గురునానక్ జీవిత చరిత్ర - Guru Nanak Life Story in Telugu
‘నేను మనుషులను మాత్రమే చూస్తున్నాను. అతడు ధరించిన మతపరమైన దుస్తులు, విశ్వాసాలతో నిమిత్తంలేదు’ అన్న గురునానక్ మానవతావాదానికి, పరమత సమాదరణకు ప్రతీక. గురుశిష్య సంబంధాలను పటిష్ఠ పరుస్తూ సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు ధర్మాన్ని ప్రతిపాదించారు. ఆయన రూపొందించిన అది మతం సర్వ సమ్మతమై గురుగోవింద సింగ్ వరకు పదిమంది గురువుల నేతృత్వంలో వికసించింది. నేటికి వర్థిల్లుతోంది.
నేటి పాకిస్తాన్‌లోని రావీ నదీతీరంలోని నానక్ సాహిబ్‌లో సంప్రదాయ కుటుంబంలో 1469లో జన్మించిన నానక్ ఐదేళ్ల వయస్సు నుంచే నిరంతరం దైవ నామస్మరణ చేస్తుండేవారట. చిన్నతనం నుంచి ప్రశ్నించి, ఆలోచించే తత్త్వంతో కలిగిన ఆయన హిందూమతంలోని తాత్త్త్వికత పట్ల ఆకర్షితులై జీవిత రహస్యాల అన్వేషణకు ఇల్లు వదలివెళ్లారు. హిందూ-ముస్లిం గురువుల వద్ద చదువుకున్న ఆయన స్వమతంతో పాటు ఇస్లామియా మత గ్రంథాలను అధ్యయనం చేశారు. రెండు మతాల ఆధ్యాత్మిక విషయాల పట్ల లోతైన అవగాహన సాధించారు. లోకంలోని మూఢాచారాలను మతం పేరిట జరిగే అనాచారాలుగా భావించి వాటిని వ్యతిరేకించారు. ఇరు మతాలలోని మంచిని, దాని ఆచరణలోని లోపాలను గమనించి సరళమైన ధోరణిలో ఆధ్యాత్మికత ప్రబోధానికి ఉపక్రమించారు. అలా ప్రజల భాషలో చేస్తున్న ధర్మప్రచారంతో ప్రభావితులైన వారు తమలోని లోపాలను సరిదిద్దుకునే వారట. అలా ఆయనను అనుసరించిన వారిని సిక్కులుగా వ్యవహరించసాగారు. సిక్కు అనేది శిష్య అనే సంస్కృత పదానికి లౌకిక భాషారూపంగా చెబుతారు. అతనికి గురువే దేవుడు. ఆయన చెప్పే మంచే దైవం. గురువుల వాక్కుల ఆధారంగా పవిత్రజీవితాన్ని కొనసాగించాలి. ఎక్కడో ఉన్న దేవుడి కంటే మనిషిలోని మానవత్వమే మిన్న అనే కోణంలో సామాజిక బాధ్యతను ఆధ్యాత్మికతో ముడిపెట్టి బోధించారు నానక్. గురుశిష్య సంబంధం సర్వమతా లకు వర్తిస్తుంది. ప్రజలు నానక్‌ను గురువుగా భావిస్తూ ఆయనను అనుసరించారు కనుక శిష్యుల పేరిట సిక్కు మతం రూపుదిద్దుకుంది. ఈ మతం ప్రకారం గురువాజ్ఞనే దైవసూచనగా పాటించాలి. గురువు పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. గురు ప్రబోధ•ంతోనే దైవం సర్వత్రా వ్యాపించి ఉన్నాడని, శిష్యరికం జీవిత సార్థకత ఉందని నమ్ముతారు.
అది ఏకేశ్వరోపాసక మతం. ఏక్ ఓంకార్ (ఏకైక దేవుడు) అని నమ్ముతుంది. ‘ఓంకారం మాదిరిగా భగవంతుడు ఒక్కడే. ఆయన సర్వాంతర్యామి. జీవకోటికి తండ్రిలాంటివాడు. అందరిలో, అన్నిటిలో పరమాత్ముని చూడగలినవారే భగవత్ కృపకు పాత్రులవుతారు. దేవుడు బాహ్యాచారాల వల్ల కాకుండా మానసిక సాధన ద్వారానే ప్రీతిచెందుతాడు. అహం, గర్వం, కోరికలు వదిలి అందరితో ప్రేమపూర్వకంగా మెలగాలి. సమభావం కలిగి ఉండాలి’ అని ప్రబోధించారు నానక్.
