Breaking News

సునీతా కృష్ణన్-Sunitha Krishnan Biography in telugu


డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారిని తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. 2016 లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె కథ అందించి ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన నా బంగారు తల్లి అనే సినిమాకి నాలుగు జాతీయ సినిమా పురస్కారాలు లభించాయి.

బాల్యం, విద్యాభ్యాసం
సునీత బెంగుళూరులో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి వచ్చి బెంగుళూరులో స్థిరపడ్డ రాజు కృష్ణన్, నళిని కృష్ణన్ . ఆమె తండ్రి సర్వే ఆఫ్ ఇండియా అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేవాడు. భారతదేశానికంతా మ్యాపులు గీయడం ఈ సంస్థ కర్తవ్యం. ఆయన ఉద్యోగరీత్యా ఆమె దేశంలో పలు ప్రాంతాలు చూడగలిగింది.

ఆమె 8 సంవత్సరాల వయసులోనే మొదటి సారిగా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు నాట్యం నేర్పడంతో సమాజ సేవ వైపు ఆకర్షితురాలైంది. పన్నెండేళ్ళ వయసొచ్చేసరికి మురికివాడల్లో పాఠశాలలు ప్రారంభించింది. పదిహేనేళ్ళ వయసులో దళితుల పక్షాన ఒక ఉద్యమంలో పాల్గొనడంతో ఆమెను ఎనిమిది మంది దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సంఘటనే ఆమెను ప్రస్తుతం చేస్తున్న సేవకు పురిగొల్పింది.

సునీత బెంగుళూరు, మరియు భూటాన్ లో కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. బెంగుళూరులోని సెయింట్ జాన్స్ కళాశాలలో ఎన్విరాన్ మెంట్ సైన్సు నుంచి బ్యాచిలర్ పట్టా పుచ్చుకున్న తర్వాత మంగుళూరులోని రోషిణి నిలయ నుంచి మాస్టర్స్ తర్వాత సామాజిక సేవా రంగంలో డాక్టరేటు సంపాదించారు పరిశోధనలో భాగంగా ఫీల్డు వర్కు చేయడానికి వ్యభిచారుల జీవితాలను పరిశీలించాలనుకుంది.

కెరీర్
1996 లో మంచి సామాజిక కార్యకర్తగా ఎదిగిన సునీతా, బెంగుళూరులో జరగబోతున్న మిస్ వరల్డ్ పోటీలకు వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొనింది. దాంతో ఆమెను మరో డజను మంది కార్యకర్తలతో సహా జైలులో వేశారు. ఆ ఉద్యమానికి ఆమె నేతృత్వం వహిస్తుండటంతో ఆమెను రెండు నెలల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. అన్ని రోజులు ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడటానికి కూడా రాలేదు. ఒకసారి ముంబైలో గ్లోబలైజేషన్ మీద నిర్వహించిన సదస్సులో సునీతకు బ్రదర్ వర్ఘీస్ తో పరిచయం అయ్యింది. ఆయన హైదరాబాదులో మురికివాడల్లో ప్రజలకు సేవ చేయడానికి మ అనే సంస్థను ప్రారంభించాలని అనుకున్నాడు.

రెండు నెలల తర్వాత ఆమె జైలు నుంచి విడుదలైంది. ఆమె తనకు తల్లిదండ్రుల సహాయం లేదని తెలుసుకొని హైదరాబాదుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అక్కడ పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ శాఖలో యువతులను ఉత్తేజ పరిచే పనిచేయడానికి నిశ్చయించుకుంది. తొందరలోనే ఆమె మురికివాడలో ఉంటున్న నివాస సమస్యలకు అర్థం చేసుకొన్నది. అప్పటి ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా వారి ఇళ్ళను కూలదోయాలని నిర్ణయించడంతో ఆమె పీపుల్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ తరఫున అందుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. దాంతో ప్రభుత్వం ఆ పథకానికి స్వస్తి చెప్పింది. అక్కడ ఉన్నప్పుడే ఆమెకు బ్రదర్ జోస్ వెట్టికాటిల్ తో పరిచయమైంది. ఆయన సెయింట్ గేబ్రియల్ కు చెందిన మాంట్ ఫోర్ట్ బ్రదర్స్ తరఫున నిర్వహించే బాయ్స్ టౌన్ అనే సంస్థకు డైరెక్టరుగా వ్యవహరించేవాడు. ఈ సంస్థ ప్రమాదకర పరిస్తితుల్లో జీవిస్తున్న యువకులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేసేది. ఇది 1995 లో మాట.

