అంతర్జాతీయ మహిళా దినోత్సవం - About International Womens Day in Telugu
మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా..
మహిళలకు అధికారం, డబ్బు, హోదాలవల్ల గౌరవం, విలువ కలుగుతాయా? పాశ్చాత్య ప్రపంచంలో ఇంతకు ముందు మహిళలకు ఎలాంటి హక్కులు, విలువ లేవు. అందుకే ఇప్పుడు ‘మహిళా సాధికారత’ అంటూ వాటిని కలిగించే ప్రయత్నం ఆ సమాజుల్లో జరిగింది. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మహిళలకు మన సమాజంలో మొదట నుంచీ గౌరవస్థానం ఉంది.
కానీ మనదేశంలో కూడా ‘మహిళా సాధికారత గురించి, మహిళా హక్కుల గురించి గట్టిగా మాట్లాడేవాళ్ళు, ఉద్యమాలు సాగించేవారు ఉన్నారు. వీళ్ళు పాశ్చాత్య పద్ధతులను అనుసరించి మహిళల్ని పైకి తీసుకురావాలని తాపత్రయపడుతుంటారు.
మహిళలకు హక్కులు కల్పించి, వారి హోదాను పెంచాలన్న ఆలోచన, ప్రయత్నం స్వీడన్, నార్వే, ఫిలాండ్, డెన్మార్క్ మొదలైన పశ్చిమ యూరప్ దేశాల్లో ప్రారంభమైంది.
స్వేచ్ఛ, సమానత్వ, హక్కులు సాధించిన పాశ్చాత్య స్త్రీలు కుటుంబ జీవితాన్ని కోల్పోతున్నారు. ఎవరైనా తమకు ‘నచ్చిన విధంగా’ జీవించవచ్చనే ధోరణి కుటుంబ వ్యవస్థకు చోటులేకుండా చేసింది. పెళ్ళి కాకుండా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు తాతముత్తాతలు ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ జీవితం, సాంస్కృతిక జీవితం కోల్పోయిన తరువాత ఎన్ని హక్కులు, ఎంత స్వేచ్ఛ పొందినా ఏం లాభం? సమాజంలో మహిళల గౌరవం వీటివల్ల ఏమాత్రమైనా పెరిగిందా? అన్ని రకాల అధికారాలు, హక్కులు పొందినా స్వీడన్ లో మహిళలు శారీరకమైన, మానసికమైన హింసకు గురవుతూనే ఉన్నారు.
ప్రపంచంలో అత్యధిక స్థాయిలో హింసకు గురవుతున్నది స్వీడన్ మహిళలే. 67శాతం మంది గృహహింస బారిన పడుతున్నారు. వారిని హింసిస్తున్నది ఎవరు? ఈ ‘స్వేచ్ఛా స్త్రీలను • హింసిస్తున్నది ఎవరోకాదు వాళ్ళు సహజీవనం సాగిస్తున్న ‘భాగస్వాములే’. దీనినిబట్టి అపరిమితమైన – ఆర్థిక స్వేచ్ఛ, పదవీ అధికారాలు, హోదా వంటివన్నీ వారిని రక్షించలేక పోతున్నాయని తెలుస్తోంది. పదవి, అధికారం, హక్కులు గౌరవాన్ని, విలువను కలిగించ లేవని స్పష్టమవుతోంది. స్త్రీలను గౌరవించడం సహజంగా తెలిసిన, అలవాటు ఉన్న సమాజాల్లో ప్రత్యేకంగా వారికి హక్కులు, స్వేచ్ఛ కలిగించాల్సిన అవసరం రాదు. సంప్రదాయ సాంస్కృతిక జీవనం కలిగిన సమాజాల్లో ఇలాంటి సహజ గౌరవం స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇవి లేని పాశ్చాత్య సమాజాల్లో గౌరవాన్ని తెచ్చుకునేందుకు ప్రత్యేక ప్రయత్నం అవసరమవుతుంది. అలాంటి ప్రయత్నం బాగా చేసినప్పటికీ స్త్రీల స్థితిగతుల్లో పెద్దగా మార్పు రాకపోవడం స్వీడన్ వంటి దేశాల్ని చూసే తెలుస్తుంది.
