Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు


1948 జనవరి 30 న గాంధీ హత్య జరిగింది. ఆ నెపం మీద సంఘంపై నిషేధం విధించింది నెహ్రూ ప్రభుత్వం. ఆ సందర్భంగా శ్రీ గురూజీని అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. జైలులో ఉన్నపుడు మీరు పర్యటన చేయలేక పోయారు గదా? అని ఎవరో ఆయనను ప్రశ్నించారు. దానికి శ్రీ గురూజీ ' లేదు. అయినా అపుడుకూడా నేను పర్యటన చేశాను. ప్రభుత్వ ' దయ ' తో ఈ శరీరంతో పర్యటన చేయలేకపోవడం నిజమే. కానీ జైలులో ఉండగా ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంతం, అందులో ఒక్కొక్క ఊరును స్మరిస్తూ అక్కడి స్థానిక కార్యకర్తలతో మనసులోనే చర్చలు జరుపుతుండేవాడిని ' అన్నారు.
పర్యటన పట్ల ఆయన మనసులోని నిబద్ధతకు ఈ మాటలే సాక్ష్యం.




గాంధీజీ హత్య జరిగిన తర్వాత శ్రీ గురూజీ బెంగళూరు నుండి హుబ్బళ్ళి కి వెళ్తున్నారు. దారి మధ్యలో దావణగెరె కు తెల్లవారుజామున రైలు చేరుకుంది. ఆయనను చూడటానికి స్వయంసేవకులు రాగా, కొందరు సంఘ వ్యతిరేకులు ధర్నా చేయడానికి వచ్చారు. వాళ్ళు శ్రీ గురూజీ కి వినబడేలా ' ఆరెస్సెస్ గూండా హై ' అని నినాదాలు ఇస్తున్నారు. దానికి ప్రతిక్రియగా శ్రీ గురూజీ ' ఫర్వాలేదే. దావణగెరె వాళ్ళకు ఒక్కటైనా హిందీ వాక్యం వస్తుందిగదా. అదే సంతోషం' అని హాస్యంగా అన్నారు.





గాంధీ హత్య తర్వాత శ్రీ గురూజీ సాంగ్లి కి వెళ్ళారు. ' గాంధీ హంతకులు సాంగ్లి కి వస్తున్నారు ' అనే అపప్రచారంతో ధర్నా చేయడానికి సంఘ వ్యతిరేకులు గ్రామప్రజలను తీసుకొచ్చారు. శ్రీ గురూజీకి వ్యవస్థ ఏర్పాటైన మహారాష్ట్ర ప్రాంత సంఘచాలక్ శ్రీ కాశీనాథపంత్ లిమయే ఇంటి ముందు అందరూ గుమిగూడారు. పరిస్థితిని నిభాయించడానికి స్వయంసేవకులు నిలబడ్డారు. కాసేపటికి ఆందోళనకారులు వెళ్ళిపోయారు. 
కాసేపటి తర్వాత ఊరిలో శవయాత్ర. తమ మొదటి ప్రయత్నం విఫలమైనందున ఆందోళనకారులు ఏర్పాటుచేసుకున్న మరో కార్యక్రమమది. ' గురూజీ శవయాత్ర 'అంటూ, శ్రీ గురూజీ విడిది చేసిన ఇంటి ముందునుండి అది సాగిపోయింది. ఇంటి మేడ మీద నుండి శ్రీ గురూజీ , ఆ శవయాత్రను చూశారు. పక్కనే తనకు ప్రబంధక్ గా ఉన్న యువకుడు డా. భగవాన్ రావ్ వఝె ( తర్వాతి కాలంలో బెళగావి జిల్లా యడూరు సంఘచాలక్ అయ్యారు)కు ఆ శవయాత్రను చూపుతూ, చూశావా భగవాన్ , ఇదికూడా ఒక భాగ్యమే కదా? సాధారణంగా మనం మరొకరి శవయాత్రను చూస్తాం. అయితే ఇక్కడ చూడు. నా శవయాత్రను నేనే చూస్తున్నాను. నీకూ చూపిస్తున్నాను. ఇలాంటి భాగ్యం ఎవరికైనా దొరకడం సాధ్యమా? ' అన్నారు.






