Breaking News

ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఆచార్య బిఆర్‌ (Barri Ramachander Rao)


  • పరిశోధనలతో విశాఖ ఖ్యాతిని, ఏయూ విశిష్టతను పెంచిన మేధావి.


బెస్తవారి పల్లెలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తి తన అసమాన ప్రతిభా పాటవాలతో ప్రపంచ ప్రశంసలను అందుకున్నారు. తన మేథస్సుతో, తన పరిశోధనలతో ఈ నేల ఖ్యాతిని, పుట్టిన జాతి విశిష్టతను పెంచారు. ఉత్తమ అధ్యాపకుడిగా, ప్రయోజనకరమైన పరిశో ధకుడిగా, చైతన్యవంతమైన రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొంది పరోక్షంగా ఉత్తరాంధ్ర నేల ప్రతిష్టను, తాను గడిపిన ఏయూ ఖ్యాతిని మరింతగా పెంచారు. ఆయనే ఆచార్య బిఆర్‌గా పిలువబడే ప్రొఫెసర్‌ బర్రి రామచంద్రరావు.

ఐనావరణంలో అంతర్జాతీయ పేరుగాంచిన శాస్త్ర వేత్తగా, రోదసీ రంగాన ప్రసిద్ధ పరిశోధకుడిగా ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న ప్రొఫెసర్‌ బిఆర్‌ 1922 నవంబరు 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలిలో మత్స్యకార కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనూ, హైస్కూల్‌, ఇంటర్మీడియట్‌ విద్యను విశాఖలో చదివి బిఎస్సీ(ఆనర్స్‌)ని ఏయూ నుంచి పూర్తి చేశారు. ఎంఎస్సీ(ఫిజిక్స్‌) పట్టాను 1945లో ఏయూ నుంచి అందుకొని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సూరి భగవంతం నేతృత్వంలో పరిశోధన ఏయూలోనే ప్రారం భించారు. ఆల్ట్రాసోనిక్‌ కిరణాలు...వాటి పయనం అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకుగాను 1949లో ఏయూ డాక్టరేట్‌ను ప్రకటించింది.

అంతర్జాతీయ అధ్యయనకారునిగా.... : ఆచార్య బిఆర్‌ రావు మూడు పదులకే అంతర్జాతీయ వేదికపై తన అధ్యయనాలను ప్రారంభించారు. కామన్‌వెల్త్‌ అసోసియే షన్‌ ఇచ్చే సీనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌కు 1951లో బిఆర్‌ ఎంపికయ్యారు. దీంతొ ఆస్ట్రేలియాలోని సిఎస్‌ఐఆర్‌ఓలో పరిశోధన చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ రీసెర్చి ఫెలో షిప్‌ ముగిసిన తరువాత అనేక విశ్వవిద్యాల యాల నుంచి అఫర్‌ వచ్చినప్పటికీ తనకు విద్యాబుద్ధులు నేర్పి తన ఉన్నతికి కారణమైన ఆంధ్ర కళామ్మతల్లి సేవలో తరించాలనే తపనతో తిరిగి విశాఖకు వచ్చేశారు.

విశిష్ట అధ్యయనాలతో పునీతమైన ఏయూ... : భౌతిక శాస్త్ర బోధకుడిగా తన పయనాన్ని ఏయూలో కొనసాగిస్తూనే పలు పరిశోధనలకు నాంది పలికారు ఆచార్య బిఆర్‌. ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, అల్ట్రాసోనిక్స్‌, స్పేస్‌ సైన్స్‌లో ఆయన చేసిన అధ్యయ నాలు నాటికీ, ఎన్నటికీ ప్రశంసనీ యమైన ప్రయో గాలుగా నిలిచి పోయాయి. స్పేస్‌ ఫిజిక్స్‌ ప్రయోగ శాలను ఏయూలో ఏర్పాటు చేసి భారతదేశంలో ఆ అధ్యయనాలకు నాంది పలికారు. నేటి రాడార్‌ వ్యవస్థ పనితీరుకు, శాటిలైట్‌ రేడియో విధానానికి ఆచార్య బిఆర్‌ తొలిరోజుల్లోనే ఏయూ వేదికగా బీజం వేశారు. సుమారు 40 మంది పరిశోధకులు బిఆర్‌ నేతృత్వంలో పిహెచ్‌డి పట్టా లను అందుకున్నారు.

