Breaking News

జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్..


వస్తున్నాయ్...వస్తున్నాయ్
జగన్నాథ రథ చక్రాల్...వస్తున్నాయ్!
పూరీతీరంలో కొలువుదీరిన పురుషోత్తముడు అధిరోహించగా...
అన్నాచెల్లితో కలసి వస్తున్న జగన్నాథుని రథచక్రాల్....వస్తున్నాయ్..
జీవనయాత్రలో ఒక్కసారైనా ఆ రథచక్రాలను తాకి పరవశించిపోవాలని తపించే భక్తకోటి తరలివస్తోంది..ఆ చక్రదర్శనంకోసం...ఆ జగన్నాథ రథయాత్రకోసం...

ఒడిశాలోని పూరి.. మహాపుణ్యక్షేత్రం. దీనిని శ్రీ క్షేత్రం అంటారు. అక్కడ పూజలందుకుంటున్న జగన్నాథుడి ముందు అంతా ఒక్కటే. రాజుపేద, బీదబిక్కి అంతా సమానమే. అందుకే సర్వం జగన్నాథం అంటారు. ఆ క్షేత్రంలో ఉన్న సంప్రదాయాలన్నీ అదే చెబుతున్నాయి. ఈ భూమండలంలో అతి పురాతనమైన సంప్రదాయం ఈ జగన్నాథ రథయాత్ర. ఆధునికయుగంలో.. మనకు తెలిసి 10-11వ శతాబ్దంనుంచి జగన్నాథ రథయాత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాల్లో జగన్నాథుని వైభవం, రథయాత్ర ప్రాశస్త్యం ఉన్నాయి. ఈ యాత్ర ఎంత పురాతనమైనదో తెలిస్తే ఆశ్ఛర్యపోతాం. హిందువులకు ఎంతో ఇష్టమైన, నమ్మకమైన, భక్తియాత్ర ఇది. పాశ్చాత్య దేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందిన వేడుక ఇది. ఈ యాత్రకు తరలివచ్చే భక్తులు..ఎంత తన్మయత్వంతో ఉంటారంటే...జగన్నాథుడిని చూసి తరించాలని...ముక్తిపొందాలని తహతహలాడిపోతారు. కనీసం పదిలక్షలమంది భక్తులు...ఒక విశాలమైన వీధిలో కదలివచ్చే రథాలను లాగేందుకు పోటీపడతారు. ఆ జనప్రవాహంలో ప్రాణానికి ముప్పుంటుందని తెలిసినా వెనక్కి తగ్గరు...పెద్దకళ్ల జగ్గడిని చేరువనుండి చూసేందుకు వారు తెగించి పూరీ చేరుకుంటారు.
జగన్నాథుడి అవతారం, పురుషోత్తమ క్ష్రేత్ర నిర్మాణం, ఇంద్రద్యుమ్నుడి పాత్ర, జగన్నాథ స్వరూప గాథ...చాలామందికి తెలుసు. అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రలతో కొలువుదీరిన జగన్నాథుడి వైభవమూ అందరికీ తెలుసు. జగన్నాథ రథయాత్రలో రథాల గమనం నెమ్మదిగా సాగవచ్చుకానీ...జగన్నాథ రథచక్రాల వేగం ఎలా ఉంటుందో..దుష్టశిక్షణకు అవి ఎలా పరుగులుపెడుతూ వస్తాయో...పురాణాలు ఎప్పుడో చెప్పాలి. మహాకవి శ్రీశ్రీ అంతటివాడు...మహాప్రస్థానంలో... పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి పెద్ద భరోసా ఇచ్చిన విషయమూ అందరికీ తెలుసు. ‘పతితులార..భ్రష్టులార...బాధాసర్పదష్టులార,
దగాపడిన తమ్ములార, దగాపడిన తమ్ములార...
ఏడవకండేడవకండి జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్...వస్తున్నాయ్..
రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను..్భకంపం సృష్టిస్తాను’ అంటాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా...జగన్నాథుడిమీద భక్తులకు అంతకంటే ఆపారనమ్మకమే ఉంది. తమ కష్టాలు తీర్చేవాడని, ముక్తిని ప్రసాదించేవాడని. ఆయన వచ్చేదాక ఆగలేక...ఆయన చెంతకే వెళ్లి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడతారు. అందుకే రథయాత్ర రోజున పూరీ భక్తజనకోటితో కళకళలాడుతుంది. ఇక్కడ మనం పురుషోత్తమ చరిత్రకాదు తెలుసుకోవలసింది. ప్రజలంతా ఆయనముందు ఒక్కటే అన్న సంప్రదాయం అడుగడుగునా కన్పించే సన్నివేశాల గురింతి తెలుసుకోవలసిన అవసరం ఉంది. అక్కడి సంప్రదాయాలు ఆధునిక సమాజంలో మొదలైనవి కావు. కనీసం 600 సంవత్సరాల నాటివి. ఏ మాత్రం మార్పులకు లోనుకానివి. అప్పటికీ...ఇప్పటికీ ఒకేలా అనుసరిస్తున్నవి. మనం పిల్లల్ని ముద్దుతో బండపేర్లతో పిలిచినట్లే...జగన్నాథుడిని ఆయన భక్తులు పెద్దకళ్ల స్వామి అని...మొండి జగ్గడని నోరార పిలుచుకుంటారు. ఒడిశాలో అయితే ఆయన పేరు తలవనివారు ఉండరు. అక్కడ వ్యవసాయం మొదలుపెట్టడం దగ్గరనుంచి ‘నేస్తం’ కట్టడం వరకు ఆయన ప్రస్తావనతోనే సాగుతాయి. వారి మనస్సుల్లో..జీవితాల్లోనూ స్వామి పెనవేసుకుపోయారు. శ్రీక్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర విశేషాలు తెలుకుందామా!
పూరీ క్షేత్రంలోని ప్రధాన మందిరంలోని ‘రత్నవేది’ అనే వేదికపై బలరామ, సుభద్ర, జగన్నాథ స్వామివార్ల విగ్రహాలు కొలువై ఉంటాయి. జగన్నాథుడి పక్కనే సుదర్శనం ఉంటుంది. బలరాముడి విగ్రహం (మోము) తెల్లనివర్ణంలోను, సుభద్రాదేవి పసుపువర్ణంలోను, జగన్నాథుడి విగ్రహం నల్లని రంగులోనూ ఉంటాయి. వైష్ణవ సంప్రదాయంలో తిరునామాలుంటాయి. ప్రతి ఏడాది ఆషాఢ శుక్ల విదియనాడు రథయాత్ర మొదలవుతుంది. ప్రధాన మందిరం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గుండిచ’ ఆలయానికి మూడు రథాలపై బలరామ, సుభద్ర, జగన్నాథుడు యాత్రగా వెళతారు. ఇదే రథయాత్రలో ప్రధాన ఘట్టం. తొమ్మిది రోజులపాటు అక్కడే పూజలందుకుని తిరుగు ప్రయాణమవుతారు. దీనిని మారు రథయాత్ర అని, బహుదా యాత్ర అని పిలుస్తారు. ఈ సందర్భంగా మధ్యలో ‘వౌసీ మా’ (అత్తగారి ఇల్లు అని చెప్పుకోవచ్చు) ఆలయం వద్ద స్వామి ప్రత్యేక పూజలందుకుంటారు. ప్రత్యేక ప్రసాదాన్ని (పొడపిథ) నైవేద్యం పెడతారు. ఆ తరువాత స్వామివారి యాత్ర శ్రీ క్షేత్రానికి సాగుతుంది. మూడు విగ్రహాలతోపాటు సుదర్శనాన్ని మళ్లీ రత్నవేదికపైకి చేర్చడంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది. రథయాత్రలో ఉపయోగించే రథాల తయారీ, వాటి అలంకరణకు వాడే వస్త్రం, కొలతలు, కలప, వడ్రంగి పనివారి ప్రత్యేకత, పూరీ మహారాజు పాత్ర అన్నీ ఈ యాత్రలో విశేషాలే.