కీర్తి ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకు చాలా తేడా ఉంది. కీర్తిప్రతిష్టలు వ్యక్తిగతమైనవి. ఒక మహిళ పేరుగడిస్తే (అధికారం, హోదా, డబ్బువల్ల) అది మహిళలందరకూ చెందదు. గుణగణాలు మాత్రమే మహిళలందరికీ గౌరవాన్ని తెస్తాయి.
ఈ గుణగణాలే మహిళల అభివృద్ధికి అడ్డంకి అనే ఆలోచన పాశ్చాత్య ప్రపంచం నుంచి దిగుమతైంది. క్రమంగా మన దేశంలో కూడా బలపడుతోంది. సహనం, త్యాగభావన, కుటుంబం కోసం కష్టపడడం వంటి గుణాలు లేని వారు ‘స్వేచ్ఛ’ను పొందిన మహిళలుగా పేరు పొందుతున్నారు. జాతీయకవి సుబ్రమణ్యభారతి కోరుకున్న మహిళా ప్రగతి స్వేచ్ఛ ఇవి కావు. జాతీయ సంస్కృతీ విలువల రక్షణలో స్త్రీలకు తగిన గౌరవం మర్యాద లభించాలని మహాకవి భారతి ఆశించారు. కానీ నేటి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు పొందిన స్త్రీ సాంస్కృతిక విలువల క్షీణతకి ప్రతీకగా మారుతోంది
మగవారిలా దుస్తులు ధరించడం, వారితో పాటు మద్యం సేవించడం, ధూమపానం చేయడమే స్వేచ్ఛ, సమానత్యాలుగా చెలామణీ అవుతున్నాయి. పాశ్చత్య దేశాల్లో మాదిరిగా మనం దేశంలో కూడా మహిలు ఇలా ప్రగతి సాధిస్తున్నారంటూ పత్రికలు వ్యాసాలు రాస్తున్నాయి. టీవీలు ఊదరకొడుతున్నాయి.
మన దేశంలో అనేక కులాలు, భాషలు ప్రాంతాల వారు జీవిస్తున్నారు. అయినా వీరందరిలో ఒకే విధమైన జీవన విలువలు కనిపిస్తాయి. అదే మన సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ వ్యవస్థ. ఇవే మన బలం. సమాజం మతం, కుటుంబం పరస్పర ఆధారితాలు. ఈ మూడింటికి కేంద్రం మహిళలు. ఎన్ని మార్పులు సంక్షోభాలు వచ్చినా మహిళలే మన సంస్కృతీ సభ్యతలు, కుటుంబాలను కాపాడారు. ఇటువంటి మత-సామాజిక వ్యవస్థ పాశ్చాత్య సమాజాల్లో లేదు. అక్కడ మహిళలకు సంస్కృతిపరమైన రక్షణ లేదు. అందువల్ల ప్రభుత్వమే చట్టాల ద్వారా రక్షణ కల్పించాల్సి వచ్చింది. కనుక అలాంటి స్థితిని మన దేశంలో కోరుకోవడం వినాశనాన్ని స్వాగతించడమే అవుతుంది. సమాజం, మతం, కుటుంబం మూడు వ్యవస్థలే పాశ్చత్య సాంస్కృతిక దాడి నుంచి మనల్ని కాపాడతాయి. ఈ మూడింటిని నిలబెడుతున్నది మహిళలే. నిజానికి అవే మహిళలకు రక్ష.
–ఎస్.గురుమూర్తి
లోకహితం సౌజన్యంతో..
సంస్కృతే శ్రీరామరక్ష
ReplyDelete