1956లో శ్రీ గురూజీ 51 వ జన్మదినం రాబోతున్నందున జనవరి నుండి ప్రారంభించి జన్మదినం రోజున అంతమయ్యేలా జన సంపర్క అభియాన్ జరిగింది. శ్రద్ధానిధి సేకరించడం జరిగింది. ఆ సంవత్సరం మార్చి 12 న శ్రీ గురూజీ జన్మదినం వచ్చినందున మొదటి సార్వజనిక సన్మాన కార్యక్రమం నాగపూర్ లో జరిగింది. ఆ తర్వాత అన్ని ప్రాంత కేంద్రాలలో జరిగాయి. మార్చి 30 న బెంగళూరులో కార్యక్రమం. వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఆయన చెప్పిన మాటలివి: ' తపాలాపెట్టె అందరినుండి ఉత్తరాలను స్వీకరించి తర్వాత సంబంధితుల చిరునామాలకు వాటిని చేర్చే వ్యవస్థ చేస్తుంది. ఈ కార్యక్రమంలో నా గురించి చెప్పబడిన ప్రశంసలకు నేనొక తపాలా పెట్టె ను మాత్రమే. సంఘపరంగా అన్నింటినీ స్వీకరించి సంబంధితులకు వాటిని చేరుస్తాను '.




1962 బెంగళూరు లో డిసెంబరు 8,9 తేదీలలో ప్రాంత తరుణ శిబిరం. డిశంబర్ 9న అల్పాహారానంతరం శ్రీ గురూజీ వసతిలో ప్రచారకుల బైఠక్. శ్రీ గురూజీ ముఖద్వారానికి ఎదురుగా కూర్చుని ఉన్నారు. బైఠక్ మధ్యలో ఉన్నట్టుండి శ్రీ గురూజీ లేచి బయటకు నడిచారు. కారణమేమిటంటే శిబిర మహాద్వారంలో స్వామి చిన్మయానంద కారు దిగి నడుచుకుంటూ రావడం వారు చూశారు. ఇరువురూ పరస్పర అభివాదనం చేయడంలోని తాపత్రయంతో ఒకే సమయంలో నేలను స్పర్శించారు. తర్వాత శ్రీ గురూజీ ,స్వామీజీ చేయి పట్టుకుని బైఠక్ జరిగే చోటకు తీసుకొచ్చి వారిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి , తాము పక్కనే క్రింద కూర్చున్నారు.




1966 ఫిబ్రవరి 10. విశ్వవసు సంవత్సర మాఘ బహుళ ఏకాదశి. ఆ రోజున శ్రీ గురూజీ షష్ట్యబ్ది. ఉత్కళ లోని బారిపద లో శ్రీ గురూజీ ఉన్నారు. కాబట్టి అక్కడే నిరాడంబర కార్యక్రమం జరిగింది. మొత్తం దేశం నుండి ఆహ్వానించబడ్డవారు కొంతమందే. కర్ణాటకనుండి శ్రీ యాదవరావు జోషీ, ప్రాంత సంఘచాలక్ శ్రీ కాకాసాహెబ్ కులకర్ణి, డా. నరసింహాచార్ మాత్రమే వెళ్ళారు. ఉదయాన్నే హోమహవనాల తర్వాత ఆహ్వానితులై వచ్చినవారు తమ శ్రద్ధకు ప్రతీకగా శ్రీ గురూజీ కి కానుకలిచ్చి సన్మానించారు. ఈ అపూర్వ సందర్భంకొరకే శ్రీ యాదవరావు జీ బెంగళూరు నుండి తీసుకెళ్ళిన కానుక ' బంచ్ ఆఫ్ థాట్స్ ' గ్రంథపు మొదటి ప్రతి. దాన్ని శ్రీ గురూజీ కి సమర్పించి సాష్టాంగ ప్రణామం చేశారాయన. అందులో ఉన్నవన్నీ శ్రీ గురూజీ ఆలోచనలే కాబట్టి శ్రీ యాదవరావు జీ ' త్వదీయ వస్తు మాధవా తుభ్యమేవ సమర్పయే' అనే భావంతో దాన్ని ఆయనకు సమర్పించారు. పుస్తకం తీసుకుని పేజీలు తిప్పేటపుడు శ్రీ గురూజీ ముఖంలో చిరునవ్వు ఆయన మెచ్చుకోలుకు సాక్షి అయింది.




