం 

అణచివేత ఆపలేదు 


దోపిడి ,దౌర్జన్యాలను 

భయపడక నెదిరించి

భరత మాత పుత్రులమై 

సంకెళ్ళను తెంచినాము 


3

పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి

“నేరజాతి” ముద్రవేసె కటికచీకటి 

పుట్టుకతొ నేరగాళ్ళని పలికిన

తెల్లదొరలకు సవాల్ విసిరే 

తిరుగుబాటు నాపగలర 

మా గుండెను చీల్చగలర ?

గొలుసులతొ బంధించి 

తేజస్సును ఆపగలరా?


నేర ముద్ర వేసినా 

నిర్భంధం చేసినా 

మా  సాహస సంకల్పం 

మనసుల్లో రగులుతోంది 


4

గుట్టలు మా గోడలై 

కొండలే మా కోటలై 

అడవుల్లో సంచరించి 

అగ్నిజ్వాలగా వెలిగే 

సంచారం స్వేచ్చాగానం 

సంస్కృతి  జీవన వేదం!


గుట్టల్లో ఘన గర్జన!

కొండలనే పిండి చేయు 

స్వాతంత్ర్య పిపాసులం 

శత్రువుగుండెలొ టపాసులం 



5

నైజాముల పాలనలొ 

పన్నుల భారం పెరిగి 

భూమి హక్కు కోల్పోయి 

దౌర్జన్యాల్ కొనసాగగ

ఆత్మగౌరవం నిలిపి 

చీకటినే ప్రతిఘటించి 

తలవంచని తండాలే 

తిరుగుబాటు జరిపెను!

స్వేచ్చా దీపం వెలిగెను!


6

గోవింద్ గురు పిలుపులో

గిరిజన జనమంత గూడె

మాన్‌గఢ్  శిఖరంపై

పంతొమ్మిదివందల పదమూడు 

నవంబరు పదిహేడున 

జలియన్ వాలా బాగ్ ని 

మించిన మారణ కాండ 

పదిహేనొందల గిరిజనుల 

రక్త ధార నేల తడిసె 

త్యాగధనుల చరిత్రను 

మరువం మేమెన్నటికీ 


మాన్‌గఢ్ మట్టికి జోహార్!

త్యాగధీరులకు జోహార్!

రక్తంతో రాసిన చరితకు 

భారతీయులందరి జోహార్!


7

రాణా ప్రతాప్ యోధునికి 

పృథ్వీరాజ్ సైన్యాలకు

తోడై నిల్చిన బంజారులు 

చరిత్ర పుటల్ తిరగేస్తె 

వీరగాథ విస్పోటన

తరగని ఆ జ్ఞాపకాలు 


గర్వంగా తలఎత్తెను 

స్వాభిమానం మొలకెత్తెను 

స్వేచ్చా బంజారధ్వజం

తరతరాల స్ఫూర్తినిచ్చే 


8


వ్యాపారం వాణిజ్యం 

చెమటోడ్చె శ్రమరాజ్యం 

ఆయుధం లేకున్నా

అంధకారమెదురైనా 

కాంతిని విరజిమ్మి 

గోమాతల పోషించి 

భాష, భక్తి, బంధాలను

బ్రతికించిన బంజారులు !


మా పాటే మా చరిత్ర!

మా తండా  పాఠశాల!

మా సంస్కృతి కవచమై !

స్వాభిమాన జెండనెత్తే !


తండాల తేజస్సులు !

గుట్టల్లో ప్రతిధ్వనులు 

కొండ కొదమసింహాలు !

దేశభక్త ధీరులై ! 

జగదాంబ భక్తులై 


స్వాభిమానమే ధైర్యం !

సత్యధర్మమే పథం!

భరతభూమి మాతగా 

కొలిచే బంజారులం

No comments