Breaking News

కట్టమంచి రామలింగారెడ్డి (Kattamanchi Ramalinga Reddy)

జననం:10 డిసెంబర్ 1880
మరణం: 24 ఫిబ్రవరి 1951

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారి గా జీవించాడు.

చదువు, పురస్కారాలు
సి.ఆర్‌.రెడ్డి చదువు అతని అయిదో ఏట వీధి బడిలో మొదలయినది. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర, బాల రామాయణాన్ని చదివేవాడు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు హైస్కూలు లో మొదటిఫారం లో చేరాడు. ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు.

ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాల లో ఉన్నత విద్య పూర్తి చేసాడు. 1899లో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందాడు. 1902 లో బీ.ఏ. పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నాడు.

డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.

భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1904లో 'విద్వాంసుడు' పురస్కారం అందుకున్నాడు. 1905 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై , అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు ప్రశంసలు అందుకొన్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. 1906లో ఎం.ఏ. పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు అక్కడివారు ఆశ్చర్యపడేవారట.

ఉద్యోగ జీవితం
బరోడా సంస్థానాదీశుడు శాయాజీరావు గైక్వాడ్ సి.ఆర్‌.రెడ్డి ప్రతిభను గుర్తించి, తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలచి, అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించడానికి అతనిని అమెరికా పంపాడు. అతని పర్యటన పూర్తయ్యాక 1908 లో స్వదేశానికి వచ్చి తన 28వ యేట బరోడా కళాశాలలో ఆచార్యునిగాను, ఉపాధ్యక్షునిగాను తన తొలి ఉద్యోగం ప్రారంభించాడు. విద్యా వ్యవస్థను మరింత అధ్యయనం చేయడానికి అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కూడా పర్యటించాడు.

ఆ తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించాడు. అక్కడ ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు బాధ్యతలు వెరవేర్చాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాల కాలంలో హరిజనులకు పాఠశాలలలో ప్రవేశం కల్పించడానికి కృషి చేశాడు. విద్యార్థులు అతనిని ఆచార్యునిగా అమితంగా గౌరవించేవారు. అతని ప్రణాళిక ఆధారంగా మైసూర్ విశ్వవిద్యాలయం 1916 లో ప్రారంభమయ్యింది. దానికి కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. తరువాత రెండేళ్ళకు మైసూర్ సంస్థానం విద్యాశాఖాధికారిగా నియమింపబడ్డాడు. ఆ హోదాలో "ప్రతి ఊరికి ఒక పాఠశాల" అనే ఉద్యమం ప్రారంభించాడు. 1921లో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశాడు.

రాజకీయ జీవితం
1921 తరువాత రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1922 లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 2వ సారి చిత్తూరునుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. 1921-25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్‌ పార్టీ లో కీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించాడు. 1935 లో కాంగ్రెస్‌ తరఫున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 1936 లో కొంతకాలంపాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు. శాసన సభలో సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపకులపతిగా
ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసన సభలో ఎన్నో ప్రసంగాలు చేశాడు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి(వైస్‌ ఛాన్సలర్‌)గా 1926 నుంచి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. అయితే ప్రభుత్వం వారి దమననీతికి నిరసనగా తన ఉపకులపతి పదవికి రాజీనామా చేసి చిత్తూరు తిరిగి వచ్చేశాడు. తరువాతి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్ళినప్పుడు రెండోసారి 1936 లో మళ్లీ అదే బాధ్యతను చేపట్టాడు. 1949 వరకు 14 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగాడు. 1949 లో మద్రాసు విశ్వవిద్యాలయం ప్రొ-ఛాన్సలర్‌ పదవిని స్వీకరించాడు.

సాహితీ సేవ
సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డాడు. ఒకవైపు తెలుగు కవితను మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి. సంభాషణలతో దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు, వాదనాచాతుర్యం ఆయన శైలి. హాస్య ప్రియత్వం, ఛలోక్తులు, చమత్కార సంభాషణా నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవాడు.

ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది. భారత అర్థశాస్త్రం, కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి, వేమన మొదలయినవి తెలుగులో ఆయన రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను ఆయన చేయితిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా.. ఆంగ్లంలో ఆయన రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నాడు. సి.ఆర్‌.రెడ్డి విగ్రహాలు

సి.ఆర్‌.రెడ్డి 1951 ఫిబ్రవరి 24న అనారోగ్యంతో మద్రాసులో మరణించాడు. తమిళనాడుతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల విగ్రహాలున్నాయి. ఆయన జన్మించిన పట్టణంలో మాత్రం విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారు. ఈ లోటును ప్రముఖ డాక్టరు, సి.ఆర్‌.రెడ్డి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి కేశవరెడ్డి తీర్చడానికి సన్నాహాలు పూర్తి చేశారు. కలెక్టరు బంగ్లా ఎదురుగా సర్కిల్‌లో విగ్రహాన్ని నెలకొల్పారు.

పదవులు
1926లో డాక్టర్ సి.ఆర్‌.రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యాక్షునిగా నియమితులయ్యాడు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా 1930 లో రాజీనామా చేశాడు. 1936 లో ప్రభుత్వం మళ్లీ ఆయనకు ఆ పదవిని అప్పగించింది.

1 comment:

  1. కట్టమంచి రామలింగారెడ్డి.

    ReplyDelete