శిరసి లో ప్రముఖ వ్యాపారి శ్రీ కాశీనాథ మూడి అనే కార్యకర్త ఇంట్లో మధ్యాహ్న భోజనం. హాస్యపు జల్లులతో భోజనం చేసేవారు, వడ్డించేవారు తడిసిపోయారు. నవ్వులే నవ్వులు. చివరకు శ్రీ గురూజీ యే ' చాలు చాలు, రెండవ పంక్తి వారు భోజనం చేయాలా వద్దా, చాలా సమయం అయింది ' అంటూ ఉత్తరాపోషణ స్వీకరించారు. తమ తప్పు ఆయనకు తెలిసి వచ్చింది ఆ తర్వాతే. భోజనానికి కూర్చున్నపుడు వడ్డించిన పదార్థాలన్నింటిని స్వీకరించి, విస్తరిని పూర్తిగా ఖాళీ చేసి లేవడం ఆయన అనుసరించే పద్ధతి. ఆ రోజు విస్తరి ఖాళీ అయింది కానీ మజ్జిగ నింపి పెట్టిన గ్లాసు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆయన మజ్జిగ త్రాగనేలేదు. వడ్డించిన ప్రతిదీ స్వీకరించాలనేది ఆయన నియమం కదా! అయితే మజ్జిగ అలాగే ఉండిపోయింది; ఆపోషణ తీసుకోవడమేమో జరిగిపోయింది. ఆపోషణ తర్వాత దేన్నీ తీసుకోరాదు. మొత్తం మీద ఆయనకు ఏం చేయాలో తోచలేదు. ఇపుడు వదిలేయాల్సింది వ్రతాన్నా లేక నియమాన్నా - దేన్ని? ఆయన ఇపుడేం చేయాలి? అనే ఆలోచనలో పడ్డారు. ఆయన పడుతున్న ఇబ్బంది ని పక్కనే కూర్చున్న శ్రీ కాశీనాథ మూడి గమనించారు. ఆయన వెంటనే శ్రీ గురూజీతో ' మీరేమీ చింతించకండి. మజ్జిగ అక్కడే ఉండనీయండి. నేను దాన్ని మీ ప్రసాదంగా స్వీకరిస్తాను ' అంటూ గ్లాసును ఎత్తి గటగటా మజ్జిగ త్రాగేశారు. ఆ తర్వాతే శ్రీ గురూజీ ' అన్నదాతా సుఖీభవ ' అంటూ లేచారు.





శ్రీ గురూజీ 1966 ఆగష్టు లో వైద్యచికిత్స కోసం శిరసికి వచ్చారు. ప్రతిరోజూ నూనెతో మాలిష్ చేయించుకునేవారు. ఆ తర్వాత రెండున్నర గంటలకు స్నానం చేయాలని డాక్టర్ల సలహా. ఒకరోజు ఏదో పని నిమిత్తం శ్రీ గురూజీ త్వరగా స్నానం చేయాలని భావించి , స్నానపు గదిలో వేడినీరు సిద్ధంగా ఉంచమని , ప్రబంధక్ గా ఉన్న శ్రీ శ్రీకృష్ణ భట్కల్ కు చెప్పారు. అయితే వైద్యులు చెప్పిన రెండున్నర గంటల కాలం ఇంకా కాలేదు. దాంతో ఆయన , ఎక్కడ సాధ్యమవుతుంది? ఇంకాపొయ్యి ముట్టించనేలేదు. నీరు వేడి అయితేగదా స్నానం! అన్నాడు శాంతంగా. ఆయన మాటలు విన్న శ్రీ గురూజీ నిరాశపడిపోయారు. పక్కన ఉన్నవారి వైపు తిరిగి, చూడండి! ఈ వ్యక్తి ( శ్రీ కృష్ణ భట్కల్ ) ఉన్నాడుగదా, అచ్చం నాకు అత్తలా ఉన్నాడు. నన్ను పూర్తిగా ఆరోగ్యవంతుడిని చేసిగానీ ఇక్కడినుండి పంపేది లేదు అని నిర్ణయించుకున్నట్లుంది అంటూ , తన అవసరాన్ని అతడు పట్టించుకోకపోవడంతో , తామే పరిస్థితికి లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. 
ప్రబంధక్ అంటే మాటలా మరి ! శ్రీ గురూజీకి కూడా ప్రబంధక్ పోటు తప్పలేదన్నమాట!!




