Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 18 / 50



1963 నవంబర్ 12 న రాయచూరులో పథ సంచలనం. ధ్వజధారి స్వయంసేవక్ అశ్వారోహిగా ఉండాలని యోచన జరిగింది. ఒక ఎత్తైన గుర్రాన్ని ఎంపిక చేశారు. అయితే సంచలనం సమయంలో అపరిచితుల మధ్య, ఒక అపరిచితుడు తనపై కూర్చొని ఉండగా, అదికూడా ఘోష్ శబ్దాల మధ్య అది గాభరాపడి ఇబ్బంది కల్గించవచ్చు అని అన్పించింది. ఏంచేయాలా అని కొందరితో చర్చిస్తే , గుర్రానికి కాసింత గంజాయి తినిపిస్తే సమస్య రాదని ఎవరో సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే సంచలనానికి ముందే గుర్రానికి గంజాయి తిన్పించడం జరిగింది. దాంతో అది రాజఠీవితో అడుగులు వేయసాగింది. పథసంచలనం చూడటానికి శ్రీ గురూజీ వచ్చారు.చాలా మంది మహిళలు, పిల్లలు దారిపొడవునా నిలబడ్డారు. గుర్రానికి ఏమన్పించిందో ఏమో, శ్రీ గురూజీ ఉన్న చోటికి రాగానే అది అదుపు తప్పి గెంతులు వేయసాగింది. ధ్వజధారి అయిన బీదర్ కార్యకర్త శ్రీ బ్రిజపాల్ సింగ్ ఠాకూర్ కాస్త చాకచక్యంగా దాని లగామును గట్టిగా పట్టుకుని నియంత్రణలోకి తెచ్చాడు. పథసంచలనం విజయవంతం అయింది.
కార్యకర్తల బైఠక్ లో గుర్రం ప్రస్తావన వచ్చింది. ఆ గుర్రం మీకు చాలా కష్టం కల్గించింది కదా? అడిగారు శ్రీ గురూజీ. అపుడు ఠాకూర్ ,అలా ఏమీ లేదు. ఎందుకంటే దానికి (గుర్రానికి) ముందే కాసింత గంజాయి తిన్పించడం జరిగింది అన్నాడు. ఇది విన్న శ్రీ గురూజీ ఆశ్చర్యపోయి , గంజాయా! అది తిన్పించమని మీకు చెప్పిందెవరు? అనడిగారు. అది మొదట సహకరించే మనస్థితిలో లేదు. ఒకరి సలహాతో నేనే దానికి గంజాయి తినిపించాను. దాంతో అది అదుపులో ఉండింది. కాస్త గలాటా చేసింది , మీరున్న చోటికి రాగానే! అన్నాడు బ్రిజపాల్ సింగ్ ఠాకూర్. 
ఆరోజు బైఠక్ ఆ గుర్రం, గంజాయి సంఘటన తోనే ముగిసిపోయింది. ఆ తర్వాత ఏ బైఠక్ లోనైనా రాయచూరు కార్యకర్తల పరిచయం జరిగినపుడు శ్రీ గురూజీ అడిగే ప్రశ్న ' ఎలా ఉంది మీ రాయచూరు గుర్రం ' అని, ఆ సంఘటన తెలీనివారికి ఆయనే రసవత్తరంగా వివరించేవారు. మరో సందర్భంలో శాఖా నివేదిక ఇచ్చేటపుడు , సంఘకార్యం కాసింత తగ్గింది , కార్యకర్తల్లో నిష్క్రియత కనబడుతోందని చెప్పినపుడు శ్రీ గురూజీ హాస్యంగా ' కార్యకర్తలకు పావలా గంజాయి తిన్పించకూడదూ! ' అనేవారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. కార్యకర్తల బైఠక్ లో గుర్రం ప్రస్తావన వచ్చింది. ఆ గుర్రం మీకు చాలా కష్టం కల్గించింది కదా? అడిగారు శ్రీ గురూజీ.

    ReplyDelete