ఏటా కొత్త రథాల తయారీ
పూరీ క్షేత్రంలో కొలువైన బలరామ, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలు దారువిగ్రహాలు. ప్రతి పనె్నండేళ్లకు ఓ మారు వాటిని కొత్తగా తయారు చేస్తారు. ఆ ఏడాది జరిగే రథయాత్రను ‘నవకళేబర’ యాత్రగా చెప్పుకుంటారు. ఇక స్వామివార్లను ఊరేగించే రథాలను ప్రతి సంత్సరం ఎప్పటికప్పుడు తయారు చేస్తారు. రథాలకు ప్రత్యేకమైన కొలతలు, సంప్రదాయాలు, రంగులు, వాటికి చేసే అలంకరణలు అన్నీ విశిష్టమైనవే. శతాబ్దాల తరబడి అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి మార్పులు ఇంతవరకు అనుమతించలేదు. వైశాఖ శుద్ధ తృతీయ...అంటే అక్షయతృతీయ (సింహాచలేశుని చందనయాత్ర జరిగే రోజు) నాడు ఈ రథాల తయారీని ప్రారంభిస్తారు. అదే రోజు రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. రెండు నెలలపాటు రథాల తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. పూరీ ఆలయానికి అభిముఖంగా, పూరీ మహారాజ భవనం ముంగిట ఈ రథాల తయారీ పనులు నిర్వహించడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఒకప్పటి ‘దసపల్లా’ రాజ్యంగా పేరుగడించిన ఒక ప్రాంతం (ప్రస్తుత ఒడిశాలోని గిరిజన ప్రాంతం)నుంచి ఎంపిక చేసిన వృక్షాలను వడ్రంగులు ఎంపిక చేస్తారు. అనువంశికంగా ఈ చెట్ల ఎంపికను చేస్తున్న వడ్రంగుల కుటుంబాలకు చెందిన పదిహేనుమంది కొన్ని వారాల తరబడి అడవుల్లో తిరిగి ఈ వృక్షాలను ఎంచుకుంటారు. వాటి దుంగలను మహానదిలో విడిచి పెడతారు. ఆ నదిలొ మైళ్లదూరం నీటిలో తేలియాడుతూ కొట్టుకువచ్చిన వాటిని ఒడ్డుకు చేర్చి రోడ్డుమార్గంలో పూరీకి తరలిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం రథాల తయారీ ప్రారంభమవుతుంది. ఈ పనులనూ కొన్ని కుటుంబాలకు చెందినవారే వంశపారపర్యంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
కొలతలు..ప్రత్యేకతలు
రథయాత్రలో మూడు రథాలు ఉంటాయి. జగన్నాథుడు అధిరోహించే రథం పేరు ‘నందిఘోష’. దీనిని ‘గరుడధ్వజ’, కపిలధ్వజ అని కూడా కొందరు పిలుస్తారు. దాదాపు 45 అడుగుల ఎత్తున దీనిని నిర్మిస్తారు. ఏడు అడుగుల వ్యాసార్థంతో ఉండే 16 చక్రాలతో 45 చదరపు అడుగుల వ్యాసార్థంతో తయారైన చట్రంపై రథ నిర్మాణం సాగుతుంది. దీనికోసం 832 కలప దుంగలను వినియోగిస్తారు. ఈ కొలతలుగానీ, కలప సంఖ్యగానీ శతాబ్దాలుగా ఒక్కటే. ప్రతి రథానికి ముందు నాలుగు దారుఅశ్వాలుంటాయి. రథం పైన ధ్వజం ఉంటుంది. ప్రతి రథానికి వేర్వేరు అధిదేవతల దారుశిల్పాలు ఉంటాయి. ప్రతి రథానికి ప్రత్యేక సారథి శిల్పం ఉంటుంది. ఇక బలరాముడు అధిరోహించే రథాన్ని ‘తాళధ్వజ’ అని పిలుస్తారు. ఏడు అడుగుల వ్యాసార్థంతో ఉండే 14 చక్రాల చట్రంపై 44 అడుగుల ఎత్తున ఈ రథం తయారు చేస్తారు. దీనికోసం 763 కలప దుంగలను వినియోగిస్తారు. ఇక సుభద్రాదేవి అధిరోహించే రథం ఎత్తు 43 అడుగులు. ఏడు అడుగుల వ్యాసార్థంతో ఉండే 12 చక్రాల చట్రంపై దీనిని నిర్మిస్తారు. దీనికోసం 593 కలప దుంగలను వినియోగిస్తారు. సుభద్రాదేవి రథంపైనే సుదర్శనాన్నీ ఉంచుతారు.
