Breaking News

కాసు బ్రహ్మానందరెడ్డి-Kasu Brahmananda Reddy

జననం : 1909 జూలై 28-గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపాన తూబాడు గ్రామం
మరణం: 1994 మే 20


అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పదవులను ఆయన విజయవంతంగా నిర్వహించాడు.

జననం, విద్యాభ్యాసం
బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించాడు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నాడు.

స్వాతంత్ర్య సమర పోరాటం
పన్నెండటవ ఏట విజయవాడ కాంగ్రెసు సదస్సుకు విచ్చేసిన మహాత్మగాంధీ ని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం ఖద్దరు ధరించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి బ్రిటిషు వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కాంగ్రెసు పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు.

రాజకీయ ప్రస్థానం
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1946 నుండి 1952 వరకు, 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో చేరాడు. పిమ్మట దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలో కొనసాగి వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించాడు. ఆర్ధిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో అతడు 1971 సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించాడు.

ఎఐసీసీ సారథ్యం
1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెసు ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో కాంగ్రెసు అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెసు నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించాడు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకడు. ఓటమి పిమ్మట, పతనావస్థధలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పని చేసాడు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978 లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసు ను 1980 లో ఇందిరాకాంగ్రెసు లో విలీనం చేశాడు.

రాష్ట్రప్రగతి కి సోపానాలు
రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రెడ్డి అహర్నిశలు శ్రమించాడు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్ పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డాడు. నాగార్జునసాగర్ మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసాడు. పోచంపాడు ప్రాజెక్టు కు రూపకల్పన చేసాడు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించాడు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. సికింద్రాబాదు కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.

మరణం
బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించాడు.

స్మృతి చిహ్నాలు
ఇతని జ్ఞాపకార్థం హైదరాబాదు నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని చిరాన్ పాలెస్ ప్రాంతాన్ని కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం గా నామకరణం చేశారు.
Source: wikipedia

1 comment:

  1. కాసు బ్రహ్మానందరెడ్డి-Kasu Brahmananda Reddy

    ReplyDelete