ఈ ‘సంత్’ మతంలో గురువుకే ప్రముఖ స్థానం. ‘సంత్’ అంటే ఆత్మజ్ఞానం కలిగినవాడు, అనుభశాలి అయిన మహనీయుడు అని అర్థం. సంత్ సంప్రదాయంలో కబీర్‌ను ప్రముఖంగా చెబుతారు. అయితే ఆయనకు గురువంటూ ప్రత్యేకంగా లేరని, సజ్జన సాంగత్యంలో అనేకానేక విషయాలను అవగతం చేసుకొంటూ తనను తాను తీర్చిదిద్దుకున్నారని చెబుతారు. కబీర్‌దాస్, రవిదాస్ లాంటి ముఖ్య తత్త్వవేత్తలు, బోధకులను దర్శించారు. నానక్‌కు కూడా ప్రత్యేకంగా గురువు లేకపోయినా కబీర్ బోధనలతో ప్రభావితులయ్యారని చెబుతారు. మతాచారాలను పాటించడం కంటే సదా భగవత్ స్మరణ మిన్న అని భావించేవారు.
ప్రపంచ వ్యాప్తంగా పలువురు మతబోధకులు, మతప్రవక్తలు తమతమ విశ్వాసాలు, అవగాహన, వ్యక్తీకరణలను మేళవించి కొన్ని సూత్రాలు, నియమాలు నిర్దేశించారు. ఆయా మతాల వారు వాటిని పాటించడం వరకు ఇబ్బందిలేదు. ‘స్వమతాన్ని గౌరవించు, పరమతాన్ని ప్రేమించు’ అనే హితోక్తికి స్వస్తి పలుకుతూ, సమభావనకు తమకు తామే అడ్డుగోడలు కట్టుకోవడం మొదలైతే అరాచకానికి దారితీస్తుంది. ఇలాంటి కుహనా ఆధ్యాత్మిక అహంకారం కారణంగా సంఘర్షణలకు ఆస్కారం కలుగుతుంది. ఎవరికి వారు తమ విశ్వాసాలను ఉన్నతంగా భావించవచ్చు కానీ ఇతరుల విశ్వాసాల పట్ల చులకన భావంతో వ్యవహరించడం ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు గురునానక్.
నానక్ తండ్రి మెహతా కాలూచంద్ ఖత్రీ,తల్లి తృప్తాదేవి. బీబీ నాన్కీ అనే అక్క. ఆమె అత్యంత పిన్నవయస్సులోనే తమ్ముడిలో దైవత్వాన్ని చూడగలిగారు. అప్పట్లో ఆమె దీనిని బహిర్గతం చేయకపోయినా, అనంతర కాలంలో గురునానక్‌జీ తొలి శిష్యురాలిగా పేరుపొందారు. 28 ఏళ్ల వయస్సులో ఒక రోజు ఉదయం నదీస్నానం, ధ్యానానికి వెళ్లిన నానక్ గురించి మూడు రోజుల వరకు జాడలేదు. తిరిగి వచ్చాక ‘దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను’ అని ప్రకటించారు. ఆ కాలంలో హిందూ-ముస్లిం ధర్మాల మధ్య ఘర్షణలు, కొట్లాటలు చెలరేగుతుండేవి. ఆ నేపథ్యంలో ‘లోకంలో ఆ రెండు మతాల వారు లేనేలేరు. కుల మత వర్ణ వర్గ ధనికపేద ప్రాంత భేదాలు లేవు. ఉన్నదంతా మానవత, సమత, మమత. అవే మన అభిమతం కావాలి. వాటిని ప్రబోధించేందుకే నేనీ లోకానికి వచ్చాను’ అని ప్రకటించారు. కేవలం మాటలతో మతం లేదని, మానవులందరినీ సమంగా చూసేవాడే భక్తిపరుడని, తోటివారి ప్రేమను పొందకలిగిన వారే బగవంతుడిని చూడగలరని ప్రభోధించారు. మతసామరస్యాన్ని ప్రబోధించేందుకు నాలుగుసార్లు ప్రపంచ యాత్రలు చేశారు. వీటిని ‘ఉదాసీ’ యాత్రలు అంటారు.