రాజ్యసభ సభ్యునిగా, జాతీయ నేతగా.... : ఆచార్య బిఆర్‌ రావును ఎన్నో పురస్కారాలు, పదవులు వరించాయి. దేశంలో అత్యున్నత సభ అయిన రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం లభించింది. బెస్తవారి పల్లెలో పుట్టి పెద్దల సభకు వెళ్లడం వెనుక ఆయన మేథస్సే కారణం. 1982లో జరిగిన భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సమా వేశాలకు ఈయన అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా నాటి ప్రధాని ఇంధిరాగాంధీ హాజరయ్యారు. ఆచార్య బిఆర్‌ ప్రతిభ, బయోడేటా చూసి ముగ్ధురాలై అదే ఏడాది రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగి ఎంతో హూందాగా, రాజనీతిజ్ఞుడిగా ఖ్యాతి గాంచారు. మరో వైపు బిఆర్‌ ముం గిట ఎన్నో పద వులు వచ్చి వాలాయి. విశ్వ విద్యాలయాలకు పెద్దదిక్కు అయిన యు.జి.సికి రెండు పర్యాయాలు వైస్‌ ఛైర్మన్‌గా ( 1976 నుంచి 1982 వరకూ) వ్యవ హరించే అవ కాశం లభిం చింది. 1965లో ప్రతిష్టాత్మకమైన 'శాంతిస్వరూప్‌ భట్నాగర్‌' అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహదారునిగా, పలు జాతీయ పరిశోధన సంస్థలకు గౌరవ ఆచార్యునిగా, సలహ దారునిగా వ్యవహరించారు. పలు ప్రతిష్టాత్మకమైన జర్నల్స్‌కు 300కు పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు.

మత్సకారులకు అండగా..... : భారత జాతి గర్వించదగిన మేధావిగా ఖ్యాతిగాంచిన ఆచార్య బిఆర్‌ తన జాతికి కూడా జాతీయ ప్రతినిధిగా వ్యవహరించారు. తాను పుట్టిన మత్స్యకారుల ప్రగతికి, అభ్యున్నతికి తనవంతు కృషి చేశారు. వారి సమస్యలను ఢిల్లీ స్థాయిలో వినిపించేందుకు నిరంతరం ప్రయ త్నించారు. జాతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడిగా, జాతీయ మత్స్య పారిశ్రామిక సలహా బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించి మత్స్యకారుల ఆధునిక జీవనానికి, వృత్తి గమనం పెంపునకు ప్రణాళికలు రూపొందించి ఆర్థికంగా, హార్థికంగా వారిని తన హాయంలో ఆదుకున్నారు.

విస్మరించిన పాలకులు... : తెలుగువారికి, భారత దేశానికి తన మేథస్సుతో గుర్తింపును తీసుకు వచ్చిన ఆచార్య బిఆర్‌ను సరైన రీతిలో గౌరవించడంలో మన పాలకులు మరిచారనే చెప్పవచ్చు. పద్మభూషణ్‌ వంటి అవార్డులను ప్రకటించకుండా కేంద్ర సర్కార్‌ ఘోర తప్పిదమే చేసింది. రాష్ట్ర ప్రభుత్వంగాని, రాష్ట్ర ఉన్నత విద్యామండలిగాని ఆయని సేవలను తగు రీతిలో గుర్తించ లేదు. తన ఖ్యాతి పెంచిన ఏయూ మాత్రం 1970లో ఆచార్య బిఆర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అర్హత లేని వారి, అర్హులు కాని వారి విగ్రహాలతో నిండి పోతున్న ఏయూలో బిఆర్‌ విగ్రహం మాత్రం లేకపోవడం ఒక వెలితే. ఒక భవనానికిగాని, పరిశోధనా కేంద్రానికి గాని ఆయన పేరు పెట్టకపోవడం ఆయన అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. దేశ విదేశాలకు చెందిన 9 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఘనత గల ఆచార్య రామచంద్రరావు విగ్రహాన్ని ఏయూ లోనూ, బీచ్‌రోడ్‌లోనూ ఏర్పాటు చేసినట్లయితే విశాఖకే అది ఎంతో గౌరవం. ఏదైనా కేంద్ర పరిశోధనా సంస్థకు ఆయన పేరును నామకరణం చేసి, ఆయన పేరిట ఫెలోషిప్‌లను ఏర్పాటు చేసినట్లయితే అదే ఆయనకు మనం అందించే ఘనమైన నివాళి. పాఠశాల విద్యార్థులకు బిఆర్‌ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేసి, ఆయన పేరిట తపాలా బిళ్లను, స్మారక ఉపన్యాస ఛైర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆప్పుడే ఉత్త రాంధ్రకు, వెనుకబడిన వర్గాల మేథస్సుకు ఒక గుర్తింపు లభించినట్లవుతోంది. 

డాక్టర్‌ గుంట లీలావరప్రసాదరావు
- వ్యాసకర్త : లెక్చరర్‌, జర్నలిజం పీజీ విభాగం, ఎస్‌వివిపి విఎంసి కళాశాల, విశాఖ.
మూలం: విశాలాంధ్ర దినపత్రిక.

5 comments:

  1. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఆచార్య బిఆర్‌.

    ReplyDelete
  2. I am student of AU. Thanks for posting life history such a great person.

    ReplyDelete
  3. How do you know about br sir

    ReplyDelete
  4. uttarandra muddubidda ku namaskaaraalu
    vishayaanni prajalaku teliyajesina vaariki dandaalu

    ReplyDelete