ప్రజ్వల
1996 లో హైదరాబాదులోని మెహబూబ్ కీ మెహందీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో నివసించే కొంతమందిని ఖాళీ చేయించారు. దీని ఫలితంగా వ్యభిచార కూపంలో చిక్కుకున్న వేలమంది నిరాశ్రయులయ్యారు. వెట్టికాటిల్ సహకారంతో వారిని ఖాళీ చేయించిన స్థలంలోనే సునీతా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, వారి రెండో తరం కూడా ఈ వృత్తిలో దిగకుండా ఉండేందుకు ఒక పాఠశాలను ప్రారంభించింది. సంస్థ ప్రారంభించిన కొత్తల్లో దాన్ని నడపడానికి ఆమె తన నగలను, ఇంట్లో ఉన్న సామాను సైతం అమ్ముకోవాలసి వచ్చింది.

ప్రస్తుతం ఈ సంస్థ నివారణ, సంరక్షణ, పునరావాసం, పునరంకితం, సహాయం అనే ఐదు మూల స్థంబాల ఆధారంగా పనిచేస్తుంది. వ్యభిచార భాదితులకి ఈ సంస్థ నైతికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా సహాయం చేస్తుంది. అంతే కాకుండా నేరం చేసిన వారికి తగిన శిక్ష పడేలా చేస్తుంది. ప్రజ్వల ఇప్పటి దాకా 12000 మందిని వ్యభిచార కూపం నుంచి రక్షించింది. వారు చేసే కార్యక్రమాలు దాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మానవ హక్కుల సంస్థగా గుర్తింపు సాధించి పెట్టాయి.

కుటుంబం
ఆమె భర్త పేరు రాజేష్ టచ్ రివర్. జోస్‌ వెట్టికాటిల్‌ ద్వారా రాజేష్‌ ఆమెకు పరిచయమయ్యాడు. వృత్తి రీత్యా సినిమా దర్శకుడు. రాజేష్‌కు సందేశాత్మక చిత్రాలు తీసే దర్శకుడిగా మంచి పేరుంది. రాజేష్ కు ఒకసారి ప్రమాదం జరగడంతో ఆమె చికిత్స జరిపించింది. ఇదే సమయంలో జోస్‌ వెట్టికాటిల్‌ గుండెపోటుతో చనిపోయారు. జోస్‌ ఆఖరి కోరిక మేరకు వారిద్దరూ ఒక్కటయ్యారు.

దాడులు, బెదిరింపులు
సునీతా మీద ఇప్పటిదాకా 14 సార్లు భౌతికంగా దాడులు జరిగాయి. చంపుతామంటూ బెదిరింపులు ఇప్పటికీ వస్తున్నాయి. ఒకసారి ఆమె ప్రయాణిస్తున్న ఆటోను ఓ సుమో వ్యాను ఉద్దేశ్యపూర్వకంగా గుద్దేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె తీవ్రగాయాలతో బయట పడింది. అలాగే మరోసారి యాసిడ్ దాడి నుంచి తప్పించుకొన్నది. మరోసారి విష ప్రయోగం నుంచి తప్పించుకొన్నది. కానీ ఆమె ఈ దాడులు తనలో మరింత పట్టుదలను పెంచాయని పేర్కొనింది.

పురస్కారాలు
ఆమె ధైర్యానికి అలుపెరగక చేస్తున్న పోరాటానికి మెచ్చి అనేక పురస్కారాలు ఆమెను వరించాయి.
భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ - 2016
యధువీర్ ఫౌండేషన్ పురస్కారం
మదర్ థెరిసా పురస్కారం
CIVICUS ఇన్నొవేషన్ పురస్కారం, 2014.
కైరాలి అనంతపురి పురస్కారం, మస్కట్, 2014.
లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ నుంచి పీపుల్ ఆఫ్ ది ఇయర్, 2014.
వుమన్ ఆఫ్ సబ్ స్టాన్స్ పురస్కారం, రోటరీ క్లబ్ ముంబై, 2014.
మహిళా స్వావలంబనకు గాను రోటరీ క్లబ్ ముంబై వారిటే అనితా ఫరేఖ్ పురస్కారం, 2013.
రోటరీ సోషియల్ కాన్షస్ నెస్ అవార్డు మరియు పాల్ హారిస్ ఫెలోషిప్, రోటరీ క్లబ్ ముంబై, 2013.
గాడ్ ఫ్రే ఫిలిప్స్ నేషనల్ ఆమోదిని అవార్డు, 2013.
హ్యూమన్ సింఫనీ ఫౌండేషన్ నుంచి లివింగ్ లెజెండ్స్ పురస్కారం, 2013.
కేరళ ప్రభుత్వం నుంచి మహిళా తిలకం అవార్డు, 2013.
ఎక్సెంప్లరీ వుమన్ అవార్డు.
అవుట్ స్టాండింగ్ వుమన్ అవార్డు, నేషనల్ కమీషన్ ఫర్ ఉమన్, 2013.
మూలం: వికీపీడియా

2 comments:

  1. సునీతా కృష్ణన్-Sunitha Krishnan Biography in telugu

    ReplyDelete
  2. Telugu Panthulu in Bangalore
    This has been the most memorable time I've spent on this website, and I discovered so much fascinating information about your blog, particularly its conversation. For more information, please click here

    ReplyDelete