సిక్కుల ఐదవ గురువు అర్జున్ తన పూర్వ గురువులు అనుగ్రహించిన సూక్తులను, బోధనలను ‘గురు గ్రంథ సాహిబ్’గా సంకలనం చేశారు. అందులో దాదాపు ఐదున్నర శతాబ్దాల కిందట గురునానక్ చేసిన బోధనలు, సూక్తులు నిత్యసత్యాలని, దాదాపు ప్రతి మానవుడు ఆచరించదగినవని సార్వజనీనం, సర్వకాలీనం అనిపిస్తాయి. ప్రతికాలానికి వర్తించేలా ఉంటాయి. గురు గ్రంథాన్ని పూజించడం, పఠించడం అంటే గురుపరంను గౌరవించడం, వారి సూక్తిమార్గాన్ని అనుసరించడమే అని సిక్కులు విశ్వసిస్తారు.
కష్టించి, న్యాయమార్గంలోనే ధనాన్ని ఆర్జించాలి. నిజాయితీగా ఆర్జిస్తూ అవసరార్థులను ఆదుకోవాలని నానక్ బోధించారు. పనిచేసే వాడికే తినే హక్కు ఉంటుందని ఆనాడే చెప్పారు. సమాజంలో పేరున్నా పొలాల పనిచేస్తూ జీవనం సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గురుద్వార్‌లలో నేలను తుడవడం, పాత్రలను శుభ్రపరచడం, నీటిని వంట గదికి చేర్చడం వంటివాటిని సేవా కార్యక్రమాలుగా గురునానక్ ప్రారంభించారు. లోభత్వాన్ని తరిమికొట్టాలి అంటూ కుల, మత, ధనిక, పేద అంశాలకు అతీతంగా ఆహారాన్ని పంచుకునేవారు. ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదని, స్త్రీపురుషులు సమానులేనని ముఖ్యంగా మహిళలను గౌరవించాలని ఉపదేశించారు. ‘సంపాదన అవసరమే కానీ సంపాదనే పరమార్థం కాదు. అక్రమ ఆర్జన అరిష్టదాయకం. ముఖ్యంగా సమాజ హితాన్నికాదని దోచుకొని దాచుకోవడం సరికాదు. డబ్బు జేబుకే పరిమితం కావాలి తప్ప హృదయానికి తాకకూడదు. అలా జరిగితే అనేక సమస్యలు చుట్టుముడతాయి. మానసిక వ్యాకులతను పక్కనపెట్టి నిత్యం ప్రసన్నంగా ఉండాలి’ అన్న నానక్‌జీ నాటి పలుకులలోని వాతావరణం నేటి సమాజ పోకడలో కనిపించకమానదు.
ఆదర్శ ప్రబోధకులు
గురునానక్ ఆదర్శ ప్రబోధకులు. సమర్థ పాలకులతోనే సుపరిపాలన అందుతుందన్నట్లే సమర్థ గురువులతోనే జ్ఞానం సమాజాన్ని వికసింపచేస్తుందని విశ్వసించారు.
అలాంటి జ్ఞానప్రదాతల ఎంపికలో వారసత్వం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోరాదన్నది ఆయన భావనగా కనిపిస్తుంది. రక్తసంబంధీకులలో తన ప్రతిభాసంపత్తిని ఒడిసి పట్టిన వారు ఉంటే ఉండవచ్చు కానీ అంతకు మించి ఆత్మజ్ఞానం, అనుభవం కలవారి వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని భావించి ఉంటారు. అందుకే ఆయనకు శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు ఉన్నప్పటికీ గురుపరంపర వారసులుగా వారిని ప్రకటించలేదు. తన శిష్యుడు లెహ్నాను (1538) గురుపీఠం వారసునిగా ఎంపిక చేశారు. లెహ్నా గురు అంగద్‌గా ప్రసిద్ధులు. తరువాతి తరాలు ఆ వారసత్వాన్ని కొనసాగించి ప్రసిద్ధులయ్యారు.
– ఎ.రామచంద్ర రామానుజ
ఆదర్శ ప్రబోధకులు నానక్
ReplyDelete