వస్త్రాలు...రంగులు
ఈ రథయాత్రలో మరో విశేషం గమనించాలి. మూడు రథాలకు మూడు విభిన్నమైన రంగులతోకూడిన వస్త్రాన్ని ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ స్వామివారి ప్రత్యేకతను ఆ రంగులు చాటుతాయి. జగన్నాథ రథానికి వాడే వస్త్రాలు ఎరుపు, పసుపువర్ణంతో కూడి ఉంటాయి. బలరామ రథానికి వాడే వస్త్రాలు ఎరుపు, నీలం రంగులో ఉంటాయి. ఇక సుభద్రాదేవి రథానికి నలుపు, ఎరుపు రంగుతో ఉంటాయి. నలుపు శక్తిస్వరూపానికి ప్రతీకగా భావిస్తారు. ఇక ఈ రథానికి చుట్టూ పరిచే ఈ వస్త్రాల తయారీకోసం పదిహేనుమంది దర్జీలు పనిచేస్తారు. ఇదికూడా అనువంశికంగా వారు చేసే పనే. ఇందుకోసం వారు 1200 మీటర్ల వస్త్రాన్ని వినియోగిస్తారు. రథాల తయారీకి వాడే చెట్ల ఎంపిక, తయారీ, యాత్ర..అన్నీ శతాబ్దాలుగా వస్తున్న ముహుర్తాల ప్రకారమే నిరంతరాయంగా కొనసాగుతూండటం పూరీ యాత్రలో వైశిష్ట్యం. పైగా నీలకళేబరుడి యాత్రలో నిమ్నవర్గాల వారికే అడుగడుగునా ప్రాధాన్యం కన్పిస్తుంది. ఒకటి రెండు సందర్భాల్లో బ్రాహ్మణుల జోక్యం ఉంటుంది తప్ప అన్ని ఘట్టాలలోనూ వారిదే కీలకపాత్ర.
ప్రసాదాలు...ప్రత్యేకతలు
జగన్నాథుడికి అన్నప్రసాదం ప్రీతికరం. జగన్నాథంలో ఆకలి అనేది ఉండదని అంటారు. అంటే..అక్కడికి వచ్చే భక్తులకు సరిపడా ప్రసాదం అక్కడ లభ్యమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వంటశాల ఈ క్షేత్ర విశిష్టతల్లో ఒకటి. విశాలమైన వంటఇల్లు, ఎక్కువ వరుసల్లో మట్టికుండలపై ప్రసాదం తయారీ ఇక్కడి ప్రత్యేకత. కట్టెల పొయ్యిలపై వరుసగా ఒకదానిపై ఒకటిపెట్టి మట్టికుండల్లో ప్రసాదాలు చేస్తారు. అన్నింటికన్నా పైనున్న చిన్నపాటి కుండలో ప్రసాదం ఉడికితే అన్నీ ఒకేసారి దింపేస్తారు. అన్నింటిలోనూ ప్రసాదం శుభ్రంగా ఉడికి ఉంటడటం విశేషం. ఈ ప్రసాదాల తయారీకోసం 600మంది వంటవారు, 400 మంది సహాయకులు పనిచేస్తారు. 56 రకాల ప్రసాదాలు నివేదిస్తారు. అన్నం, పప్పు, పప్పుదినుసులు, కూరగాయల మిశ్రమంతో తయారు చేసిన వంటకాలు ఎక్కువగా ఉంటాయి. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు ఆరగింపు పెట్టినా... అక్కడున్న ‘విమలాదేవి’ అమ్మవారికి నైవేద్యం పెట్టాకే దానిని ‘ప్రసాదం’గా పరిగణిస్తారు. ఇక్కడ ప్రసాదానికి వాడే కుండలు ఒక్కసారే వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో తరతమ బేధాలు, వర్ణ, కుల, పేద, పెద్ద తేడాలేమీ ఉండవు. ఈ వంటశాల, ప్రసాదాల తయారీ సంప్రదాయాన్ని 12వ శతాబ్దంలో పూరీ మహారాజు యయాతి కేశహరి ప్రారంభించారని ఆధారాలు ఉన్నాయి. ఇక తిరుగు రథయాత్రలో ‘వౌసీమా’ ఆలయం వద్ద స్వామివారు ఆగినపుడు నైవేద్యంగా పెట్టే ‘పొదపీథ’ ఓ కేకులాంటి ప్రసాదం. ఇది పేదలకు ప్రత్యేకం. దీనికోసం పెద్దసంఖ్యలో భక్తులు వేచిచూస్తారు.