1967 లో శిరసి లో శ్రీ గురూజీ అనారోగ్యానికి చికిత్స పొందుతున్న సందర్భమది. ఆయనను కలవడానికి అథణి సంఘచాలక్ అయిన డా.శ్రీ అనంతరావ్ దేశపాండే వచ్చారు. మాటల్లో ఆధ్యాత్మసాధన గురించి చర్చ మొదలైంది.

డా. దేశపాండే: ఆధ్యాత్మసాధన చేయడంవల్ల చేసే వారి స్వభావమేమైనా మారుతుందా?
శ్రీ గురూజీ: ఖచ్చితంగా...
డా. దే :నైతికత (Morality ) కూ ఆధ్యాత్మికత( Spirituality) కి సంబంధముందా? 
గు : తప్పకుండా ఉంది. ఆధ్యాత్మసాధనలో ముందుకు సాగిపోయేవారిలో నైతికస్థాయి కూడా ఉన్నతమవుతూ పోతుంది. 
డా.దే :ఒక వ్యక్తికి ఆధ్యాత్మసాధన మార్గంలో ఎదురయ్యే అడ్డంకులేమిటి? 
గు : ఆధ్యాత్మసాధనలో నిమగ్నమైన వ్యక్తికి , అతడి ప్రగతిమార్గంలో అష్టసిద్ధుల ప్రాప్తి అడ్డంకి అవుతుంది. దాని ప్రలోభంలో అతడు పడిపోకూడదు. ( అష్టసిద్ధులు: 
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా
ప్రాప్తి: ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయ:

అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట
మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట
గరిమ: శరీరము బరువు విపరీతంగా పెంచుట
లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట
ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట
ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట
ఈశత్వం: ఎవరిపైనైనా , దేనిపైనైనా అధికారం పొందుట
వశీత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట. )
డా.దే : అలాగైతే అపాయంలేని సాధనామార్గం ఏమిటి? 
గు : ' సామూహిక సాధన ' మార్గం. అందులో అష్టసిద్ధుల ప్రాప్తి అనే సమస్యే లేదు. సామూహిక సాధనలో అపాయం తక్కువ. సంఘసాధన, సంఘ కార్యక్రమం - ఇదే సామూహిక సాధనకు మార్గం. అందులో అపాయం లేదు మరియు అది ధ్యేయప్రాప్తికీ అనుకూలమైంది. 
డా. దే : కొన్నిసార్లు ఏదో ఒక విషయం గురించి మనసును ఏకాగ్రతకు లోనుచేసినపుడు నిద్ర వస్తుందిగదా? 
గు : మీరు చెప్పింది నిజమే. ధ్యానక్రియలో ఈ అడ్డంకి ఎదురయ్యేదే. అయితే ఆధ్యాత్మసాధనను బాగా అభ్యసించిన వారి నుండి మార్గదర్శనం పొంది దాన్ని నివారించుకోవాలి. 
డా.దే : గురువే లేకుండా లేదా ఎవరినీ గురువుగా స్వీకరించకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుందా? 
గు : అలాగా కూడా ప్రగతి సాధించడానికి అవకాశముంది. అయితే గురువు అంటే ఎవరు? ఎవరో ఒక వ్యక్తి గురువైనట్లే, ఒక గ్రంథమూ కావచ్చుగదా. సాధనాపథంలో ముందుకు సాగేటపుడు, నేనెంత ముందుకుపోయాను అనేది తెలుసుకోవడానికైనా ఏదో ఒక మైలు రాయి లేదా ఆధారం ఉండాలిగదా. దాన్నే గురువు అనుకోవచ్చు లేదా ఎవరో ఒక వ్యక్తిని మాట్లాడించినపుడు అతడు మన సమస్యను పరిష్కరిస్తే అతడినే గురువుగా భావించవచ్చు. చూడండి. మీరు సముద్రం మీద ప్రయాణిస్తున్నారు అనుకోండి. తీరం దాటి చాలా దూరం వెళ్ళాక , అక్కడ మీకు కేవలం జలరాశి మాత్రమే కనబడుతుంది. ఎక్కడ, ఎటు చూసినా నీరే. దిక్కు తెలీదు. దారి లేదు. అపుడు మీరు ఏ దిక్కుకు పోవాలనేది నిర్ణయించుకోడానికి ఆకాశంలోని నక్షత్రాల వైపు చూస్తారు. ఆ సందర్భంలో నక్షత్రాలే మీకు గురువు అవుతాయి.




