Breaking News

వీరనారి ఝల్కారీబాయి

జననం: నవంబరు 22, 1830 
మరణం: ఏప్రిల్ 4, 1857

నిష్పాక్షిక దృష్టితో చరిత్రను తరచి చూస్తే కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నిష్టుర సత్యాలు వెలుగు చూస్తాయన్నది అక్షరసత్యం. చరిత్రకారుల నిర్లక్ష్యంతో వెలుగులోకి రాక అలా మరుగునపడ్డ ఝల్కారిబాయి జీవిత చరిత్ర ఎంత విలక్షణమైనదో అంత అపురూపమైనది. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారిబాయి.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిపాయి తిరుగుబాటుగా, ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా ప్రసిద్ధిగాంచిన 1857-58 నాటి వీరోచిత పోరాట ఘట్టంలో ఝాన్సీరాణి లక్ష్మీబాయికి ప్రతిరూపంగా కీలక భూమికను పోషించిన ఘనత దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారిబాయికే దక్కుతుంది. బుందేల్‌ఖండ్ ప్రాం తంలో ప్రజలు పాడుకునే జానపద బాణీల్లో ఝాన్సీలక్ష్మీబాయి సరసన ఝల్కారిబాయి సాహసాలను పాటల రూపంలో నేటికీ గుర్తుచేసుకోవడం విశేషం.

ఝాన్సీ సమీపంలోని భోజ్‌లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునాదేవి దంపతులకు నిరుపేద వ్యవసాయకూలీ కుటుంబంలో 1830 నవంబర్ 22న జన్మిం చిన ఝల్కారిబాయి వీరనారిగా ఎదిగి, నేడు దళిత బహుజనుల ఆత్మగౌరవ పతాకగా మారింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము వంటి యుద్ధ విద్యలు నేర్చుకుంది. అడవిలో పశువులను మేపుతున్న ఝల్కారిపై దాడి చేసిన చిరుత పులిని కేవలం చేతికర్రతో చాకచక్యంగా హతమార్చిన ఘటన సంచలనం రేపింది. ఝాన్సీలక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేస్తున్న పూరణ్‌సింగ్‌ను వివాహం చేసుకున్న ఝల్కారిబాయి, తదనంతర కాలంలో లక్ష్మీబాయికి సన్నిహితమై సైన్యంలో చేరి ‘దుర్గావాహిని’ మహిళా సాయుధ దళానికి నాయకత్వం వహించింది.

సిపాయి తిరుగుబాటు సందర్భంగా శత్రుసేనలతో జరిగిన యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1858 ఏప్రిల్ 3న బ్రిటిష్ జనరల్ హగ్ రోజ్ నాయకత్వంలో బ్రిటిష్ సేనలు ఝాన్నీ రాజ్యాన్ని చుట్టుముట్టాయి. ఆ దాడి నుంచి లక్ష్మీబాయి సురక్షితంగా తప్పించుకుని కల్పి ప్రాంతంలో పోరాడుతున్న తిరుగుబాటు నాయకులను కలుసుకోవడానికి అనువుగా, ఝల్కారీబాయి తానే ఝాన్సీలక్ష్మీబాయినంటూ కోట ముందు ప్రత్యక్షమై బ్రిటిష్ సేనలను ముప్పుతిప్పలు పెట్టింది. ఆ దాడిలో ఝాన్సీలక్ష్మీబాయి రూపంలో బందీగా పట్టుబడ్డ ఝల్కారిబాయిని గుర్తుపట్టిన బ్రిటిష్ సేనలు, తదనంతర కాలంలో ఆమెను విడిచిపెట్టారా లేదా చంపేశారా అన్నది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఝల్కారిబాయి సాహసంతో స్ఫూర్తి పొందిన దళిత బహుజన రాజకీయ పార్టీల కార్యకర్తలు నేడు క్షేత్రస్థాయిలో ఝల్కారిబాయి జీవితాన్ని, పోరాట ఘట్టాలను నాటకాలు, కథలుగా మలచి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, ఆమె జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం గమనార్హం.

మూలం: వికీపిడియా

4 comments:

  1. ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి.

    ReplyDelete
  2. Great. Such an Daring lady. Thanks for posting. Till now I don't know who she is???

    ReplyDelete
  3. Today every girl should take this type of inspiration from many women.like jalkari bhai, lakshmi bhai.

    ReplyDelete
  4. Inspiring mata jhalkari bhai

    ReplyDelete