విశ్వాసాలు...విశేషాలు
జగన్నాథుడి ముందు అందరూ సమానులే. ఒక్క రథయాత్రలో మినహా మిగతా అన్నివేళలా ఆలయప్రవేశం ఉంటుంది. హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. రథయాత్ర సమయంలో ఆలయం వెలుపల.. ఆటంకాలు ఉండవు. మామూలు రోజుల్లో స్వామివారి విగ్రహానికి అతి చేరువగా వెళ్లి హిందువులు దర్శనం చేసుకోవచ్చు. ఆలయంలోకి ప్రవేశించేటపుడు సింహద్వారం వద్ద సముద్రఘోష విన్పించదని, తిరిగి వచ్చేటపుడు మాత్రం స్పష్టంగా విన్పిస్తుందని అంటారు. దీనిని భక్తులు విశ్వసిస్తారుకూడా. ఇక రథయాత్ర వేళ...జగన్నాథుడి రథం ఒకపట్టాన కదలదని, ఆయన అనుమతిచ్చాకే ముందుకు కదులుతుందని విశ్వసిస్తారు. వేలాదిమంది తాడుపట్టి లాగినా రథం ఇసుమంత కదలకపోవడం, ఉన్నట్టుంది...కొద్దిమంది లాగితే కదలడంలాంటి సంఘటనలు...్భక్తులకు మహదానందం కలిగిస్తుంది. ఇక బంగాళాఖాతం తీరం ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి గాలీ వీచే దిశలకు భిన్నంగా పూరీ తీరంలో గాలి వీస్తుందని, గర్భగుడిపైనుంచి పక్షులు ఎగరవని అక్కడివారి అనుభవం చెబుతోంది. *

రాజు...పేద
పూరీ రథయాత్రలో మరో విశేషం కన్పిస్తుంది. రథయాత్ర వేళ...మూడు రథాలపై స్వామివార్ల విగ్రహాలు చేర్చాక పూరీ మహారాజు వస్తారు. రథాలపై స్వామివార్ల ముంగిట బంగారు చీపురుతో పరిసరాలను మహారాజు స్వయంగా శుభ్రం చేస్తారు. భగవంతుడి ముందు పేదలైనా, రాజైనా ఒక్కటే అన్న సంకేతాన్నిచ్చే సంప్రదాయంగా భావిస్తారు. రథం ముంగిటకూడా ఇదే అనుసరిస్తారు. కొన్ని సంవత్సరాలుగా పూరీ మహారాజు దిబ్యసింగ్‌దేవ్ ఆ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు.
**
ఆభరణాలు...అలంకరణ
మిగతా వైష్ణవ ఆలయాలకు భిన్నంగా జగన్నాథుని సేవ ఉంటుంది. స్వామివారికి నైవేద్యమే ప్రధానం. మిగతా వైష్ణవ ఆలయాల్లో మూలవిరాట్టు, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. విష్ణువు అలంకార ప్రియుడని అంటారు. కానీ పూరీ క్షేత్రంలో అలంకరణ మామూలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆభరణాల సొగసు తక్కువే. ఆయన పేదల దేవుడిగా ప్రతీతి. కానీ రథయాత్ర సందర్భంగా ఒకసారి మాత్రం స్వామివార్లకు బంగారు ఆభరణాలు అలంకరించి భక్తులకు కనువిందు చేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా తిరుగు రథయాత్రలో ఇది పాటిస్తారు. ఈ వేడుకను ‘సునాబెస’ అని వ్యవహరిస్తారు. దాదాపు 208 కిలోల బరువైన ఆభరణాలు మూడు విగ్రహాలకు అలంకరిస్తారు. 1460లో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన అనంతరం అప్పటి రాజు కపిలేంద్ర దేవ్ స్వామివారికి ఈ బంగారాన్ని సమర్పించుకున్నాడని ఆధారాలున్నాయి. 2014లో కేవలం ఈ దృశ్యాన్ని తిలకించినవారి సంఖ్య ఎంతో తెలుసా...అక్షరాల 9 లక్షలు.
**
జూలై 6 పూరీ జగన్నాథ రథయాత్ర

1 comment:

  1. జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్..

    ReplyDelete