1967 లో శ్రీ గురూజీ చికిత్స నిమిత్తం శిరసి లో ఉండగా జులై 7 న ప్రాంత సంఘచాలక్ డా. శ్రీ కాకాసాహెబ్ కులకర్ణి చూడటానికి వెళ్ళారు. అదే సమయంలో ఒక భూగర్భ శాస్త్రవేత్త శ్రీ గురూజీని కలవడానికి అక్కడికొచ్చారు. ఆ శాస్త్రవేత్త శిరసి చుట్టుపట్ల ఉన్న అరణ్యంతో సహా ,ఆ ప్రదేశాన్నంతా కూలంకషంగా సర్వే , అధ్యయనం చేసిన వ్యక్తి. మాటల సందర్భంలో శ్రీ గురూజీ ఆ శాస్త్రవేత్త ను ' ఇక్కడ చుట్టుప్రక్కల అగ్గిపుల్ల, అగరుబత్తీలు తయారుచేయడానికి యోగ్యమైన కట్టె ధారాళంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడకూడా దానికి సంబంధించిన పరిశ్రమ ఏదీ లేదెందుకు? ' అనడిగారు. అపుడు శ్రీ కాకాసాహెబ్ కులకర్ణి సహజంగా ' అలాంటి చెట్లను మీరెక్కడ చూశారు గురూజీ? అని ప్రశ్నించారు. ఆయనకు జవాబిస్తూ శ్రీ గురూజీ, కారులో వస్తున్నపుడు అలాంటి వందలాది వృక్షాలను నేను చూశాను అన్నారు. విశేషమేమిటంటే అక్కడే ఉన్నవారికి, అక్కడే పుట్టి పెరిగినవారికి గోచరించని సంగతి, శ్రీ గురూజీ సూక్ష్మదృష్టికి కన్పడింది.



1960 నవంబర్ 20 న ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణంలో కార్యక్రమం కొరకు ధార్వాడ నుండి శ్రీ గురూజీ బయల్దేరారు. మార్గమధ్యలో యల్లాపుర లో శ్రీ అనంతరామ్ భట్ అనే కార్యకర్త ఇంట్లో తేనీరు సేవించి, ప్రయాణం కొనసాగించాలనేది యోజన. శ్రీ భట్ గారు చాలా సంతోషంతో ఇంటిని అలంకరించారు. ఇంట్లోని హాల్ లో మధ్యన డాక్టర్ జీ, గురూజీ - ఇరువురూ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోకు కాగితంతో చేసిన పూలహారం అలంకరించారు. శ్రీ గురూజీ హాల్ లోకి రాగానే హాలంతా పరిశీలించారు. అక్కడ విశేషంగా అలంకరించిన ఫోటో కనబడగానే కాసేపు దాన్నే చూస్తూ నిలబడ్డారు. తర్వాత శ్రీ అనంతరామ్ భట్ వైపు చూస్తూ, ' ఫోటోకు హారం వేయాలనుకుంటే , నిజమైన పూలహారమే వేయాలి. కృత్రిమ హారం వేయడం సరికాదు' అన్నారు.
కృత్రిమపూల హారం అలంకారానికి ఉపయోగపడవచ్చు కానీ మనసులోని శ్రద్ధ దానివల్ల ప్రతిబింబించదు అని సూక్ష్మంగా ఆయన తెలియజేశారు.

- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete